
చిందరవందరగా మంచంపై బీరువాలోని సామగ్రి, తెరిచి ఉన్న బీరువా..
సాక్షి, ఖమ్మం: మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్‌లో ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోని నగదు, బంగారం, వెండిని దొంగలు దోచుకువెళ్లిన సంఘటన మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదర్శనగర్‌కు చెందిన బుద్ధ వెంకటేశ్వర్లు సింగరేణి ఉద్యోగి. తోటి కార్మికుడికి దెబ్బ తగలడంతో భద్రాచలం ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వెంకటేశ్వర్లు భార్య కొత్తగూడెంలో చదువుతున్న తన కూతరు వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దొంగలు ఇంటి ముందు తలుపు గొళ్లెం తొలగించేందుకు తలుపును కొద్దిభాగం ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు.
మధ్య గదిలో ఉన్న బీరువాను తెరిచి అందులో ఉన్న రూ.50 వేల నగదును, 8 తులాల బంగారం, 1 కేజీ వెండిని దోచుకెళ్లారు. తెల్లవారు జామున హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంకటేశ్వర్లు అక్కడి పరిస్థితిని చూసి హతాశుడయ్యాడు. నివాసంలోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న మొత్తాన్ని దోచుకెళ్లినట్లు గుర్తించారు. దీంతో బాధితుడు మణుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై శ్రీకాంత్ పరిశీలించి క్లూస్ టీంకు సమాచారమిచ్చారు. అక్కడకు చేరుకున్న క్లూస్ టీం సిబ్బంది నమూనాలను సేకరించగా, పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment