సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికే 30 మంది మృతి చెందగా, శనివారం గాంధీ ఆస్పత్రిలో మరో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో కర్నూలు జిల్లాకు చెందిన గర్భిణీ సరస్వతి(25), చంచల్‌గూడకు చెందిన మహతాకాతూన్(65), నల్లకుంటకు చెందిన బాబురావు(77) ఉన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 35 మంది పాజిటివ్ బాధితులు, 29 మంది అనుమానితులు చికిత్స పొందుతుండగా, మరో 50 మంది నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్ష కోసం ఐపీఎంకు పంపారు. ఇక ఉస్మానియాలో పది మంది, ఫీవ ర్ ఆస్పత్రిలో మరో 25 మంది, కేర్, కిమ్స్, అపోలో, యశోద, కామినేని, తదితర ఆస్పత్రుల్లో 85 మంది పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా, పాలమూరు పట్టణంలో మరో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ రాజారాం రెండు రోజుల క్రితం స్వైన్‌ఫ్లూ బారిన పడగా ఇంటిలోనే చికిత్స చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అల్లుడు కూడా స్వైన్‌ఫ్లూ బారిన పడినట్టు తేలిసింది.