మృత్యువు మింగేసింది
Published Fri, Jan 31 2014 2:11 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
ఆ ముగ్గురు యువకులూ కష్టాన్నే నమ్ముకున్నారు. తాపీ పనులు చేసుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు. విధి వారితో ఆటలాడింది. ముగ్గుర్నీ మృత్యువు పొట్టనపెట్టుకుంది. భీమడోలు మండలం అంబర్‌పేట వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో నరసాపురం మండలం వేములదీవి, తూర్పుతాళ్లు గ్రామాలకు చెందిన యువకులు మృతి చెందటంతో ఆ కుటుంబాలు శోకసము ద్రంలో మునిగిపోయూయి.
నరసాపురం రూరల్/భీమడోలు, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం సముద్ర తీరప్రాంత గ్రామాల్లో విషాదం నింపింది. వేములదీవి, తూర్పుతాళ్లు గ్రామాలకు చెందిన పరసా ఆదినారాయణ(25), తోట దుర్గాప్రసాద్(22), వలవల సురేష్(21)లు మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా కొవ్వూరు- గుండుగొలను రహదారిపై భీమడోలు మండలం అంబర్ పేట సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందారు. వీరు మంచినీటి ట్యాంక్ నిర్మాణ పనులు, సెంట్రింగ్ పనులు చేస్తుంటారు. పనుల్లో భాగంగా వారం రోజుల క్రితమే దూబచర్లకు వచ్చి ఉంటున్నారు. బుధవారం రాత్రి పల్సర్ బైక్‌పై భీమడోలు వచ్చిన వీరు తిరిగి దూబచర్ల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తాపీపని చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్న యువకుల మృతితో ఆయూ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
బాధిత కుటుంబాలను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో గ్రామాలు హోరెత్తారుు. ముగ్గురిలో ఎవరికీ వివాహాలు కాలేదు. సర్దుగొడపకు చెందిన ఆదినారాయణ తండ్రి అనారోగ్యంతో చాలాకాలం క్రితం మృతి చెందగా ఆరుగురు సంతానాన్ని తల్లి సత్యవతి పెంచింది. అందరిలో చిన్నవాడు కావడంతో పెళ్లికి సన్నాహాలు చేస్తున్నారని ఆ ప్రాంతవాసులు తెలిపారు. తూర్పుతాళ్లుకు చెందిన తోట దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. కుమారుడి మృతితో వీరుపడే వేదనను బంధుమిత్రులు చూసి కంట తడిపెడుతున్నారు.
మరణ వార్తను ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలుకరిస్తూ ఉండేవాడని కరింశెట్టివారిపాలెం గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. తూర్పుతాళ్లుకు చెందిన వలవల సురేష్ ఇంటికి పెద్ద కుమారుడు కావడంతో తమ కుటుంబానికి దిక్కు ఎవరని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. సురేష్ దుబాయ్ వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తున్నాడు. గురువారం రాత్రికి ఏలూరులో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు గ్రామానికి చేరుకుంటాయని బంధువులు తెలిపారు.
Advertisement
Advertisement