సేలం: కాంచీపురం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. వివరాలు.. చెన్నైలోని మన్నడి ప్రాంతంలోని బోర్కర్ మర్చెంట్ వీధికి చెందిన తొమ్మిది మంది యువకులు దీపావళి సెలవుల్లో పర్యాటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఓ ఇన్నోవా కారులో శనివారం ఉదయం చెన్నై నుంచి ఏలగిరి పర్యాటనకు బయలుదేరారు. కారులో సజావిక్ (25), రియాజ్ (20), ఫైసల్ (24) యాకూప్ (25), ఆసిఫ్ (21), ఇంతియాజ్ (23), ముహ్మద్ యాసిఫ్, ఇన్సాద్ ఇర్ఫాన్ (25), ఇన్సా (25) ఉన్నారు. వీరంతా స్నేహితులు. వారిలో ఫైసల్ కారును నడిపాడు.
కారును ఢీకొన్న లారీలు..
కారు వేలూరు వైపుగా కాంచీపురం సమీపం చెన్నై– బెంగళూరు జాతీయ రహదారిలోని చిన్నయ్యన్ సత్రం వద్ద వెళుతోంది. యువకులంతా ఆనందంగా పాటలు పాడుకుంటూ వెళుతున్నాడు. అప్పుడు వెనుకనే వస్తున్న ఓ లారీ అకస్మాత్తుగా వేగం పెంచి కారును ఢీకొంది. దీంతో అదుపుతప్పిన కారు రోడ్డు డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపై ఎక్కింది. అదే సమయంలో వేలూరు నుంచి చెన్నైకు వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా కారును ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జై కారులోని సలీం కుమారుడు సజావిక్ (25), రియాజ్ (20), కారు నడిపిన ఫైసల్ (24) సంఘటనా స్థలంలోనే దుర్మణం చెందారు. ఇంకా యాకూప్ (25), ఆసిఫ్ (21), ఇంతియాజ్ (23), ముహ్మద్ యాసిఫ్, ఇన్సాద్ ఇర్ఫాన్ (25), ఇన్సా (25) తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల విచారణ..
సమాచారంతో డీఎస్పీ బాలసుబ్రమణియన్, తాలూకా సీఐ వెట్రిసెల్వన్, పోలీసులు రెండు ఆంబులెన్స్‌లు, రెండు అగ్నిమాపక వాహనాల్లో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను కూడా అదే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాంచీపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఫైసల్ తమ్ముడు ఆసిఫ్. ప్రమాద విషయం తెలియడంతో చెన్నై నుంచి ఆ యువకుల కుటుంబీకులు కాంచీపురానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆస్పత్రి దద్దరిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment