సాక్షి, సిర్పూర్: జిల్లాలో వర్షం కురిసిన ప్రతిసారి ఉరుములు, మెరుపులకు తోడు పిడుగులు భయపెడుతున్నాయి. భారీ శబ్ధాలతో కూడిన ఉరుములు ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. రెట్టించిన శబ్ధంతో పడుతున్న పిడుగులు మరింత భయపెడుతున్నాయి. వర్షం పడుతున్న సమయంలో విపరీతమైన గాలులు వీస్తుండటంతో ప్రజలకు ఇంట్లో తప్ప.. మరెక్కడా రక్షణలేని పరిస్థితి నెలకొంటోంది. వర్షాకాల సీజన్‌లో కాకుండా ఇతర సీజన్లలో పిడుగులు పడుతుండటం ఆందోళన కలిగించే పరిణామం.
ప్రాణాలు తీస్తున్నాయి
ఏటా పిడుగుపాటుకు గురై పలువురు మత్యువాత పడుతున్నారు. ఇంటి వద్ద ప్రమాదాలు తక్కువగా కనిపిస్తున్నా.. ఊరి బయట, అడవిలోనే పిడుగుపాటుకు ఎక్కువగా గురవుతున్నారు. ఎందుకంటే అడవిలో, పొలంలో, మనుషులు చెట్ల కింద ఉంటే గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో అక్కడే పిడుగులు పడుతున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. పిడుగుల వల్ల ఏటా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. బర్రెలు, గొర్రెలు, ఇతర జంతువులు కూడా పిడుగు పాటుకు బలైపోతున్నాయి. పిడుగు పడి చనిపోతున్న వారు కొందరైతే, ఉరుముల శబ్ధానికి భయపడి గుండె ఆగి మరణిస్తున్న వారూ ఉన్నారు.
పిడుగుపాటుకు గత నెల ఒకరి మృతి
గత నెలలో బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామానికి చెందిన 9 వ తరగతి విద్యార్థి గొర్రెపల్లి రాజేశ్వర్(16) పిడుగుపాటుతో మృతి చెందాడు. కౌటాల మండల కేంద్రానికి చెందిన ఆవుల గంగయ్యకు చెందిన ఆవు పిడుగు పాటుకు గురై మృత్యువాత పడింది. మండలంలోని గురుడుపేట గ్రామానికి చెందిన నాయిని వెంకటేశ్, కుమ్మరి రమేష్, మేకల భీంరావు, చిన్నయ్య కనికి శివారులోని పత్తి పంటకు పిచికారీ చేయడానికి వెళ్లగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వారంతా సమీపంలోని చెట్టుకిందకు వెళ్లారు. వారికి సమీపంలోనే భారీ శబ్ధంతో పిడుగు పడడంతో అందరూ స్పృహతప్పి పడిపోయారు. ఈ క్రమంలో వెంకటేశ్ కంటి చూపు మందగించింది. కుమ్మరి రమేష్, భీంరావు, చిన్నయ్యలకు గాయాలయ్యాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- ఉరుములు, మెరుపుల సమయంలో కిటికీలు, తలుపులు మూసివేయాలి.
- బహిరంగ ప్రదేశాలలో ఉన్నట్లయితే సత్వరమే సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి.
- ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, మోటారు సైకిళ్లు తదితర వాటికి దూరంగా ఉండాలి.
- వాహనాన్ని నడుపుతున్న సమయంలో మంచి రహదారి కోసం ప్రయత్నించడం, చెట్లులేని, వరదలు రాని ప్రాంతాలకు వెళ్లాలి.
- వదులుగా, వేలాడుతున్న విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలి.
చేయకూడని పనులు..
- ఎలక్ట్రిక్ అనుసంధానం ఉన్న విద్యుత్ పరికరాలను వినియోగించరాదు.
- సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలి
- చెట్ల కింద, చెట్ల సమీపంలో ఉండరాదు
- బహిరంగ ప్రదేశాలలో విడిగా ఉన్న షెడ్లు, ఇతర చిన్న నిర్మాణాల వద్ద ఉండరాదు.
జాగ్రత్తలు పాటించాలి
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పిడుగులు పడే సమయంలో ప్రజలు బయట తిరగకూడదు. చెట్ల కింద ఉండకూడదు. ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించకూడదు. జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. వర్షం పడుతున్న సమయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. పిడుగుల ప్రభావంపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– ఎం.కవిత, భౌతికశాస్త్ర ఉపాధ్యాయురాలు, కౌటాల
Comments
Please login to add a commentAdd a comment