రక్తమోడిన రహదారులు | Four killed after car crashes into fuel tanker from behind in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రక్తమోడిన రహదారులు

Jul 7 2024 5:10 AM | Updated on Jul 7 2024 5:12 AM

Four killed after car crashes into fuel tanker from behind in Andhra Pradesh

అన్నమయ్య జిల్లాలో ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు

నలుగురు దుర్మరణం

చిత్తూరు జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

రెండు ప్రమాదాల్లో 22 మందికి గాయాలు

రాష్ట్రంలో శనివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు 

మృత్యువాత పడగా మరో 22 మందికి గాయాలయ్యాయి.

పెద్దపంజాణి: చిత్తూరు జిల్లా బసవరాజు కండ్రిగ సమీపంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలు కాగా, మరో 21 మంది గాయపడ్డారు. శనివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దపంజాణి పోలీసుల కథనం ప్రకారం.. సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు పరిసర గ్రామాలకు చెందిన 45 మంది తమిళనాడు రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నారు. అనంతపురానికి చెందిన ఖాన్‌ ట్రావెల్స్‌ బస్సు మాట్లాడుకుని, ఐదుగురు టూర్‌ నిర్వాహకులతో శుక్రవారం రాత్రి బయలుదేరారు.

అతివేగమే ప్రమాదానికి కారణం
బస్సు శనివారం వేకువజామున పెద్దపంజాణి మండల పరిధి పలమనేరు–పుంగనూరు మార్గంలో బసవరాజు కండ్రిగ సమీపానికి చేరుకుంది. బస్సును డ్రైవర్‌ అతివేగం, అజాగ్రత్తగా నడపడంతో  అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సత్యసాయి జిల్లా రొద్దం మండలం చిన్నగువ్వలపల్లికి చెందిన తిమ్మారెడ్డి భార్య రామానుజమ్మ (58), కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లా మురారాయనపలి్లకి చెందిన నరసింహారెడ్డి (68) అక్కడిక్కడే మృతి చెందారు. బస్సులోని 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పెద్దపంజాణి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.

అన్నమయ్య జిల్లాలో ఘోరం
రామాపురం: కర్నూలు–చిత్తూరు 40వ జాతీయ రహదారిపై అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చిట్లూరు పంచాయతీ దళితవాడ సమీపంలో శనివారం తెల్లవారుఝామున ఘోర ప్రమా­దం జరిగింది. ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో కడప నాగరాజుపేటకు చెందిన హోంగార్డు పూజారి ఆంజనేయులునాయక్‌ (28), కడప రాజారెడ్డివీధికి చెందిన కారు డ్రైవర్‌ పఠాన్‌ అఫ్రోజ్‌ఖాన్‌ (35), కడప నాగరాజుపేటకు చెందిన మారాబత్తుల జితేంద్రకుమార్‌ (24), కడప ఐటీఐ సర్కిల్‌కు చెందిన షేక్‌ హలీమ్‌ (35) ఉన్నారు.

కడప రవీంద్రనగర్‌కు చెందిన షేక్‌ ఖాదర్‌బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కడప పట్టణానికి చెందిన ఈ ఐదుగురూ శుక్రవారం అర్ధరాత్రి కారులో కడప నుంచి బయలుదేరి రాయచోటి వైపు కారులో వెళ్తుండగా, రామాపురం మండలం చిట్లూరు దళితవాడ సమీపంలోని వంతెన వద్ద ఆ కారు ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను వెనుక వైపు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో రాయచోటి ఆస్పత్రికి తరలిస్తుండగా జితేందర్‌కుమార్‌ మార్గంమధ్యలో మృతి చెందాడు. లక్కిరెడ్డిపల్లె సీఐ గంగనాధబాబు, రామాపురం ఎస్‌ఐ వి.లక్ష్మీప్రసాద్‌రెడ్డి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement