మూడో ‘సారీ’
గజ్వేల్, న్యూస్‌లైన్: ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న గజ్వేల్-సింగూర్ మంచినీటి పథకానికి ప్రతిపాదనల దశలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో రెండుసార్లు పర్యాయాలు మార్పులు, చేర్పులు చేసి ప్రతిపాదనలు పంపినా, ఈ ఫైల్ తిరస్కరణకు గురైంది. తాజాగా మూడోసారి ప్రతిపాదనలు పంపగా సవరణలు చేయాలని ఎన్‌సీపీఈ (నేషనల్ కన్సల్టెన్సీ ఫర్ ప్రాజెక్ట్ ఎంటర్ ప్రీమియర్) ఫైల్‌ను వెనక్కి పంపింది. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుంటేనే ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశముంది.
గజ్వేల్ నగర పంచాయతీలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రూపుదిద్దుకోబోతున్న గజ్వేల్-సింగూర్ పథకానికి ప్రతిపాదనల దశలోనే అడ్డంకులు ఎదురుకావడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణంలో దాహార్తిని తీర్చేందుకు మంజీరా నదిపై నిర్మించిన సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 8.3 ఎల్‌ఎండీనీటిని నిత్యం గజ్వేల్‌కు తరలించే పథకానికి ఏడాదిన్నర కిందట రూపకల్పన చేశారు. పైప్‌లైన్, ఇతర 53 రకాల పనులకు రూ. 234 కోట్లు అవసరమని తేల్చారు.
ప్రజారోగ్యశాఖ ఉన్నతాధికారుల సూచన మేరకు మార్పులు చేసి అంచనా వ్యయాన్ని రూ.211 కోట్లకు కుదించి ప్రతిపాదనలు చేయగా, మార్పు లు చేయాలని ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ ఆదేశించారు. అంచనా వ్యయాన్ని తగ్గించిన అధికారులు రూ. 197 కోట్లతో సీఈకి మరోసారి ప్రతిపాదనలు పంపారు. అయితే ఈ ప్రతిపాదనలకు కూడా అభ్యంతరం తెలిపిన సీఈ మరోసారి మార్పులు చేయాలని 2013 సెప్టెంబర్ నెలలో ఆదేశించడంతో ఈ ఫైల్ రూ. 195 కోట్ల అంచనాలతో ఎన్‌సీపీఈ (నేషనల్ కన్సల్టెన్సీ ఫర్ ప్రాజెక్ట్ ఎంటర్ ప్రీమియర్) వద్దకు చేరింది. ఈ క్రమంలోనే మరోసారి మార్పులు జరగాలని ఎన్‌సీపీ ముచ్చటగా మూడోసారి కొన్ని రోజుల కిందట ‘గజ్వేల్- సింగూర్’ ప్రతిపాదనల ఫైల్‌ను వాపస్ పంపింది.
ఈ ప్రతిపాదనల ఫైల్‌లో పది రకాల సవరణలు చేయాలని ఎన్‌సీపీ సూచించింది. దీంతో ‘గజ్వేల్- సింగూర్’ ప్రతిపాదనలను రూపొందిం చే ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. గజ్వేల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే తప్ప, ఈ ఫైల్ ముందుకుసాగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ అంశంపై గజ్వేల్ పంచాయతీ కమిషనర్ సంతోష్‌కుమార్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ‘గజ్వేల్-సింగూర్’ పథకం ఫైల్‌ను ఎన్‌సీపీ వాపస్ చేసిన వ్యవహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.