భార్యా, భర్తల మధ్య తలెత్తిన చిన్న పాటి వివాదం ముగ్గురి ప్రాణాలు బలిగొంది. మాటామాటా అనుకోవడంతో క్షణికావేశానికి లోనైన ఆ ఇల్లాలు తన ఇద్దరి పిల్లలతో సహా తానూ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తన చిన్నారి కుమారుడికి, భర్తకు తీరని శోకం మిగిల్చిన ఈ సంఘటన గురువారం వనపర్తి మండల పరిధిలోని ఖాశీంనగర్‌లో చోటు చేసుకుంది.
- న్యూస్‌లైన్, ఖాశీంనగర్(వనపర్తిరూరల్)
క్షణికావేశంలో ఇద్దరు కూతుళ్లతో సహా బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో ఖాశీంనగర్ గ్రామం దుఖసాగరంలో మునిగిపోరుుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జక్కుల రాములు, బాలకిష్టమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు. వ్యవసాయ కుటుంబమైనప్పటికీ పిల్లలను చదివిస్తూ ఉన్నంతలో బాగా బతికేవారు. కాగా నెల రోజుల క్రితం భార్యా భర్తల మధ్య విభేదాలు తలెత్తారుు. ఈ క్రమంలో బుధవారం కూతుళ్లు రాజేశ్వరి, మహేశ్వరిలకు జ్వరం వచ్చింది.
వీరిని తీసుకొని వనపర్తికి వెళ్లి ఆస్పత్రికి చూపించమని భార్యకు చెప్పి భర్త పొలానికి వెళ్లాడు. సాయంత్రం రాములు ఇంటికి రాగా భార్య కనిపించలేదు. ఏడు గంటలు దాటినా ఇంటికి రాక పోవటంతో వనపర్తిలో, బంధువుల ఇళ్లలో వెదికాడు. బాలకిష్టమ్మ తల్లి తండ్రులకూ ఫోన్ చేసినా అక్కడికీ రాలేదని చెప్పటంతో ఆందోళన చెంది గ్రామంలో విచారించగా దవాజిపల్లికి వెళ్లే దారి గుండా ఇద్దరు ఆడపిల్లలతో వెళ్లినట్లు తెలుసుకొని ఆ దారి వెంట వెదికారు. గ్రామానికి సమీపంలోని కాల్ల చిన్నయ్య బావి వద్ద చిన్నపాప దుస్తులు, బాలకిష్టమ్మ చెప్పులు ఉండటంతో బావిలో వెదికి బాలకిష్టమ్మ (35), రాజేశ్వరి(10), మహేశ్వరి(8) మృత దేహాలను బయటకు తీశారు. చిన్న పాటి గొడవకు ఇంత పని చేసుకుంటుందని అనుకోలేదని భర్త జక్కుల రాములు రోదించిన తీరు కలచివేసింది. కాగా మృతురాలు బాలకిష్టమ్మ తల్లి బక్కమ్మ తన కూతురిని అల్లుడు రాములు మానసికంగా, శారీరకంగా వేధించటం వల్లనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని విచారన చేపట్టినట్లు రూరల్ ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.
అమ్మ ఎప్పుడు లేస్తుంది
ఐదేళ్ల తరుణ్ తల్లి, అక్కల మృతదేహాలను చూసి ఎప్పుడు లేస్తారు అంటూ ఆలోచిస్తూ పక్కనె దిగాలుగా కూర్చోవటం, తన తల్లిని, అక్కలను మింగేసిన బావిని చూస్తూ అమ్మ చచ్చిపోయిందా అంటూ బంధువులను, గ్రామస్తులను ప్రశ్నించటం అక్కడి వారి హృదయాలను కలచి వేసింది.
ముగ్గురిని బలిగొన్న క్షణికావేశం
Published Fri, May 30 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
Advertisement
Advertisement