ప్రమాదానికి కారణమైన లారీ
పెళ్లయిన కొన్నాళ్లకే భర్తను మృత్యువు కబళించేసింది. ఒక్కగానొక్క బిడ్డ భవిష్యత్ కోసం దేశంగాని దేశం వెళ్లింది. మూడేళ్లకోసారి వచ్చి కుమార్తెను తనివిదీరా చూసుకునేది. వయసు మీద పడడంతో ఇక చివరిమజిలీని కుమార్తె వద్దే గడపాలనుకుంది. కువైట్‌లో విమానమెక్కి స్వదేశానికి వచ్చింది. అక్కడి నుంచి కారులో జిల్లా పొలిమేర వరకు వచ్చింది. మరో గంటలో కన్నబిడ్డను చూసేస్తామనుకుంది. అంతలోనే మృత్యువు అడ్డుపడింది. కారులో ఉన్న ఆమెతో పాటు, సోదరుడినీ తీసుకెళ్లిపోయింది. అమ్మ వచ్చేస్తోందని ఎంతో ఆత్రుతగా ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న కుమార్తె జీవితంలో చీకటి నిండిపోయింది. ఇటు మామయ్య కుటుంబం కూడా తనలాగే పెద్ద దిక్కు కోల్పోయిందని తెలిసి గుండె పగిలేలా ఏడ్చింది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఊరంతా శోకసంద్రంలో మునిగిపోయింది.
సాక్షి, చిత్తూరు(రేణిగుంట): రేణిగుంట–కడప రోడ్డు మార్గంలో గురువారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న కారు, లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రేణిగుంట అర్బన్ సీఐ అంజూయాదవ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం హస్తవరం పంచాయతీ చెర్లోపల్లి ఎస్‌టీ కాలనీకి చెందిన ముద్దనూరు సుబ్బనరసమ్మ(60) 15 ఏళ్లుగా మస్కట్, కువైట్‌కు ఉపాధి కోసం వెళ్లి వస్తూ ఉండేది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట కువైట్‌కు వెళ్లి, తిరిగి ఇంటికొస్తున్నట్లు బంధువులకు సమాచారం అందించడంతో ఆమెను తీసుకొచ్చేందుకు బుధవారం సాయంత్రం సుబ్బనరసమ్మ సోదరుడు లక్ష్మయ్య(40), అతని కుమారుడు శేఖర్(20), బావ సిద్ధయ్య(67), ఓ బాడుగ కారును మాట్లాడుకుని చెన్నైకి బయల్దేరారు. వారితోపాటు కారు డ్రైవర్ భాను(32) కూడా ఉన్నాడు. చెన్నై విమానాశ్రయంలో దిగిన సుబ్బనరసమ్మను కారులో ఎక్కించుకుని గురువారం తెల్లవారుజామున 3 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి స్వగ్రామానికి బయల్దేరారు.
చదవండి: (రాజేంద్రనగర్‌లో దారుణం.. టెన్త్ క్లాస్ విద్యార్థినిపై అత్యాచారం)
రేణిగుంట మండలం మామండూరు పంచాయతీ కుక్కలదొడ్డి సమీపంలో ఎదురుగా రేణిగుంట వైపు వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కువైట్ నుంచి వస్తున్న సుబ్బనరసమ్మ(60), ఆమె సోదరుడు లక్ష్మయ్య(40) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న లక్ష్మయ్య కుమారుడు శేఖర్(20), బావ సిద్ధయ్య(67), బెరసపల్లికి చెందిన కారు డ్రైవర్ భాను (32)కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ అంజూయాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వీరిలో సిద్ధయ్య, భాను పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్‌వీ వైద్య కళాశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
చదవండి: (డ్యూటీకి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి..)
కుమార్తె భవిష్యత్ కోసమే..
సుబ్బనరసమ్మకు పెళ్లయిన కొన్నేళ్లకే భర్త మృతి చెందాడు. ఒక్కగానొక్క కూతురు లక్ష్మీదేవి భవిష్యత్తు కోసం, పొట్ట చేతపట్టుకుని 15ఏళ్ల కిందట ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లింది. కొంత సంపాదించి కుమార్తెను మడంపల్లివాసికి ఇచ్చి తొమ్మిదేళ్ల కిందట వివాహం జరిపించింది. మూడేళ్లకోసారి వచ్చి కుమార్తె చూసుకుంటూ కొన్నేళ్లపాటు ఇక్కడే ఉండి మళ్లీ కువైట్‌కు వెళుతుండేది. ఈ క్రమంలో 2019లో ఆమె కువైట్‌కు వెళ్లింది. ఇక ఇంటివద్దే ఉండి, కూతురు బాగోగులను చూసుకుంటానని కుమార్తె, బంధువులకు చెప్పి కువైట్‌లో బుధవారం బయల్దేరింది.
గురువారం ఉదయం కన్నకూతురును చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె సోదరుడు లక్ష్మయ్యది కూడా రెక్కాడితే గానీ డొక్కాడని దుస్థితి. ఆయనకు భార్య గంగాదేవి, ఇద్దరు కుమారులు మహేంద్ర(22), శేఖర్(20) ఉన్నారు. ఈ ప్రమాదంలో శేఖర్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో గంటకల్లా ఇల్లు చేరుతామనుకున్న వారిపై దూసుకొచ్చిన మృత్యుశకటం ఆ కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment