కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఎక్కువయ్యారు | There are more CM candidates in the Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఎక్కువయ్యారు

Published Thu, May 10 2018 8:50 AM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM

There are more CM candidates in the Congress - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు

పాపన్నపేట(మెదక్‌): ‘కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులు ఎక్కువయ్యారు. పాపం ఎమ్మెల్యే అభ్యర్థులు తక్కువయ్యారు’. అంటూ రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు  దెప్పి పొడిచారు. బుధవారం మెదక్‌ పట్టణంలో జరిగిన సీఎం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ విధానాలపై దేశం అంతా మెచ్చుకుంటుంటే.. కాంగ్రెస్‌  మాత్రం నొచ్చుకుంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా మెదక్‌ జిల్లాకు సాగునీరందించేందుకు కృషి చేస్తుంటే కాంగ్రెసోళ్లు కేసులు వేస్తున్నారని ఆరోపించారు.

మెతుకుసీమకు ప్రాణాధారమైన మంజీరానదిలోని ప్రతినీటిబొట్టును వినియోగించుకుంటూ రైతన్నల బతుకులు మారుస్తామని స్పష్టం చేశారు. 65 యేళ్ల కాంగ్రెస్‌ పాలనలో 110 సంవత్సరాల ఘనపురం ఆనకట్ట చరిత్రలో రైతులు ఆందోళన చేయకుండా నోటిమాట కూడా అడక్కుండానే వారి పంట పొలాలకు సింగూర్‌ నుంచి సాగు నీరిచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వందేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మెదక్‌జిల్లాపై పూర్తి అవగాహన ఉందన్నారు.

అందుకే రూ.100కోట్లతో ఆనకట్ట ఎత్తు పెంచేందుకు నిర్ణయం తీసుకోవడంతోపాటు కాల్వల ఆధునీకరణ చేయడం జరిగిందన్నారు. తద్వారా ఈయేడు 25వేల ఎకరాల్లో వరిపంట పండిందన్నారు.   కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉంటే జిల్లాకు రైలు వచ్చేదా? అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్‌ నాటికి రైలు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలు, ప్రాజెక్ట్‌లపై సీడబ్లు్యసీ చైర్మన్‌ మసూద్‌ హుస్సెన్, బిహర్, కర్ణాటక మంత్రులు మెచ్చుకుంటున్నారని తెలిపారు.

హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మెదక్‌ ప్రజల 60యేళ్ల కలను సాకారం చేశారని తెలిపారు. మెదక్‌ డీఎస్పీ కార్యాలయానికి రూ.40లక్షలు, టేక్మాల్, జోగిపేట పోలీస్‌ స్టేషన్‌ భవనాలకు రూ.1కోటి, మెదక్‌లో సీఐ కార్యాలయానికి రూ.40లక్షలు, జోగిపేటలో రిషప్షన్‌ సెంటర్‌కు రూ.1.50కోట్లు, మెదక్‌లో పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ భవనానికి రూ.10కోట్లు, తూప్రాన్‌లో  సీఐ కార్యాలయానికి రూ.35లక్షలు మంజూరు చేశామని తెలిపారు.

జిల్లాలో సుమారు రూ.35.65కోట్ల వ్యయంతో పోలీసు భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వెనకబడిన మెదక్‌ జిల్లాలో రైల్వేలైన్, హైవే, మెదక్‌చర్చి, ఘనపురం ఆనకట్ట, ఏడుపాయల దేవస్థాన అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేశామని తెలిపారు.   టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలను కర్ణాటకలో బీజేపీ తన ఎన్నికల మెనిఫేస్టోలో పెట్టిందన్నారు.

 సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు రాములు నాయక్, సుధాకర్‌రెడ్డి, ఫరీరుద్దీన్, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, బాబుమోహన్, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, జెడ్పీచైర్మన్‌ రాజమణి,  చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, జేసి నగేష్, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్, ఎంపీపీ లక్ష్మీకిష్టయ్య పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement