
గద్వాల క్రైం: ఓ తండ్రి.. ఇద్దరు కుమారులు.. ఇదేదో కొత్త సినిమా పేరు అనుకుంటున్నారా.. కాదండి బాబు.. వీరు ముగ్గురు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చోరీలకు పాల్పడిన దొంగలు.. బుద్దిగా చదువుకోవాలని చెప్పాల్సిన కన్నతండ్రే.. తన ఇద్దరు కుమారులను దొంగతనాల వైపు దారిమళ్లించాడు. మరో వ్యక్తితో కలిసి ఎవరూ లేని ఇళ్లనే వారికి ఉపాధి బాటలుగా మార్చుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు చోరీలు చేసి చివరకు దొంగిలించిన ఓ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులకు చిక్కి జైలో ఊచలు లెక్కించాల్సిన దుస్థితికి చేరుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సోమవారం పట్టణ పోలీసుస్టేషన్‌లో సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
కిరాణ దుకాణంలో..
గద్వాల పట్టణ శివారులోని దౌదర్‌పల్లి కాలనీకి చెందిన తెలుగు తిమ్మప్ప తమ కుమారులైన జయంత్(18), చిన్న కుమారుడు(12)తోపాటు మల్దకల్ మండలం, పావనంపల్లి గ్రామానికి చెందిన తెలుగు శ్రీనివాస్‌లు ముఠాగా ఏర్పడి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడ్డారు. గత నెల 23వ తేదీన గద్వాలలోని వెంకటరమణకాలనీలో మల్లప్ప అనే వ్యక్తి తన ఇంటి వద్దనే ఓ కిరాణం ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కిరాణం సరుకుల కోసం మల్లప్ప పట్టణంలోని ఓ షాపునకు వెళ్లాడు.. కిరాణంలో మల్లప్ప భార్య మాత్రమే ఉండడం గమనించిన నిందితులు తిమ్మప్ప తన చిన్న కుమారుడికి రూ.5 ఇచ్చి కిరాణంలో మహిళతో మాట్లాడుతూ తినుబంఢారాలు తింటూ ఉండి.. మేము కూత వేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు జయంత్‌ను ఇంట్లోకి పంపించి బీరువాలో ఉన్న తులంన్నర బంగారు, 13 తులాల వెండి, సెల్‌ఫోన్‌ను అపహరించారు. సంఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా బాధితుల సెల్‌ఫోన్ నుంచి వివిధ వ్యక్తులకు ఫోన్ చేసినట్లు గుర్తించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా సోమవారం ఉదయం దౌదర్‌పల్లి వద్ద వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు.
ద్విచక్రవాహనాలు సైతం..
అయితే గత రెండేళ్ల క్రితం మన్యంకొండ, రాయిచూర్, మదనాపురం ప్రాంతాల్లో బస్టాండ్ల వద్ద నిలిపిన నాలుగు ద్విచక్రవాహనాలను సైతం అపహరించినట్లు విచారణలో పేర్కొన్నారు. వీరిపై వివిధ పోలీసు స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. చోరీ చేసిన సొమ్మును తక్కువ ధరకు విక్రయించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవారు. దౌదర్‌పల్లిలో సైతం బీసన్న అనే వ్యక్తి ఇంట్లో వీరు చోరీకి పాల్పడ్డారు. ఎట్టకేలకు నిందితులను సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకుని వారి నుంచి 4 ద్విచక్రవాహనాలు, 13 తులాల వెండి, తులంన్నర బంగారం స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో పట్టణ ఎస్‌ఐ శ్రీనివాస్, సీసీ పుటేజీ సిబ్బంది చంద్రయ్య, గోవిందు తదితరులు పాల్గొన్నారు.