కళకళ.. నిగనిగ.. గలగల
ఇదే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ‘మహబూబ్‌నగర్ చాలా వెనుకబడిన జిల్లా. రాష్ట్రంలో అత్యధిక చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు అన్నీ కలుపుకుని 7,480 నీటి వనరులు జిల్లాలో ఉన్నాయి. అందుకే ‘మిషన్ కాకతీయ’పై అవగాహన సదస్సు ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నాం.’ అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చెరువులు, కుంటల పునరుద్ధరణ కార్యక్రమం ‘మిషన్ కాకతీయ’పై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నీరు మనిషికి ఆధారం. ఊరుకు చెరువూ అంతే ఆధారం. ఇది ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కార్యక్రమం.
ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనను మీ ముందు పెట్టి, సల హాలు తీసుకునేందుకే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాం’ అని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. జిల్లాలో 6,475 చెరువులు, కుంటలను పునరుద్ధరిస్తే జరిగే ప్రయోజనాలను మంత్రి వివరించారు. గంగాళంగా ఉండే చెరువులు తాంబాళంలా మారాయన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత కోసం ప్రభుత్వం ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి, పనులు పారదర్శకంగా చేపడుతుందని వెల్లడించారు. చెరువుల్లో తీసే పూడిక మట్టిని తరలించుకుంటే రైతులకు కలిగే ప్రయోజనాలను మంత్రి వివరించారు. కాకతీయ మిషన్ ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మండల స్థాయిలోనూ అవగాహన సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్‌రావు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.
సిబ్బంది కొరత లేకుండా చూస్తాం
కళకళలాడే చెరువులు, నిగనిగలాడే రోడ్లు, గలాగల పారే మంచినీటి పథకాలు లక్ష్యంగా కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి హరీష్ వ్యాఖ్యానించారు. నీటి పారుదల శాఖలో సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదం తెలిపిన నిధులు, పనుల వివరాలు మంత్రి వెల్లడించారు. డిసెంబరు నెలాఖరుకల్లా మిషన్ కాకతీయ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, సంపత్‌కుమార్, రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో సుడిగాలి పర్యటన
మహబూబ్‌నగర్ జిల్లా పర్యటన సందర్భంగా గురువారం జిల్లాలో పలు కార్యక్రమాలకు మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డుల్లో రైతుల విశ్రాంతి గృహాలకు శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌ఈ కార్యాలయ భవనం (జలసౌధ)ను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువును పరిశీలించి పునరుద్ధరణకు హామీ ఇచ్చారు. అనంతరం కొత్తకోటలో శంకర సముద్రం రిజర్వాయర్‌ను సందర్శించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.