వాహ్..తీజ్
గిరిజన ఆడపడుచుల సంప్రదాయ ఉత్సవం
ఏటా రాఖీ పౌర్ణమితో షురూ..
తండాల్లో కొనసాగుతున్న తీజోత్సవం..
ఉట్నూర్ : గిరిజన ఆడపడుచుల సంప్రదాయ ఉత్సవం తీజోత్సవం ఆరంభమైంది. జిల్లాలోని గిరిజన తండాల్లో ఉత్సవాలను గిరిజనులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఏటా రాఖీ పౌర్ణమితో ఆరంభమయ్యే ఈ పండుగ.. శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు కొనసాగుతుంది. తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తారు. ఈ తీజ్ ఉత్సవాల్లో గో ధుమలు వినియోగించడం ఓ ప్రత్యేకమైతే.. తీజ్ అంటే పచ్చదనం అనే అర్థం ఉండడం మరో విశేషం. తండాల్లో కొనసాగుతున్న తీజ్ సంబరాలపై ఈ వారం సండే స్పెషల్..
ఉత్సవంలో భాగంగా తొమ్మిదో రోజు సాయంత్రం తండా పెద్ద(నాయక్) ఇంటి ఎదుట మొలకెత్తిన గోధుమ బుట్టల్లో నుం చి కొన్ని గోధుమ మొలకలను తండా పెద్దల తల పాగాల్లో పెడుతారు. ఆరాధ్య దైవాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బు ట్టలను నెత్తిన పెట్టుకుని సంప్రదాయ పద్ధతుల్లో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ తండా శివారుల్లో ఉండే నీటి వనరుల్లో వాటిని నిమజ్జనం చేస్తారు. అయితే ఈ క్రమంలో వచ్చే ఏడాది తాము తీజ్ ఆడుతామో లేదోననే ఆందోళన పెళ్లి యువతుల్లో కనిపిస్తుంది. అంతకుముందు గ్రామంలో పెళ్లి కాని గిరిజన యువకులు చేతుల్లో పీడీయాను పట్టుకుని ఉంటారు.
పెళ్లి కాని యువతులు ఆ యువకుల చేతిలోని పీడీయాను వివిధ ప్రయత్నాలు చేస్తూ విడిపిస్తారు. అయితే పీడీయా పట్టుకున్న వ్యక్తి ఇంటి పేరు విడిపించే యువతుల ఇంటి పేర్లు ఒక్కటి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాకుండా బుట్టలను నెత్తిన ఎత్తుకున్న యువతుల పాదాలను ఆమె సోదరులు నీళ్లతో కడిగి ఆశీర్వాదం పొందుతారు. ‘‘ఈ తీజ్ ఉత్సవాల ద్వారా యువతులు కోరుకున్న కోరికలు తీరుతాయని, తండాల్లో అందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా గడుపుతారని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయని గిరిజ న పెద్దలు చెబుతుంటారు.’’ ఈ వేడుకల్లో పెళ్లికాని యువతులే పాల్గొనడం విశేషం.
ఏటా రాఖీపౌర్ణమి రోజు నుంచి శ్రీకృష్ణాష్టమి వరకు తీజ్ ఉత్సవాలు జరుగుతాయి. పెళ్లికాని యువతులు, చిన్నారులు తొమ్మిది రోజులపాటు ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ముందుగా తండాల్లో పెద్దలు ప్రతి ఇంటి నుంచి గోధుమలు సేకరిస్తారు. చిన్న చిన్న వెదురు బుట్టలు కొనుగోలు చేస్తారు. సేకరించిన గోధుమలను రోజంతా నీళ్లలో నానబెడుతారు. పెళ్లి కాని యువతులు తండాలకు సమీపంలో చీమల పుట్ట మన్ను(మకొడ ధూడ్) తీసుకువచ్చి వెదురు బుట్టల్లో నింపుతారు.
రాఖీపౌర్ణమి రోజున ఆ బుట్టల్లో ప్రత్యేక పూజలతో గోధుమలు మొలకెత్తడానికి చల్లుతారు. అనంతరం తండా పెద్ద ఇంటి సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచె, పందిరిపై స్థలంలో బుట్టలు పెడుతారు. యువతులు ఉపవాస దీక్షతో ప్రతీరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పవిత్ర జలాలు పోస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఎనిమిది రోజుల పాటు సాయంత్రం వేళ గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉత్సవం నిర్వహిస్తుంటారు.