'అక్కడ ట్రాఫిక్ జామ్‌లు లేవు'
హైదరాబాద్: చైనా సోషలిజం వైపు సాగుతూనే అభివృద్ధిని సాధించడం గొప్ప అనుభూతిని కలిగించిందని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చెప్పారు. కమ్యూనిస్టుపార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ఆహ్వానం మేరకు 12 మంది సీపీఐ బృందంతో పాటు ఆయన పన్నెండురోజుల పాటు చైనాలో పర్యటించారు. చైనాలో తమ అనుభవాలను శనివారం ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ‘‘అక్కడ అద్భుతమైన అభివృద్ధి జరుగుతోంది. నిమిషం కూడా ట్రాఫిక్ జామ్ కాదు. రోడ్డు ప్రమాదాలు లేవు. శాంతి, భద్రతలు అదుపులో ఉన్నాయి. ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో ప్లైఓవర్లున్నాయి. జనాభా నియంత్రణకు ఒకే సంతానం విధానాన్ని అమలుచేస్తున్నారు.
ప్రభుత్వ నియంత్రణలోనే మల్టీ నేషనల్ కంపెనీలు పనిచేయడం విశేషం’’ అని తెలిపారు. తనతో పాటు ఏపీకి చెందిన హరినాథ్‌రెడ్డి, మహిళానేత సుల్తానా ఫైజీ, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వి.ఉల్లాఖాద్రీ, తమిళనాడు, మహారాష్ట్ర,పంజాబ్,అస్సాం, ఒడిశా, కేరళ, గోవా రాష్ట్రాల నాయకులు తమ ప్రతినిధి బృందంలో ఉన్నారని రవీంద్రకుమార్ చెప్పారు.