ఆనందం.. అంతలోనే విషాదం
శుభకార్యం కోసం కట్టిన తోరణాలు వాడనేలేదు. బంధువుల సందడి తో ఇళ్లంతా పండగే.. అంతలోనే ఆ ఇంట అంతులేని విషాదం అలుముకుంది. కుమారుడి పెళ్లి మొక్కు తీర్చుకునేందుకు ఆనందం తో షిర్డీ వెళ్లిన మామిడాల సులోచన (55) నాందేడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ రామాచారి (25) కూడా మృత్యువాతపడ్డారు. ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి. రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
కామారెడ్డి : పట్టణంలోని జన్మభూమిరోడ్డులో స్థిర నివాసం ఏర్పర్చుకున్న రిటైర్డ్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ మామిడాల సుధాకర్‌రావు, సులోచన దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు అభిషేక్ ఉన్నాడు. ఉన్నత విద్యనభ్యసించిన అభిషేక్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి నిశ్చయం కావడంతో పది రోజుల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌లో గౌతమితో అతడికి వివాహమైంది. 10వ తేదీన కామారెడ్డిలో రిసెప్షన్ జరిగింది. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం 11వ తేదీ సాయంత్రం డాక్టర్ సుధాకర్‌రావు ఆయన భార్య సులోచన, నవదంపతులు ఇన్నోవాలో షిర్డీకి వెళ్లి మొక్కు తీర్చుకున్నారు.
గురువారం సాయంత్రం కామారెడ్డికి తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 10.30 గంటల సమయంలో నాందేడ్ సమీపంలో ఎదురుగా వస్తున్న కంటెయినర్ వీరి వాహనాన్ని ఢీకొనడంతో సులోచన తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడి మృత్యువాతపడ్డారు. సుధాకర్‌రావు తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లారు. గౌతమి, అభిషేక్‌లకూ గాయాలయ్యాయి. వారు నాందేడ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సుధాకర్‌రావును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ‘అమ్మ మంచిగ చూసుకునేది. రాత్రి ఫోన్ చేసి తెల్లారేసరికి ఇంటికి వస్తమన్నరు. లేవంగనే దుర్వార్త ఇనాల్సి వచ్చింది’ అంటూ సుధాకర్‌రావు ఇంట్లో పనిచేసే సత్తవ్వ రోదిస్తూ తెలిపింది.
డ్రైవర్ కుటుంబంలో..
ఇన్నోవా వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ రామాచారి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. నిజామాబాద్ మండలంలోని మాధవనగర్‌కు చెందిన రామాచారి కొంత కాలంగా కామారెడ్డిలో ఇన్నోవా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం మాచారెడ్డి మండలం ఎల్పుగొండకు చెందిన భాగ్యతో వివాహమైంది. ఆయన భార్య భాగ్య ప్రస్తుతం గర్భిణి. అయితే రామాచారి మరణించిన విషయాన్ని ఆయన భార్యకు తెలపలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రమాదంలో గాయపడ్డాడని మాత్రమే చెప్పామని అంటున్నారు. దీంతో ఇంటికి ఎవరు వెళ్లినా ‘ఆయనకు ఫోన్ కలుస్తలేదు. మీరైనా ఫోన్ చేసి ఎట్లుండో తెలుసుకోండ్రి’ అంటూ భాగ్య అడుగుతుండడం అక్కడున్నవారిని కలచివేస్తోంది. రామాచారి మృతదేహాన్ని తీసుకురావడానికి ఆయన స్నేహితులు, బంధువులు నాందేడ్‌కు వెళ్లారు.