రబీకి కరెంటివ్వలేం
వరి వద్దు.. ఆరుతడి పంటలే వేసుకోండి: సీఎం కేసీఆర్
విద్యుత్ సంక్షోభం వల్ల వరి వేయవద్దని రైతులకు విజ్ఞప్తి
ఖరీఫ్‌లో ఎంతచేసినా కరెంట్ ఇవ్వలేకపోయాం
ఆంధ్రప్రదేశ్ నుంచి 54 శాతం వాటా రావడం లేదు
శ్రీశైలంలో ఉత్పత్తికీ అడ్డుపడుతూ కుట్ర చేస్తోంది
కేంద్రం కూడా రాష్ట్రంపై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోంది
రెండుమూడే ళ్లలో విద్యుత్ సమస్య తీరిపోతుందని వివరణ
ప్రకటన జారీ చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం
సాక్షి, హైదరాబాద్:ఖరీఫ్ సీజన్‌లోనే తీవ్ర కరెంట్ కష్టాలను ఎదుర్కొన్న నేపథ్యంలో రబీలో విద్యుత్ ఇవ్వలేమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. రబీలో వరి పంట వేసుకోవద్దని, ఆరుతడి పంటలే వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్‌లో ఆశించిన మేరకు విద్యుత్ ఇవ్వలేకపోయామని ఆయన అంగీకరించారు. ఆంధ్రా నుంచి రావాల్సిన విద్యుత్ రావడం లేదని, కేంద్ర ప్రభుత్వం కూడా కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. మూడేళ్లలో పరిస్థితి కుదుటపడుతుందని భరోసానిచ్చారు. ఈ మేరకు సీఎం కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ర్టం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభానికి కారణాలను కేసీఆర్ అందులో వివరించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఏపీ సర్కారు 54 శాతం వాటా ఇవ్వకపోవడం వల్లనే తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయకుండా ఏపీ అడ్డుకుంటోందని ఆరోపించారు.
ఈ కుట్రను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, దీన్ని ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విభజన చట్టం మేరకు విద్యుత్ సరఫరా చేసేలా ఏపీని ఒప్పించాల్సిన కేంద్రం కూడా సహకరించడం లేదని, తమ సర్కారుపై కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమైన మేరకు పవర్ ఎక్స్చేంజి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని, అయినా డిమాండ్‌ను తట్టుకోలేక పోతున్నామన్నారు. రాష్ర్టంలో విద్యుత్ విని యోగం భారీగా పెరగడంతో శ్రీశైలంతోపాటు నాగార్జునసాగర్‌లోనూ విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. గత పాలకులు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయని ఫలితంగానే ఇప్పుడు రాష్ర్టం తీవ్ర కరెంటు కొరతను ఎదుర్కొంటోందన్నారు. రెండుమూడేళ్లపాటు ఈ కష్టాలుంటాయని ఎన్నికల సమయంలోనే ప్రజలకు వివరించినట్లు ఆయన గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఈ స్థాయిలో డిమాండ్ లేదని, ప్రస్తుతం డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయిందని సీఎం వివరించారు. రబీ సీజన్‌లో రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ వరి పంట వేయొద్దని, ఆరుతడి పంటలు వేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏడాదిలో కొంతమేర, రెండుమూడేళ్లలో పూర్తిగా సమస్య తీరిపోతుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
నేడు ఛత్తీస్‌గఢ్‌కు సీఎం, ఆర్థిక మంత్రి
ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి సీఎంతో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, సీఎం కార్యాలయ అధికారులు ఆదివారం ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాయ్‌పూర్ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. సోమవారం సాయంత్రం సీఎం బృందం తిరిగి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో రానుంది.