ప్రభుత్వ భవనం... ప్రైవేటు వ్యాపారం
► పాలకేంద్రంలో కన్‌స్ట్రక్షన్ సెంటర్
► అధికార పార్టీ నాయకుడి నిర్వాకం..?
వేములవాడ రూరల్ : ఏం చేసిన చెల్లుతుందనే భరోసా.. ఎవరికీ ఫిర్యాదు చేసిన ఏమవుతుందిలే అనే ధీమాతో అధికారపార్టీ నాయకులు అడుగడుగునా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఎమ్మెల్యే అండ ఉందనే అధికారపార్టీ నాయకుడు ఏకంగా ప్రభుత్వ భవనంలో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్యాలయూన్ని ప్రారంభించాడు. బోర్డు పెట్టేసి శుక్రవారం పూజ కార్యక్రమాలు సైతం చేసేశాడు.మధ్యమానేరు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న అనుపురం గ్రామస్తులకు పునరావాసం కింద ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. ఆ స్థలంలో ప్రస్తుతం నిర్మించిన పాలకేంద్ర భవనం ఉంది. ఆ భవనంలో అనుపురం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు ఎర్రం మహేశ్ ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌గా బోర్డు పెట్టేశారు.
ఏకంగా పలువురు ప్రజాప్రతినిధులను పిలిపించి శుక్రవారం ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. కొద్దిరోజుల్లో ఈ ప్రాంతంలో పునరావాస స్థలంలో అనుపురం గ్రామస్తులు ఇళ్ల నిర్మాణాలను చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందస్తుగా సదరు నాయకుడు ఆ ప్రాంతంలో ఆ భవనాన్ని తీసుకుని కార్యాలయాన్ని ఏర్పాటుచేసుకోవడం చర్చనీయూంశమైంది. ప్రభుత్వ భవనాన్ని పూర్తిచేసి పంచాయతీ అధికారులకు అప్పగించిన తర్వాత దాన్ని ప్రైవే టు వ్యక్తులు ఉపయోగించుకోరాదనే నిబంధనలను సైతం కాలరాశారు. ఈ విషయంపై సర్పంచ్ మ్యాకల రవిని వివరణ కోరగా.. తమకు భవనాన్ని ఇంకా అప్పగించలేదని చెప్పారు. పాలకేంద్రం అధ్యక్షుడిని వివరణ కోరగా ఎర్రం మహేశ్ నాలుగు రోజులు వాడుకుంటానని కోరారే తప్పా వ్యాపార కార్యక్రమాల కోసం అద్దెకు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అరుుతే ఇందులో వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకున్నా.. వారు మాత్రం పాలకేంద్రం కమిటీ ఒప్పందంతోనే తీసుకున్నామని చెప్పడం కొసమెరుపు.
తప్పు చేస్తే చర్యలు తప్పవు..
ప్రభుత్వ ఆస్తులను అనుమతి లేకుండా వినియోగించుకున్న వారెవరైనా సరే చర్యలు తప్పవని డీపీవో సూరజ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వ పాలకేంద్ర భవనంలో క న్‌స్ట్రక్షన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడంపై విచారణ జరుపుతానని, ప్రభుత్వ భవనాలను ఎవరికి కేటాయించే అవకాశం లేదని తెలిపారు. ఒక వేళ అలాంటిదేమైనా ఉంటే దీనికి సంబంధించిన అందరిపై చర్యలు తీసుకుంటానని అన్నారు.