చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యం
రేణిగుంట(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని జైలో కారు ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్ కథనం మేరకు... గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన తలతల సత్యనారాయణరెడ్డి (41), అతని భార్య విజయభారతి (36), కుమారుడు చెన్నకేశవరెడ్డి (13), కుమార్తె ప్రసన్నలక్ష్మి (17), బెల్లంకొండ మండలం పాపయ్యపాళెంకు చెందిన అతని బావమరిది వీరారెడ్డి (31), అదే జిల్లా అచ్చంపేట మండలం ఓర్వకల్లుకు చెందిన పూల అంకయ్య (70), అతని కుమారుడు గోపి (35), కోడలు పద్మ (30), మనుమడు హరి (12) కలసి బాడుగకు జైలో కారు మాట్లాడుకుని గురువారం రాత్రి 10 గంటలకు ఓర్వకల్లు నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయల్దేరారు.
అచ్చంపేట మండలం గింజుపల్లికి చెందిన కారు డ్రైవర్ ప్రేమ్‌రాజ్ (23)తో కలిసి మొత్తం 10మంది కారులో వస్తున్నారు. మరో గంటలో తిరుమల శ్రీవారి చెంతకు చేరనున్న సమయంలో అనూహ్యంగా జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం వారిని గాఢ నిద్రలో నుంచి శాశ్వత నిద్రలోకి తీసుకెళ్లింది. శ్రీకాళహస్తి–తిరుపతి హైవేలో రేణిగుంట మండలం గురవరాజుపల్లి సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొంది. కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో పాటు ముందు సీట్లో కూర్చొన్న డ్రైవర్‌తో పాటు మిగిలిన వారంతా కారులోనే ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ప్రేమ్‌రాజ్, సత్యనారాయణరెడ్డి భార్య విజయలక్ష్మి, చెన్నకేశవరెడ్డి, పూల అంకయ్య, పూల గోపి అక్కడికక్కడే మృతి చెందగా గోపి భార్య పద్మ తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
సత్యనారాయణరెడ్డి, ఆయన కుమార్తె ప్రసన్నలక్ష్మి, బావమరిది వీరారెడ్డి, గోపి కుమారుడు హరిలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని పోలీసులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. విషయం తెలుసుకున్న రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ శివరాముడు, ఎస్‌ఐ మోహన్‌నాయక్ వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి, పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్‌వీ మెడికల్ కళాశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న తిరుపతి అర్బన్ ఎస్‌పీ అన్బురాజన్, ఏఎస్‌పీ అనిల్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఘోర ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రుయా వైద్యాధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment