ఎంత కష్టం... ఎంత ఘోరం.. | Three people died in Chennai | Sakshi
Sakshi News home page

ఎంత కష్టం... ఎంత ఘోరం..

Published Sun, Jul 24 2016 5:09 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

ఎంత కష్టం... ఎంత ఘోరం..

ఎంత కష్టం... ఎంత ఘోరం..

పొట్టపోషణకు వెళ్లి ముగ్గురి యువకుల మృత్యువాత
చెన్నైలోని ఓ హోటల్ ట్యాంకులో విషవాయువుకు బలి
విషయం తెలుసుకున్న లక్ష్మీపురంలోని కన్నవారి రోదన
హుటాహుటిన చెన్నై బయలుదేరిన కుటుంబాలు

 
వారంతా నిరుపేదలు. అందులో ఓ ముగ్గురు ఉన్న ఊళ్లో ఉపాధి లేక పొట్టపోషణకు వలసబాట పట్టారు. రోజంతా కాయకష్టం చేసి... సంపాదించిన దాంట్లో కొంత స్వగ్రామంలోని కన్నవారికి పంపిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న ఆ యువకులు హఠాత్తుగా కన్నుమూశారు. వారిపైనే ఆధారపడిన ఆ కుటుంబాలు నేడు దిక్కుతోచక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. పెళ్లీడుకు రాకుండానే... ప్రాణాలు కోల్పోయిన తనయులను తలచుకుని గుండెలవిసేలా రోదిస్తున్నాయి. ఆదుకుంటున్న పిల్లలు అందని తీరాలకు చేరడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి.

విజయనగరం జిల్లా : ఒకే ఊరికి చెందిన వారంతా ఒకేచోట పనిచేస్తున్నారు. తోడునీడగా మెలిగి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు. పని చేస్తున్న చోటే మురుగునీటిని శుభ్రం చేసేందుకు ట్యాంకులోకి దిగి ఊపిరాడక మృత్యువాత పడ్డారు. చెన్నైలోని పెరంబూరులో చోటు చేసుకున్న ఈ సంఘటనలో మృత్యువాత పడిన ముగ్గురూ సీతానగరం మండలం లక్ష్మీపురానికి చెందిన వారే. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన పడ్డ సత్యనారాయణ(22), పువ్వల రామకృష్ణ (20), చప్ప వినయ్‌(22)లు చెన్నెలోని మూడేళ్ళుగా సంగీతా రెస్టారెంట్‌లో పని చేస్తున్నారు. శనివారం విధులు ముగించుకుని నివాసస్థలానికి వెళ్తున్న సమయంలో హోటల్‌ మేనేజరు పిలిచి హోటల్‌ను ఆనుకుని ఉన్న మురుగునీటి ట్యాంకు శుభ్రం చేయమని పురమాయించాడు. తొలుత రామకృష్ణ అందులో దిగి ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో వినయ్‌ వెళ్లాడు. తానూ రాకపోవడంతో చివరిగా సత్యనారాయణ దిగాడు. ముగ్గురూ అందులోంచి తిరిగి రాకపోవడంతో విషవాయువు ప్రభావంతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై మృత్యువాతపడ్డారని నిర్ధారించుకున్నారు.
 
వెంటనే స్వగ్రామానికి సమాచారం
వీరికి పని పురమాయించిన మేనేజర్‌ రెస్టారెంట్‌ యజమానికి సమాచారం అందించి పరారయ్యాడని చెన్నైలోనే నివాసం ఉంటున్న రామకృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని వెనువెంటనే లక్ష్మీపురంలోని సత్యనారాయణ, వినయ్‌ కుటుంబ సభ్యులకు అందించడంతో ఇక్కడివారంతా బోరున విలపించారు. కుటుంబాలను ఆదుకుంటూ.. ఎంతో ఒద్దికగా బతుకుతున్న తమ పిల్లలు ఇలా అర్ధంతరంగా తనువుచాలిస్తారని ఊహించలేదని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. 
 
 
కుటుంబానికి ఆసరాగా నిలవాలని...
సన్నకారు వ్యవసాయ కుటుంబానికి చెందిన పడ్డ సూర్యనారాయణ రమణమ్మలకు ఇద్దరు కుమారులు. అందులో పెద్దకుమారుడు సత్యనారాయణకు ఇంకా పెళ్లి కాలేదు. తండ్రి సంపాదన సరిపోకపోవడంతో పొట్టపోషణకోసం చెన్నై వెళ్లాడు. అక్కడి రెస్టారెంట్‌లో మూడేళ్ళుగా పనిచేస్తూ ఆర్ధికంగా కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. ఇంతలోనే అలా వెళ్లిపోయావా అంటూ ఆ తల్లిదండ్రుల రోదన గ్రామంలో మిన్నంటింది.
 
 
ఆ ఇంటిదీపం ఆరిపోయింది
సామాన్య రైతు కుటుంబానికి చెందిన చప్ప వాసుదేవరావు, చిన్నమ్మి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. పెద్దకుమారుడు వినయ్‌ ఏడో తరగతివరకూ చదువుకుని కుటుంబానికి ఆసరాగా నిలవాలని మూడేళ్ల క్రితమే చెన్నై వెళ్లి అక్కడ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. అంతేగాకుండా తన తమ్ముడ్ని కూడా చెన్నై తీసుకు వెళ్ళడంతో ఊళ్లో ఆ ఇద్దరే ఉంటూ తమకున్న తక్కువ భూమిలో పంట పండించుకుని జీవిస్తున్నారు. పెద్ద కొడుకు మరణవార్తతో ఆ కుటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది.
 
 
చెన్నైలోనే కాపురం ఉంటూ...
పువ్వల శంకరరావు, సరస్వతి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిద్దరూ టెన్‌్తవరకూ లక్ష్మీపురంలోనే ఉండిlచదివించినప్పటికీ ఆర్థిక స్థోమత లేకపోవడంతో పిల్లలిద్దరినీ తోడ్చుకుని ఆ కుటుంబం మొత్తం మూడేళ్ళక్రితం చెన్నైకి వలస పోయారు. ప్రస్తుతం అక్కడే జీవనం సాగిస్తున్నారు. అందులో పెద్దకుమారుడు రామకృష్ణ ట్యాంకులోకి దిగి మృత్యువాత పడటంతో ఆ కుటుంబం దిక్కుతోచనిదయ్యింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement