పృథ్వీ (ఫైల్), ఉదయ్ (ఫైల్), ఉదయ్‌రెడ్డి (ఫైల్)
హైదరాబాద్: ఇన్నర్ రింగ్‌రోడ్‌పై అర్ధరాత్రి పూట అతివేగం.. దీనికి తోడు ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్.. ఫలితంగా అదుపుతప్పిన బైక్ మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ఘటనా స్థలిలోనే మృత్యువాతపడ్డారు. ఈ ఘోర ప్రమాదం సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ చౌరస్తా వద్ద సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. 20 రోజుల క్రితం చనిపోయిన తండ్రి అస్థికల్ని నిమజ్జనం చేసేందుకు 2 రోజుల్లో స్వగ్రామానికి వెళ్లాల్సిన కొడుకు, ఉద్యోగం కోసం 2 రోజుల్లో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిన యువకుడితోపాటు ఇంజనీరింగ్ చదువుతున్న మరో విద్యార్థి ఈ ప్రమాదంలో మృతి చెందారు.
చదువు కోసం నగరానికి..
సూర్యాపేట జిల్లా నాగారం మండలం మామిడిపల్లి కి చెందిన నిమ్మల పృథ్వీ (21) ఇబ్రహీంపట్నంలోని సీబీఐటీ కాలేజీలో రెండో ఏడాది చదువుతూ కాలేజీ హాస్టల్‌లోనే ఉంటున్నాడు. ఇతడి తండ్రి శ్రీనివాసులు 20 రోజుల క్రితం మరణించాడు. ఆ కార్యక్రమాలు ముగించుకుని పృథ్వీ ఇటీవలే నగరానికి వచ్చాడు. తండ్రి అస్థికల్ని నిమజ్జనం చేయడానికి రావాల్సిందిగా కుటుంబీకులు కోరారు. తనకు పరీక్షలు జరుగుతున్నాయని, వారంలో వచ్చి భద్రాచలం వెళ్లి గోదావరిలో నిమజ్జనం చేస్తానంటూ వారికి చెప్పాడు. దీనికోసం పృథ్వీ 2 రోజుల్లో ఇంటికి వెళ్లాల్సింది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరికి చెందిన బూషకర్ల ఉదయ్ (23) చౌటుప్పల్‌లో ఉంటూ బీ–ఫార్మసీ చదువుతుండటంతోపాటు ఉద్యో గ వేటలో ఉన్నాడు. ఇతడు మరో 2 రోజుల్లో నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సింది. దీనికోసమే సోమవారం సిటీకి వచ్చిన ఇతడు ఉప్పల్‌లో ఉండే స్నేహితుడు ఉదయ్‌రెడ్డి ఇంట్లో ఉంటున్నాడు. సూర్యాపేట ఫణిగిరికే చెందిన విశాఖ ఉదయ్‌రెడ్డి (21) ఇబ్రహీంపట్నంలోని సీబీఐటీ కాలేజీలో బీటెక్ చదువుతూ ఉప్పల్‌లోని తన పెదనాన్న ఇంట్లో ఉంటున్నాడు.
భోజనానికి వెళ్తూ:
స్నేహితులైన ఈ ముగ్గురూ సోమవారం రాత్రి ఉప్పల్‌లో కలుసుకున్నారు. భోజనం చేయాలని భావించారు. అర్ధరాత్రి కావడంతో ఆ ప్రాంతంలో హోటళ్లు మూసివేశారు. దీంతో సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌కు ముగ్గురూ పల్సర్ వాహనంపై బయలుదేరారు. ఉదయ్ బైక్ నడుపుతుండగా ఇద్దరూ వెనుక కూర్చున్నారు. అర్ధరాత్రి కావడంతో ఉదయ్ వాహనాన్ని మితిమీరిన వేగంతో ముందుకు పోనిచ్చాడు. మెట్టుగూడ చౌరస్తాలోని పెట్రోల్ బంక్ వద్ద 1.30 గంటల ప్రాంతంలో బైక్ అదుపు తప్పింది. బైక్‌ను ఉదయ్ కంట్రోల్ చేయలేకపోవడంతో మెట్రో పిల్లర్(ఎంఎస్‌బీ 9)ను బలంగా ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ముగ్గురూ ఎగిరి ఇద్దరు రోడ్డుపై, మరొకరు మెట్రో పిల్లర్ల మధ్యలో పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇతర వాహనచోదకులు అక్కడికి వెళ్లి చూడగా.. ముగ్గురు యువకులూ అక్కడ అచేతనంగా పడి ఉన్నారు. దీంతో వారు లాలాగూడ పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ముగ్గురు యువకుల మృతిపై సమాచారం అందుకున్న వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు మంగళవారం ఉదయం గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. విగతజీవులుగా ఉన్న వారిని చూసి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment