
కొడుకులు కాదు.. కర్కోటకులు
► కన్నతల్లిని గెంటేసిన ప్రబుద్ధులు
► కాలు విరిగి అచేతనంగా ఉన్నా కనికరం చూపని వైనం
► స్థానికుల జోక్యంతో తిరిగి తీసుకెళ్లిన వైనం
సిరిసిల్ల టౌన్ : జీవనమలి సంధ్యలో ఉన్న తల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే కర్కశత్వం చూపించారు. కాలు విరిగి అచేతనంగా ఉన్నా కనికరం చూపకుండా ఇంట్లోంచి గెంటేయగా స్థానికులు బుద్ధి చెప్పారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగ ర్‌కు చెందిన భారతం గంగవ్వ(75) భర్త పోచయ్య చాలా ఏళ్ల క్రితమే చనిపోగా.. ఇద్దరు కొడుకుల వద్ద ఉంటోంది. నెలరోజుల క్రితం ఇంట్లో జారిపడగా కాలు విరిగింది. అప్పటి నుంచి ఆమెకు సేవలు చేయాల్సి వస్తుందన్న భావనతో 15 రోజుల క్రితం ఇంట్లోంచి బయటకు పంపి, ఎదురుగా ఉన్న పాడుబడిన తోపుడుబండిపై ఉంచారు. ఇది గమనించిన స్థానికులు ఆమెకు అన్నం పెడుతూ వచ్చారు. విషయం మీడియాకు శనివారం తెలిసి అక్కడికి వెళ్లగా... స్థానికులు కొడుకులకు బుద్ధి చెప్పారు. వెంటనే కొడుకులు తల్లిని ఇంట్లోకి తీసుకెళ్లారు.