
నేడు జెడ్పీ చైర్మన్ ఎన్నిక
చైర్మన్‌గా బాలూనాయక్ ఎన్నిక లాంఛనమే
- వైస్ చైర్మన్‌గా కర్నాటి లింగారెడ్డి?
- విప్ అధికారం ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అప్పగించిన అధిష్టానం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ వశం కావడం లాంఛనమే. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్‌ను తమ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఖరారు చేసింది. ఈ మేరకు ఆయన పేరునే బీ-ఫారం కూడా సిద్ధమైనట్లు పార్టీ వర్గాల సమాచారం. అధిష్టానం విప్ జారీచేసే అధికారాన్ని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అప్పగించింది. జిల్లాలోని 59జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికంగా 43 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీ సాధించింది.
పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ 30 మంది సభ్యులు. కానీ కాంగ్రెస్‌కు మరో 13 స్థానాలు అధికంగా ఉన్నాయి. దీంతో జిల్లాపరిషత్ చైర్మన్,వైస్‌చైర్మన్ పదవులు కాంగ్రెస్ ఖాతాలోకి వెళతాయి. ఇక, అధికార టీఆర్‌ఎస్ పార్టీ 13 జెడ్పీటీసీ స్థానాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. తిరుగులేని మెజారిటీ ఉన్న కాంగ్రెస్‌లో పెద్దఎత్తున చీలిక తెస్తే మినహా పరిస్థితి తారుమారయ్యే అవకాశమే లేదు. మొదట్లో అక్కడక్కడా ప్రచారం జరిగినా, తీరా ఇప్పుడు ఆ ఊసే ఎవరూ ఎత్తడం లేదు.
అదేమాదిరిగా, కాంగ్రెస్‌లోనే మరో ఇద్దరు కూడా చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు జోరుగానే ప్రచారం జరిగింది. అయినా, ముఖ్య నాయకులు ఎవరూ గ్రూపులను ప్రోత్సహించని కారణంగా అధిష్టానం ముంద అనుకున్న విధంగానే బాలూనాయక్‌కే బి-ఫారం ఇచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. గిరిజనులకు తొలిసారి రిజర్వు అయిన జెడ్పీ పీఠం కోసం ఇతర పార్టీలు ఆశించే పరిస్థితే లేకుండా అయ్యింది. మొత్తంగా రిజర్వుడు స్థానాల నుంచి ఏడుగురు, జనరల్ స్థానాల నుంచి మరో నలుగురు మొత్తంగా 11 మంది ఎస్టీలు జెడ్పీటీసీ సభ్యులుగా గెలిచారు.
దీంతో చైర్మన్ పదవికి పోటీ పడే వారి సంఖ్య పెరుగుతుందని భావించినా, పెట్టుబడికి సంబంధించిన వ్యవహారం కావడంతో అంతా వెనకడుగు వేసినట్లే చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలూనాయక్‌ను సీపీఐ కోసం పక్కన పెట్టారు. టికెట్ త్యాగం చేసినందుకుగాను జెడ్పీ చైర్మన్ పదవిని ఇస్తామని ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ సమక్షంలో హామీ ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. ఈ హామీలో భాగంగానే బాలూనాయక్ జెడ్పీ పీఠాన్ని అధిష్టించనున్నారు.
వైస్ చైర్మన్... ఎవరు ?
సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఐదు స్థానాలకే పరిమితం అయిన కాంగ్రెస్ భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లనూ కోల్పోయింది. ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి వైస్ చైర్మన్ పదవిని కోరే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముందు నుంచీ కాంగ్రెస్‌లో పెద్దవూర జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి లింగారెడ్డి ప్రచారంలో ఉంది.
అయితే, వివిధ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయనను ఎంత వరకు వైస్‌చైర్మన్ పదవికి ఎన్నుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ సీనియర్ నేతలు చెబుతున్న విశ్వసనీయ సమచారం మేరకు లింగారెడ్డి పేరునే ఖరారు చేసినట్లు తెలుస్తోం ది. ఏదైనా జరగరాని, అనూహ్యమైన సంఘటన జరిగితే మినహా నల్లగొండ జిల్లా పరిషత్ కాంగ్రెస్‌నుంచి చేజారే పరిస్థితి లేనే లేదు.