రైతులు రాలిన పీడకాలం!
* ఒక్క నెలలోనే 134 మంది ఆత్మహత్య
* బలవన్మరణాలకు పాల్పడిన వారి వివరాలతో సర్కారుకు నివేదిక
* అత్యధికంగా మెదక్ జిల్లాలో 30, నల్లగొండ జిల్లాలో 27 మంది ఆత్మహత్య
* బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు జిల్లాలకు వ్యవసాయ బృందాలు
* నేటి నుంచి రెండు రోజుల పాటు సీనియర్ అధికారుల జిల్లా పర్యటనలు
* ఆత్మహత్యల నేపథ్యం పరిశీలన, ఆయా కుటుంబాలకు భరోసా కల్పించడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: వర్షాభావం, పంట నష్టం, అప్పుల బాధ, వడ్డీ వ్యాపారుల వేధింపులు, పట్టించుకోని ప్రభుత్వం... వెరసి రాష్ట్రంలో రైతన్న రోజూ ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నాడు... అందరికీ అన్నం పెట్టే చెయ్యిని అన్ని చోట్లా చాచలేక, చెయ్యి చాచినా అప్పుపుట్టే దిక్కులేక.. రోజూ ఉసురు తీసుకుంటూనే ఉన్నాడు.. ఆరుగాలం కష్టపడి అందరి కడుపూ నింపుతున్నా.. తన వాళ్లకే పట్టెడన్నం దొరికే దిక్కులేక రోజూ ప్రాణం వదులుతూనే ఉన్నాడు.. రాష్ట్రంలో సెప్టెంబర్ ఒక్క నెలలోనే 134 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నివేదికలో ఇది వెల్లడైంది. ఖరీఫ్ ముగిసినా సెప్టెంబర్ నెలలో పంటలు చేతికి వచ్చే పరిస్థితి కానరాకపోవడం, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు, బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వకపోవడం, రబీపై సర్కారు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వంటి అంశాలే అన్నదాతల బలవన్మరణాలకు కారణాలవుతున్నాయి.
దీనికితోడు ఆదుకునే చర్యలు చేపడతామని, ఆత్మహత్యలకు పాల్పడవద్దన్న సర్కారు మాటలను రైతులు విశ్వసించడం లేదనే అభిప్రాయం వస్తోంది. కష్టాల్లో ఉన్న రైతులకు తక్షణం ఎలాంటి భరోసా, ఆర్థిక హామీ ఇవ్వకపోవడం ఆత్మహత్యలకు మరో కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వం కేవలం పరిహారం పెంపునకే పరిమితం కావడంతో.. రైతుల బలవన్మరణాలు ఆగలేదు. సెప్టెంబర్ నెలలో అత్యధికంగా మెదక్ జిల్లాలో 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా... నల్లగొండ జిల్లాలో 27 మంది, కరీంనగర్ జిల్లాలో 25 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే వీరిలో ఎంత మంది రైతులు వ్యవసాయ సంబంధ అప్పులు, పంట నష్టం తదితర కారణాలతో చనిపోయారనే దానిపై ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. వ్యక్తిగత కారణాలతో ఎందరు చనిపోయారనే అంశాన్ని పరిశీలిస్తోంది. వ్యవసాయ సంబంధ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నవారినే వాస్తవమైనవిగా పరిగణించి ఆయా కుటుంబాలకే పరిహారం ఇవ్వనుంది.
భరోసా కల్పించేందుకు..
గత నెలలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను వ్యవసాయశాఖ పరామర్శించనుంది. బాధిత కుటుంబాలను అధికారుల బృందం కలసి ధైర్యం కల్పించనుంది. ఈ మేరకు రాష్ట్రస్థాయి సీనియర్ వ్యవసాయ అధికారులతో జిల్లాకు ఒక బృందం చొప్పున పంపారు. ఆ బృందాలు బుధ, గురువారాల్లో బాధిత రైతు కుటుంబాలను పరామర్శిస్తాయి. ఆయా కుటుంబాల ఆర్థిక సమస్యలు, సామాజిక, మానసిక పరిస్థితిని అధ్యయనం చేయడంతోపాటు ఇతరత్రా కారణాలేమైనా ఆత్మహత్యకు పురిగొల్పాయా అన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తారు. వ్యవసాయశాఖ ప్రవేశపెట్టిన పథకాలు వారికి చేరాయా, లేదా అనే వివరాలను తెలుసుకుంటారు. ఆ కుటుంబాల్లోని పిల్లలను సంక్షేమ స్కూళ్లు, హాస్టళ్లలో చేర్పించడంతోపాటు స్వయం ఉపాధి కల్పించడానికి అవకాశం ఉందో లేదో అన్న అంశాలను పరిశీలిస్తారు.
ఆ కుటుంబానికి పింఛన్ మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలుంటే వారికి కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తారు. మొత్తం పరిస్థితిని అధ్యయనం చేశాక అధికారుల బృందాలు రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీకి ప్రాథమిక నివేదికలను అందజేస్తాయి. ఆ బృందాలు నిజ నిర్ధారణ చేసి ఇచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్రస్థాయి కమిటీ సమగ్ర నివేదికను తయారుచేస్తుంది. జిల్లాల్లో పర్యటించే సీనియర్ వ్యవసాయాధికారుల్లో కె.రాములు, బి.రవీందర్‌సింగ్, శాంతి నిర్మల, గీత, కె.లలిత, అఫ్జల్‌బేగం, చంద్రశేఖర్, ఉషారాణి, సుచరిత, సి.వి.శర్మ, రాజారత్నం, బాలూనాయక్ తదితరులు ఉన్నారు.