rubby crops
-
కరువుతో ఎండిపోతున్న రబీ పంటలు
పంటల సాగు విస్తీర్ణం 57 శాతానికి మించని వైనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుండటంతో రబీ పంటలు ఎండిపోతున్నాయి. రబీలో పంటల సాగు విస్తీర్ణమే 57 శాతానికి మించలేదు. వేసిన ఆ కొన్ని పంటలనూ కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. ప్రధానంగా వరి, పప్పుధాన్యాలు, వేరుశనగ తదితర పంటలు ఎండిపోతున్నాయి. పంట కాలం పూర్తయ్యే నాటికి ఇవి పూర్తిగా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. రబీలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 31.32 లక్షల ఎకరాలు కాగా... కేవలం 17.87 లక్షల ఎకరాల్లోనే (57%) సాగు చేశారు. అందులో వరి సాగు సాధారణ విస్తీర్ణం 16.12 లక్షల ఎకరాలు కాగా... కేవలం 6.3 లక్షల (39%) ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. మొత్తంగా సాగు విస్తీర్ణం తక్కువైనా ఉన్న వాటిని కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. రబీలో సాధారణంగా 129.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ ఇప్పటివరకు కేవలం 27.5 సెంటీమీటర్లు మాత్రమే కురిసింది. ఏకంగా 79 శాతం లోటు వర్షపాతం రికార్డు అయింది. ఫలితంగా భూగర్భ జలాలు పాతాళంలోకి దిగజారాయి. జలాశయాల్లో నీటి నిల్వలు గతేడాది కంటే భారీగా తగ్గిపోయాయని వ్యవసాయశాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. -
రైతులు రాలిన పీడకాలం!
* ఒక్క నెలలోనే 134 మంది ఆత్మహత్య * బలవన్మరణాలకు పాల్పడిన వారి వివరాలతో సర్కారుకు నివేదిక * అత్యధికంగా మెదక్ జిల్లాలో 30, నల్లగొండ జిల్లాలో 27 మంది ఆత్మహత్య * బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు జిల్లాలకు వ్యవసాయ బృందాలు * నేటి నుంచి రెండు రోజుల పాటు సీనియర్ అధికారుల జిల్లా పర్యటనలు * ఆత్మహత్యల నేపథ్యం పరిశీలన, ఆయా కుటుంబాలకు భరోసా కల్పించడమే లక్ష్యం సాక్షి, హైదరాబాద్: వర్షాభావం, పంట నష్టం, అప్పుల బాధ, వడ్డీ వ్యాపారుల వేధింపులు, పట్టించుకోని ప్రభుత్వం... వెరసి రాష్ట్రంలో రైతన్న రోజూ ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నాడు... అందరికీ అన్నం పెట్టే చెయ్యిని అన్ని చోట్లా చాచలేక, చెయ్యి చాచినా అప్పుపుట్టే దిక్కులేక.. రోజూ ఉసురు తీసుకుంటూనే ఉన్నాడు.. ఆరుగాలం కష్టపడి అందరి కడుపూ నింపుతున్నా.. తన వాళ్లకే పట్టెడన్నం దొరికే దిక్కులేక రోజూ ప్రాణం వదులుతూనే ఉన్నాడు.. రాష్ట్రంలో సెప్టెంబర్ ఒక్క నెలలోనే 134 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నివేదికలో ఇది వెల్లడైంది. ఖరీఫ్ ముగిసినా సెప్టెంబర్ నెలలో పంటలు చేతికి వచ్చే పరిస్థితి కానరాకపోవడం, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వకపోవడం, రబీపై సర్కారు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వంటి అంశాలే అన్నదాతల బలవన్మరణాలకు కారణాలవుతున్నాయి. దీనికితోడు ఆదుకునే చర్యలు చేపడతామని, ఆత్మహత్యలకు పాల్పడవద్దన్న సర్కారు మాటలను రైతులు విశ్వసించడం లేదనే అభిప్రాయం వస్తోంది. కష్టాల్లో ఉన్న రైతులకు తక్షణం ఎలాంటి భరోసా, ఆర్థిక హామీ ఇవ్వకపోవడం ఆత్మహత్యలకు మరో కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వం కేవలం పరిహారం పెంపునకే పరిమితం కావడంతో.. రైతుల బలవన్మరణాలు ఆగలేదు. సెప్టెంబర్ నెలలో అత్యధికంగా మెదక్ జిల్లాలో 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా... నల్లగొండ జిల్లాలో 27 మంది, కరీంనగర్ జిల్లాలో 25 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే వీరిలో ఎంత మంది రైతులు వ్యవసాయ సంబంధ అప్పులు, పంట నష్టం తదితర కారణాలతో చనిపోయారనే దానిపై ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. వ్యక్తిగత కారణాలతో ఎందరు చనిపోయారనే అంశాన్ని పరిశీలిస్తోంది. వ్యవసాయ సంబంధ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నవారినే వాస్తవమైనవిగా పరిగణించి ఆయా కుటుంబాలకే పరిహారం ఇవ్వనుంది. భరోసా కల్పించేందుకు.. గత నెలలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను వ్యవసాయశాఖ పరామర్శించనుంది. బాధిత కుటుంబాలను అధికారుల బృందం కలసి ధైర్యం కల్పించనుంది. ఈ మేరకు రాష్ట్రస్థాయి సీనియర్ వ్యవసాయ అధికారులతో జిల్లాకు ఒక బృందం చొప్పున పంపారు. ఆ బృందాలు బుధ, గురువారాల్లో బాధిత రైతు కుటుంబాలను పరామర్శిస్తాయి. ఆయా కుటుంబాల ఆర్థిక సమస్యలు, సామాజిక, మానసిక పరిస్థితిని అధ్యయనం చేయడంతోపాటు ఇతరత్రా కారణాలేమైనా ఆత్మహత్యకు పురిగొల్పాయా అన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తారు. వ్యవసాయశాఖ ప్రవేశపెట్టిన పథకాలు వారికి చేరాయా, లేదా అనే వివరాలను తెలుసుకుంటారు. ఆ కుటుంబాల్లోని పిల్లలను సంక్షేమ స్కూళ్లు, హాస్టళ్లలో చేర్పించడంతోపాటు స్వయం ఉపాధి కల్పించడానికి అవకాశం ఉందో లేదో అన్న అంశాలను పరిశీలిస్తారు. ఆ కుటుంబానికి పింఛన్ మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలుంటే వారికి కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తారు. మొత్తం పరిస్థితిని అధ్యయనం చేశాక అధికారుల బృందాలు రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి ప్రాథమిక నివేదికలను అందజేస్తాయి. ఆ బృందాలు నిజ నిర్ధారణ చేసి ఇచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్రస్థాయి కమిటీ సమగ్ర నివేదికను తయారుచేస్తుంది. జిల్లాల్లో పర్యటించే సీనియర్ వ్యవసాయాధికారుల్లో కె.రాములు, బి.రవీందర్‌సింగ్, శాంతి నిర్మల, గీత, కె.లలిత, అఫ్జల్‌బేగం, చంద్రశేఖర్, ఉషారాణి, సుచరిత, సి.వి.శర్మ, రాజారత్నం, బాలూనాయక్ తదితరులు ఉన్నారు. -
రాష్ట్రంలో కరువు ఛాయలు
* రబీలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు * 64 శాతం లోటు వర్షపాతం నమోదు * వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు కమ్ముకొస్తోంది. ఈ ఏడాది వర్షపాతం అత్యంత తక్కువ గా రికార్డు అయింది. భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో రబీ పంటలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దని, ఆరుతడి పంటలకే వెళ్లాలని వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలో స్పష్టంచేసింది. రబీ ప్రారంభమైన అక్టోబర్ నుంచి బుధవారం నాటికి ఈ కాలంలో సాధారణంగా 109.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ 39.4 మిల్లీమీటర్లే నమోదైంది. ఏకంగా 64 శాతం లోటు కనిపిస్తోంది. వాతావరణశాఖ లెక్క ప్రకారం రాష్ర్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు (కరువు ఛాయలు) ఏర్పడ్డాయి. ఇప్పటివరకు వేసిన లెక్కల ప్రకారం 343 మండలాల్లో వర్షాభావం, 31 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 73 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షపాతం లోటు భారీగా ఉండటంతో భూగర్భ జలాలు పాతాళంలోకి దిగిపోయాయి. గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్రంలో 6.29 మీటర్ల లోతులో భూగర్భ జలాలు లభిస్తే... ఈ అక్టోబర్‌లో 9.30 మీటర్ల లోతుల్లోకి దిగజారిపోయాయి. అంటే 3.01 మీటర్ల అదనపు లోతుల్లోకి జలాలు వెళ్లిపోయాయి. మెదక్ జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ జిల్లాలో 10.46 మీటర్ల లోతులో జలాలు లభిస్తే... ఈ అక్టోబర్‌లో 14.90 మీటర్ల లోతుల్లోకి దిగజారిపోయాయి. ఏకంగా 4.44 మీటర్ల అదనపు లోతుల్లోకి భూగర్భజలాలు వెళ్లిపోయాయి. తర్వాత నల్లగొండ జిల్లాలోనూ ఇదే స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటాయి. గతేడాది అక్టోబర్‌లో ఈ జిల్లాలో 4.90 మీటర్ల లోతులో నీరు లభిస్తే... ఈ అక్టోబర్‌లో 9.10 మీటర్ల లోతుల్లోకి దిగిపోయాయి. అంటే 4.20 మీటర్ల అదనపు లోతుల్లోకి వెళ్లిపోయాయి. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రబీలో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. రబీలో 13.09 లక్షల హెక్టార్లలో పంటల సాగు జరగాల్సి ఉండగా... ఇప్పటివరకు 4.05 లక్షల హెక్టార్లలో సాగు పూర్తికావాలి. కానీ 2.08 లక్షల హెక్టార్లలోనే (51%) పంటల సాగు జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయశాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది. -
రబీ ఆశలు ఆవిరి!
ఒక్క నాగార్జునసాగర్‌లోనే కొద్దిపాటి నిల్వలు మిగతా ప్రాజెక్టుల్లో ఎక్కడా అందుబాటులో లేని నీరు సాగర్‌లోనూ ఎక్కువ వాటా తాగునీటి అవసరాలకే గత ఏడాదితో పోలిస్తే 141 టీఎంసీల నీటి కొరత సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రబీ సీజన్‌కు ఇప్పటికే నెలకొన్న కరెంట్ కష్టాలకు, తోడు నీటి కష్టాలూ జతకానున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో సాగు నీటి అవసరాలకు సరిపోయే నీటి నిల్వలు ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో వాటిపై పూర్తిగా ఆశలు వదులుకోక తప్పేలాలేదు. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో ఖరీఫ్ పంటల విస్తీర్ణమే గణనీయంగా తగ్గగా, రబీలో మరింత క్షీణించే అవకాశముంద ని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తు తం ఒక్క నాగార్జునసాగర్ నుంచి మాత్రమే కొద్దిపాటి నీటి కేటాయింపులకు అవకాశం ఉంటుం దని, అందులోనూ సింహభాగం తాగునీటి అవసరాలకే కేటాయించే అవకాశాలుంటాయని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా ప్రాజెక్టుల్లోని నీటిని సైతం వచ్చే జూన్ వరకు కాపాడుకుని బొట్టుబొట్టునూ జాగ్రత్తగా వాడుకోవాలని సూచనలు చేస్తున్నాయి. వర్షాలులేక ఇక్కట్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాష్ట్ర ప్రాజెక్టుల్లో నీటి నిల్వపై ప్రభావాన్ని చూపాయి. కృష్ణా బేసిన్ పరిధిలో కొంత ఆలస్యంగానైనా వర్షాలు కురిసినా, గోదావరి బేసిన్లో మాత్రం సరిపోని రీతిలో వర్షాలు లేక ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. దీంతో శ్రీరాంసాగర్, కడెం, లోయర్ మానేరు, నిజాంసాగర్, సింగూరు తదితర ప్రాజెక్టుల్లో ఎక్కడా నీరు చేరలేదు. గత ఏడాది ఇదే సమయంలో ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు సుమారు 470 టీఎంసీల మేర ఉండగా, ఈ ఏడాది ప్రస్తుతానికి కేవలం 329 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. మరో 141 టీఎంసీల నీటి కొరత ఉంది. ఈ సీజన్లో ఆయా ప్రాజెక్టుల కింద సాగు అవసరాలకు సరిపడా నీటి కేటాయింపులు జరుపలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ప్రాజెక్టు నుంచి 6 టీఎంసీల నీటిని మాత్రమే వదిలారు. నిజానికి ఈ ప్రాజెక్టు కింద 9.68 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నా లక్ష ఎకరాలకు మించి నీరివ్వలేదు. ఇక నిజాంసాగర్, సింగూరు పరిధిలో సాగు అవసరాల్లో 40 శాతానికి తక్కువగానే నీటి కేటాయింపులు చేశారు. ఒక్క నాగార్జునసాగర్ పరిధిలో మాత్రం నల్లగొండ జిల్లాలోని కెనాల్ల కింద 2.80 లక్షల ఎకరాలు, లిఫ్ట్‌ల కింద 47వేల ఎకరాలకు సాగు నీరందింది. ఇదే ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లా పరిధిలోని 2.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందింది. అయితే ప్రస్తుత రబీ సీజన్లో ఈ ఆయకట్టుకు సుమారు 40 శాతం సాగునీరు తగ్గే అవకాశం ఉంటుందని నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 271 టీఎంసీల మేర నీరు ఉన్నప్పటికీ కనీస నీటి మట్టం 510 అడుగులకి లెక్కవేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 165 టీఎంసీలు మాత్రమే. ఇందులో ఏఎంఆర్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు)కింద తాగునీటికి 5 టీఎంసీలు, సాగర్ కింద మరో 8 టీఎంసీల తాగునీరు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 11 టీఎంసీల మేర నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు వేసవిలో మరో 7 నుంచి 8 టీఎంసీల మేర ఆవిరి నష్టాలు ఉంటా యి. అన్నీపోనూ మిగిలిన నీటితో ప్రాజెక్టు పరిధిలోని మొత్తం ఆయకట్టు 22 లక్షల ఎకరాల్లో సగానికి తక్కువే నీటిని అందించే అవకాశం ఉం టుందని చెబుతున్నారు. అయితే డిసెంబర్ 15 తర్వాత ప్రాజెక్టులో నీటి నిల్వ, రబీ సాగు గణాం కాలను దృష్టిలో పెట్టుకొని నీటి కేటాయింపులపై ఓ అంచనాకు వస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం ఉన్న 23.26 టీఎంసీల నీటిలో 6 టీఎంసీల మేర నీటి ఆవిరి నష్టాలు పోనూ మిగిలిన నీటిలో 12.5 టీఎంసీల నీటిని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలకు వాడతామని, ఇక్కడినుంచి సాగు అవసరాలకు నీరిచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు. ఇక సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న 11 టీఎంసీల నీటిలో 3 నుంచి 4 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మళ్లిస్తే, కింద ఉన్న ఘనపూర్ ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టుకు నీరు ఇవ్వడం గగనమే కానుంది. సింగూరు నుంచి నీరు విడుదల కాకుంటే దిగువన ఉన్న నిజాంసాగర్ పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. ఇక్కడున్న కేవలం 1.66 టీఎంసీల నీటితో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల పశువుల దాహార్తిని తీర్చే పరిస్థితి కూడా లేదు. ఈ దృష్ట్యా ప్రస్తుతం ఉన్న నీటిని జాగ్రత్తగా వచ్చే జూన్ వరకు వాడుకోవాల్సి ఉంటుందని, రైతులకు సైతం ఈ అంశంపై అవగాహన కల్పించాలని నీటి పారుదల శాఖ కింది స్థాయి అధికారులకు సూచనలు చేస్తోంది. -
రబీకి కరెంటివ్వలేం
వరి వద్దు.. ఆరుతడి పంటలే వేసుకోండి: సీఎం కేసీఆర్ విద్యుత్ సంక్షోభం వల్ల వరి వేయవద్దని రైతులకు విజ్ఞప్తి ఖరీఫ్‌లో ఎంతచేసినా కరెంట్ ఇవ్వలేకపోయాం ఆంధ్రప్రదేశ్ నుంచి 54 శాతం వాటా రావడం లేదు శ్రీశైలంలో ఉత్పత్తికీ అడ్డుపడుతూ కుట్ర చేస్తోంది కేంద్రం కూడా రాష్ట్రంపై కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తోంది రెండుమూడే ళ్లలో విద్యుత్ సమస్య తీరిపోతుందని వివరణ ప్రకటన జారీ చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం సాక్షి, హైదరాబాద్:ఖరీఫ్ సీజన్లోనే తీవ్ర కరెంట్ కష్టాలను ఎదుర్కొన్న నేపథ్యంలో రబీలో విద్యుత్ ఇవ్వలేమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. రబీలో వరి పంట వేసుకోవద్దని, ఆరుతడి పంటలే వేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్‌లో ఆశించిన మేరకు విద్యుత్ ఇవ్వలేకపోయామని ఆయన అంగీకరించారు. ఆంధ్రా నుంచి రావాల్సిన విద్యుత్ రావడం లేదని, కేంద్ర ప్రభుత్వం కూడా కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. మూడేళ్లలో పరిస్థితి కుదుటపడుతుందని భరోసానిచ్చారు. ఈ మేరకు సీఎం కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ర్టం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభానికి కారణాలను కేసీఆర్ అందులో వివరించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఏపీ సర్కారు 54 శాతం వాటా ఇవ్వకపోవడం వల్లనే తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయకుండా ఏపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ కుట్రను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, దీన్ని ఎప్పటికప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విభజన చట్టం మేరకు విద్యుత్ సరఫరా చేసేలా ఏపీని ఒప్పించాల్సిన కేంద్రం కూడా సహకరించడం లేదని, తమ సర్కారుపై కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దడానికి అవసరమైన మేరకు పవర్ ఎక్స్చేంజి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని, అయినా డిమాండ్‌ను తట్టుకోలేక పోతున్నామన్నారు. రాష్ర్టంలో విద్యుత్ విని యోగం భారీగా పెరగడంతో శ్రీశైలంతోపాటు నాగార్జునసాగర్‌లోనూ విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. గత పాలకులు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయని ఫలితంగానే ఇప్పుడు రాష్ర్టం తీవ్ర కరెంటు కొరతను ఎదుర్కొంటోందన్నారు. రెండుమూడేళ్లపాటు ఈ కష్టాలుంటాయని ఎన్నికల సమయంలోనే ప్రజలకు వివరించినట్లు ఆయన గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఈ స్థాయిలో డిమాండ్ లేదని, ప్రస్తుతం డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయిందని సీఎం వివరించారు. రబీ సీజన్లో రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ వరి పంట వేయొద్దని, ఆరుతడి పంటలు వేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏడాదిలో కొంతమేర, రెండుమూడేళ్లలో పూర్తిగా సమస్య తీరిపోతుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. నేడు ఛత్తీస్‌గఢ్‌కు సీఎం, ఆర్థిక మంత్రి ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి సీఎంతో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, సీఎం కార్యాలయ అధికారులు ఆదివారం ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాయ్‌పూర్ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. సోమవారం సాయంత్రం సీఎం బృందం తిరిగి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో రానుంది.