ఫైనల్స్‌కు సర్వం సిద్ధం
- సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆనంద్
సైబరాబాద్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఫైనల్స్‌కు సర్వం సిద్ధంగా ఉన్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం కమిషనరేట్‌లో ఉన్న 7 వేల సిబ్బందితో బందోబస్తుకు ప్రణాళికను రూపొందించామన్నారు.
తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అదనంగా 11 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్‌ఫోర్సెస్, 15 రాష్ట్ర ఆర్మ్డ్‌ఫోర్సెస్‌తో పాటు 3 వేల మంది ఇతర జిల్లాల సివిల్ కానిస్టేబుల్స్, హోమ్‌గార్డ్స్ సైబరాబాద్ పరిధిలో ఈనెల 26 నుంచి విధులు నిర్వహిస్తారన్నారు. సైబరాబాద్ పరిధిలో 1437 భవనాల్లో 4137 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరుగుతాయని, ఈ ప్రాంతాల్లో కచ్చితంగా ఎన్నికల నిబంధనలను అమలు చేస్తామని కమిషనర్ ఆనంద్ వెల్లడించారు.
635 పోలింగ్ స్టేషన్లు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించామని, ఈ ప్రాంతాల్లో సాయుధ సిబ్బందితో ప్రత్యేక పికెట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల నిర్వహణలో ఎవర్నీ ఉపేక్షించబోమని, అన్ని రాజకీయ పార్టీ అభ్యర్థులు తప్పనివసరిగా ఎన్నికల నియమ నిబంధనలను పాటించాల్సిందేనని కమిషనర్ స్పష్టం చేశారు. అభ్యర్థుల రోజువారీ కార్యక్రమాలపై ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్‌తో పాటు డీసీపీ, ఏసీపీలతో నిరంతరం నిఘా పెట్టి బందోబస్తును పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రచార సమయంలోను, పోలింగ్ రోజున ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే కఠినంగా వ్యవహరిస్తామని ఆనంద్ హెచ్చరించారు.
అభ్యర్థులపై 120 కేసులు...
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎన్నికల కోడ్‌ను అతిక్రమించిన అన్ని పార్టీల అభ్యర్థులపై 120 కేసులు నమోదైనట్టు కమిషనర్ తెలిపారు. ఈ కేసుల్లో అరెస్టులు కూడా జరిగాయన్నారు.
భారీగా సామగ్రి స్వాధీనం...
ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు రాజకీయ పార్టీలు సిద్ధం చేసుకున్న సామగ్రిని ఎస్‌ఎస్‌టీ టీమ్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ టీమ్‌లు స్వాధీనం చేసుకున్నాయని కమిషనర్ తెలిపారు. వీటిలో 35 క్రికెట్ కిట్స్, 275 వాలీబాల్ నెట్స్, 457 చీరలు, 1175 ప్యాంట్లు, షర్ట్‌లు, 4 ద్విచక్రవాహనాలు, 9 త్రీ వీలర్స్, 27 ఫోర్ వీలర్స్ ఉన్నాయన్నారు.
మద్యం నిల్వల కోసం గాలింపు....
ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం నిల్వలు, సరఫరాకు సంబంధించి ఇప్పటి వరకూ 196 కేసులు నమోదు చేశామన్నారు. రూ. 10.75 లక్షల విలువ చేసే మద్యాన్ని సీజ్ చే శామని కమిషనర్ తెలిపారు. కొందరు అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకొని మద్యం నిల్వ చేస్తున్నారని సమాచారం అందిందని, అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.