‘స్నేక్’ కోరల్లో మరో ముగ్గురు | three more women gang raped by snake gang | Sakshi
Sakshi News home page

‘స్నేక్’ కోరల్లో మరో ముగ్గురు

Published Thu, Sep 4 2014 1:36 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

‘స్నేక్’ కోరల్లో మరో ముగ్గురు - Sakshi

‘స్నేక్’ కోరల్లో మరో ముగ్గురు

వెలుగు చూస్తున్న స్నేక్ గ్యాంగ్ ఆగడాలు
 హైదరాబాద్: స్నేక్‌గ్యాంగ్ మరో ముగ్గురు మహిళలపై కూడా గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు పోలీ సుల విచారణలో తేలింది. పోలీసుల దర్యాప్తులో ఈ గ్యాంగ్ సెటిల్‌మెంట్ల పేరుతో వేధించిన ఘటనలు వెలుగు చూడడంతో మరో ఐదు కేసులు నమోదు చేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తే వివరాలు రహస్యంగా ఉంచుతామని, తా ము అండగా ఉంటామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హామీ ఇచ్చారు.  బుధవారం తెల్లవారుజామున పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని షాయిన్‌నగర్, ఎర్రకుంట బస్తీలలో సీవీ ఆనంద్ నేతృత్వంలో పోలీసు అధికారులు కార్డన్ సెర్చ్(చక్రబంధంలో తని ఖీలు) నిర్వహించారు. స్నేక్‌గ్యాంగ్‌కు సహా య సహకారాలు అందించిన మరో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కార్డన్ సెర్చ్ లో స్నేక్‌గ్యాంగ్ వినియోగించిన రెండు గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 131 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

 స్నేక్‌గ్యాంగ్ ఇళ్ల తనిఖీ: ఎర్రకుంటలోని స్నేక్‌గ్యాంగ్ ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీ ఇంటికి  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ వెళ్లి తనిఖీలు చేపట్టారు. దయానీ సోదరులు హమీద్, కాలేద్‌లను అదుపులోకి తీసుకోవడంతో పాటు అతని ఇంట్లో ఉన్న స్కార్పియో, వెస్పా, ఆక్టివా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్నేక్‌గ్యాంగ్‌లోని అలీ బారక్ బా, ఖాదర్ బారక్ బా(తండ్రి-కొడుకులు) ఇంటికి వెళ్లి పోలీ సులు తలుపులు తట్టారు.  తలుపులు తెరవకపోవడంతో శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్ ఆరడుగుల ఎత్తున్న ప్రహరీ దూకి ఇంట్లోకి ప్రవేశిం చారు. మిగిలిన ఏడుగురు నిందితుల ఇళ్లల్లో కూడా కమిషనర్ సోదాలు జరిపారు.
 
 కార్డన్ సెర్చ్‌లో 412 మంది అధికారులు
 బస్తీల చుట్టూ అవుటర్ కార్డన్స్ ఏర్పాటు చేసుకొని సెర్చ్ పార్టీలు ఈ గాలింపు ప్రక్రియను ప్రారంభించాయి. ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండే ఒక్కో సెర్చ్ టీమ్ 30 ఇళ్ల వరకు సోదాలు చేసింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు ఉదయం 7 గంటల వరకు కొనసాగాయి. కమిషనర్ సి.వి.ఆనంద్‌తో పాటు శంషాబాద్ డీసీపీ కె.రమేష్ నాయుడు, క్రైమ్ ఇన్‌ఛార్జి డీసీపీ జానకీ షర్మీల, నలుగురు ఏసీపీలు, 40 మంది ఇన్‌స్పెక్టర్లు, 90 మంది ఎస్సైలు, 200 మంది కానిస్టేబుళ్లు, 80 మంది మహిళా కానిస్టేబుళ్లు ఈ సెర్చ్‌లో పాల్గొన్నారు.  
 
 కార్డన్ సెర్చ్‌లో పట్టుబడ్డ వివరాలు...
 ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీ ఇద్దరు సోదరులు హమీద్, కాలేద్ రోడ్డు పై వెళ్లే ఒంటరి జంటల సమాచారాన్ని స్నేక్‌గ్యాంగ్ కు అందించే ఇన్‌ఫార్మర్స్ హబీబ్, ఆబేద్, షా రూక్, నయీం, బాబీ డాల్‌ను అరెస్ట్ చేశారు.
 రౌడీషీటర్లు బాలాపూర్ ఎంపీటీసీ అలీ అమ్‌షాన్, రూబీ, రియల్ చానల్ యజమాని యెమానీసహా 8 మందిని బైండోవర్ చేశారు.
 పోలీసుల కళ్లు గప్పి పారిపోతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
 నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు.
 స్నేక్ గ్యాంగ్ ముఠా సభ్యుల నుంచి రెండు గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని గోశాలకు తరలించనున్నారు.
 
 రౌడీయిజం చేస్తే బుల్లెట్ దిగుద్ది: కమిషనర్
 యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన స్నేక్ గ్యాంగ్ బాధితులెవరైనా ఉంటే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ అన్నారు. ఫిర్యాదు చేస్తే వారికి భద్రత, భరోసా కల్పిస్తామన్నారు. పహాడీషరీఫ్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫైసల్ దయానీ కొంత మందితో కలసి ముఠాగా ఏర్పడి ఒంటరిగా వెళుతున్న జంటలపై దాడులకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. భయంతో బాధితులు ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేకపోయారన్నారు. స్నేక్‌గ్యాంగ్‌పై ఇప్పటికే ఐదు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ గ్యాంగ్‌లో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేయగా, మరో 13 మంది ముఠాలో పని చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇప్పటి వరకు మూడు అత్యాచార ఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు.  కమిషనరేట్ పరిధి లో ఇప్పటి వరకు సూరారం కాలనీ, పాపిరెడ్డి కాలనీ, గబ్బిలాల్ పేట, శ్రీరాం కాలనీలలో కార్డన్ సెర్చ్ చేశామన్నారు. ఈ సెర్చ్ ద్వారా నేరస్తులలో భయం ఏర్పడుతుందన్నారు.  ఎవరైనా రౌడీయిజానికి పాల్పడితే బుల్లెట్ రుచి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాంటి సెర్చింగ్‌లు మరిన్ని చేయాలని ఇన్‌స్పెక్టర్ పి.శ్రీధర్‌కు  కమిషనర్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement