అప్పుడు వందల్లో.. ఇప్పుడు వేలల్లో..
* ఎంసెట్ 2 లీకేజీ ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థులకు చుక్కెదురు
* లీకేజీని బయటపెట్టిన వ్యక్తి కూతురికి మెరుగైన ర్యాంకు
సాక్షి,హైదరాబాద్/భూపాలపల్లి/పరకాల: ఎంసెట్-2 పేపర్ లీకేజీకి పాల్పడి మంచి ర్యాంకులు సాధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు విద్యార్థులకు ఎంసెట్-3లో చుక్కెదురైంది. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంసెట్ -2లో 704, 295 ర్యాంకులు రాగా, తాజాగా ఎంసెట్-3లో ఏకంగా 15 వేలు, 9 వేల పై చిలుకు ర్యాంకులకు పడిపోయారు. వీరికి ఎంసెట్-1లో కూడా 20 వేలు, 9 వేల పై చిలుకు ర్యాంకులు రావడం గమనార్హం! ఇక ఎంసెట్-2లో 800 లోపు, 900 లోపు ర్యాంకులతో రాణించిన మరో ఇద్దరు విద్యార్థులకు ప్రస్తుతం 13 వేలు, 24 వేల పై చిలుకు ర్యాంకులు వచ్చాయి.
వీరికి ఎంసెట్-1లో 17 వేల పై ర్యాంకులు వచ్చాయి. నిజానికి ఎంసెట్-3లో వీరికి అసాధారణ ర్యాంకులు రావడాన్ని అనుమానించి తోటి విద్యార్థినులుతమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఎంసెట్ పేపర్-2 లీకేజీ జరిగిందని ఆరోపించారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారాన్ని బహిర్గతం చేసిన వరంగల్ జిల్లా పరకాల పట్టణానికి చెందిన గుండెబోరుున రవి కుమార్తె ప్రజ్ఞ ర్యాంకు ఈసారి కాస్త మెరుగైంది. ఆమెకు ఎంసెట్-2లో 3,823వ ర్యాంకు రాగా తాజాగా ఎంసెట్-3లో 3,200 ర్యాంకు వచ్చింది.
ఎంసెట్-2 సందర్భంగా తన కుమార్తెతో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు వారం ముందు మాయమై, చివరికి ర్యాంకులు తెచ్చుకోవడంతో అనుమానించిన రవి.. తెలంగాణ, ఏపీల్లో ఎంసెట్ ర్యాంకులు, మార్కుల ఆధారాలు సేకరించారు. ఎంసెట్-2లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. లీకేజీ నిజమేనని తేలడంతో జూలై 29వ తేదీన ఎంసెట్-2ను రద్దు చేసింది.