బోడుప్పల్ : తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడిన ఓ వ్యక్తిని సోమవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి 55 తులాల బంగారం, కిలో వెండి, ఒక ద్విచక్ర వాహనం, ఓ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం మల్కాజిగిరి జోన్ డీసీపీ రమా రాజేశ్వరి వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మారం వెంకట్‌రెడ్డి(39) డిగ్రీ వరకు చదువుకున్నాడు. పీర్జాదిగూడ శంకర్‌నగర్ కాలనీలో ఒంటరిగా ఉంటున్న ఇతడు తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. గతంలో ఐదు సార్లు జైలుకు కూడా వెళ్లాడు.
ఆదివారం కెనరా నగర్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వెంకట్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 13 చోట్ల ఇంటి తాళాలు పగులకొట్టి దొంగతనాలు, అలాగే ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్‌లో రెండు చోట్ల, మల్కాజిగిరి పరిధిలో ఒక చోట, ఎల్‌బీనగర్‌లో రెండు చోట్ల ఇంటి తాళాలు పగులకొట్టి దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి 55 తులాల బంగారం, కిలో వెండి, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వెంకట్‌రెడ్డిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడానికి పరిశీలిస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు.