స్వైన్ భయం | The threat of swine | Sakshi
Sakshi News home page

స్వైన్ భయం

Published Thu, Jan 22 2015 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

స్వైన్ భయం

స్వైన్ భయం

కోల్‌సిటీ: ఐదేళ్ల క్రితం జిల్లాను గడగడలాడించిన స్వైన్‌ఫ్లూ వ్యాధి మళ్లీ ప్రజలను వణికిస్తోంది. గతకొద్ది రోజులుగా రాజధానిలో పంజా విసురుతూ ఇప్పటికే పదకొండు నిండుప్రాణాలను బలిగొన్నది. జిల్లాకు చెందిన పలువురు వివిధ దేశాలు, రాష్ట్రాలకు తరుచూ రాకపోకలు సాగిస్తుంటారు. హైదరాబాద్‌కు నిత్యం వేలాది మంది వెళ్లివస్తుంటారు. జిల్లాకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడ చదువుతున్నారు. వేలాది మంది జిల్లావాసులు రాజధానిలోని పలు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.

దీంతో జిల్లాకు కూడా ఈ వైరస్ ఎక్కడ అంటుకుంటుందోనని జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే స్వైన్‌ఫ్లూ నివారణ కోసం జిల్లాలో మాస్క్‌లు కొనుగోలు చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఈ వ్యాధి సోకకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో వైద్య, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
 
జిల్లాలో 2009 సెప్టెంబర్‌లో గోదావరిఖనిలో మొదటి స్వైన్‌ఫ్లూ కేసు నమోదయింది. గోదావరిఖని కళ్యాణ్‌నగర్‌కు చెందిన మూడున్నరేళ్ల బాలునికి హెచ్1ఎన్1 వైరస్ సోకినట్టు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రి వైద్యులు నిర్దారించారు. అమెరికాలో స్థిరపడిన జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు 2009లో హైదరాబాద్ రాగా వీరికి స్వైన్‌ఫ్లూ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. వారంతా వెంటనే మెరుగైన వైద్యం తీసుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

2009లో జిల్లాలోని ముఖ్యమైన ప్రభుత్వాస్పత్రుల్లో వైరల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియా (వీటీఎం)ను అందుబాటులో ఉంచారు. వీటీఎంల ద్వారా అనుమానిత రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించి హైదరాబాద్‌లో పరీక్షలకు పంపించారు. ముఖ్యమైన ఆసుపత్రుల్లో కనీసం ఐదుగురు రోగులకు అందజేసేందుకు టామీఫ్లూ మాత్రలు అందుబాటులో ఉంచారు. ఇప్పుడు స్వైన్‌ఫ్లూ వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలున్నాయి.
 
స్వైన్‌ఫ్లూ లక్షణాలు - నివారణ
స్వైన్‌ప్లూ హెచ్1ఎన్1 అనే వైరస్‌తో వ్యాప్తి చెందుతుంది. ఇది మనిషి నుంచి మనిషికి గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఫ్లూ వ్యాధి మాదిరి ఉండి ఊపిరితిత్తుల అంతర భాగాలకు సోకి ప్రమాదకరంగా మారుతుంది. ప్రాణాపాయం సంభవించే ప్రమాదముంది. మనిషి నుంచి మనిషికి దగ్గినపుడు, తుమ్మినపుడు, మాట్లాడుతున్నపుడు వచ్చే తుంపర్లతో వ్యాప్తి చెందుతుంది. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, శ్వాసతీసుకోలేక ఇబ్బంది పడడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. రోజుకో లవంగం తిని, లవంగం నూనెను వాసన చూడాలి. నీలగిరి నూనెను మాస్క్‌లు, ఖర్చీఫ్‌లలో రెండు చుక్కలు వేసిన వాసన చూడాలి. అల్లం, ఉల్లిలను నిత్యం ఉపయోగించాలి. బయటకు వెళ్లే సమయంలో మాస్క్ ధరించాలి. బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన సమయంలో సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవాలి.
 
వీరు జాగ్రత్త
ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లకు పైబడినవారు, గర్భిణులు, మధుమేహం, ఆస్తమా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వీరికి తేలికగా వ్యాధి వ్యాపిస్తుంది. ధూమపాన, మద్యపానం చేసేవారికి వెంటనే సోకే అవకాశాలు ఎక్కువ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement