
‘కిలా’కు చేరుకున్న మంత్రి జూపల్లి బృందం
నేడు, రేపు కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం కేరళకు బయల్దేరి వెళ్లిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు త్రిశూర్ జిల్లాలోని కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్(కిలా)కు చేరుకున్నారు. అంతకు ముందు కొచ్చి విమానాశ్రయంలో మంత్రికి శ్రీమూల నగర పంచాయతీ పాలకవర్గం ఘనంగా స్వాగతం పలికింది. ఎయిర్ పోర్టు పరిధిలోని తమ గ్రామాన్ని సందర్శించాలని పంచాయతీ ప్రెసిడెంట్ ఆల్ఫోన్సా వర్గీస్, వైస్ ప్రెసిడెంట్ కేసీ మార్టిన్, సభ్యులు వీవీ సెబాస్టియన్, మంజు తదితరులు మంత్రి జూపల్లి కృష్ణారావును ఆహ్వానించారు. కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరుపై ఎరుుర్ పోర్టు లాంజ్‌లోనే కొంతసేపు గ్రామ పంచాయతీ ప్రతినిధులతో మంత్రి చర్చించారు.
తమ గ్రామంలో దాదాపు 25 వేల జనాభా ఉంటుందని, ప్రతి ఇంటికి ఓపెన్ వెల్స్ ద్వారానే మంచినీటిని సరఫరా చేస్తున్నామని వారు వివరించారు. ప్రతి ఇంటికీ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించినట్లు మంత్రికి తెలిపారు. ఎయిర్ పోర్టులో మంత్రి జూపల్లి నేతృత్వంలో వచ్చిన తెలంగాణ అధికారుల బృందానికి ‘కిలా’ప్రొఫెసర్ రామకృష్ణ సాదర స్వాగతం పలికారు. రాత్రికి త్రిసూర్‌లోని కేరళ ఇనిస్టిట్యూట్‌లోనే బసచేసిన అధికారుల బృందం.. శుక్రవారం ఉదయం కిలా డెరైక్టర్, ఇతర ప్రతినిధులతో భేటి కానుంది. అనంతరం వెంకిటంగు గ్రామ పంచాయతీని జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెస్లీ, శేషాద్రి సందర్శించనున్నారు. శనివారం ఎర్నాకులం జిల్లా పంచాయతీ, ఒట్టపాలం బ్లాక్ పంచాయతీలను బృందం పరిశీలించనుంది.