
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పెంచిన సినిమా చార్జీలు ఈ వారం కూడా కొనసాగుతున్నాయి. గత వారం విడుదలైన ఓ సినిమాకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు తొలి వారం చార్జీలు పెంచుకున్న థియేటర్లు, మల్టీపెక్స్‌లు రెండవ వారంలోనూ చార్జీల మోతను కొనసాగిస్తున్నాయి. వారం రోజుల తర్వాత పాత చార్జీలనే కొనసాగించాల్సిన మాల్స్, థియేటర్ యజమానులపై ఎవరి నియంత్రణ లేకపోవటంతో గురువారం కొన్ని పలు ప్రాంతాల్లో కొత్త చార్జీలు వసూలు చేశారు. ఇదే విషయమై తార్నాకలోని ఓ సినిమా థియేటర్‌పై ప్రేక్షకులు ఫిర్యాదు చేసి, ఆధారాలు సైతం ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు అందించారు.పోలీసులు విచారించిన తర్వాత గురువారం సాయంత్రం నుంచి చార్జీలను తగ్గించారు.
ఉప్పల్‌లోని ఓ మాల్‌లో సైతం గత వారం పెంచిన చార్జీలతను షో నడిపించారు. ఎల్బీనగర్ సింగిల్ థియేటరల్లోనూ పెంచిన చార్జీలతోనే రెండవ వారం కూడా టికెట్లు జారీ చేశారు. అయితే పెంచిన చార్జీలపై నిఘా ఉంచి తక్షణం స్పందించాల్సిన యంత్రాంగం చూసీ చూడని వైఖరితోనే రెండవ వారం కూడా చార్జీలు కొనసాగుతున్నాయన్న ఫిర్యాదులు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి తొలివారం ధరలు పెంచుకునే వెలుసులుబాటు ఇచ్చిన ఉత్తర్వులను అంగీకరించటం లేదని ప్రకటించిన ప్రభుత్వం సకాలంలో మళ్లీ కోర్టులో ఆప్పీల్ చేయకపోవటం, రెండవ వారం కూడా నగరంలో పలు చోట్ల పెంచిన చార్జీలే అమలవుతుండటం దారుణమని సామాజిక ఉద్యమకారుడు బొగ్గుల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా యాక్టు ప్రకారంగా కేసు నమోదు –ఓయూ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి...
తార్నాకలోని ఆరాధన థియేటర్‌లో నడుస్తున్న మహర్షి సినిమా టికెట్లను హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ అధిక రేట్లకు విక్రయిస్తున్నారంటూ తమకు ఫిర్యాదు అందిందని ఓయూ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. దీనిపై థియేటర్ మేనేజర్ మణిని స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టామనిచెప్పారు. ఈ విచారణలో హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ అధిక ధరలకే టికెట్లు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. సెక్షన్ 9ఏ–(2) ఆఫ్ ఏపీ సినిమా రెగులేషన్ యాక్టు 1970 ప్రకారంగా కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ నర్సింగరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment