సాక్షి, హైదరాబాద్: తమ రంగాలలో ఉత్తమ సేవ, అత్యుత్తమ ప్రతిభ, విశేష కృషి ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడుతున్న వారికి ప్రతి ఏటా అందించే ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డు’ల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమంలో పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పలువురు ఇతర ముఖ్యులు అతిథిలుగా పాల్గొనే ఈ కార్యక్రమంలో.. విజేతలకు 2017 సంవత్సరం సాక్షి ఎక్సలెన్స్ అవార్డులను అందజేస్తారు. కొందరి అసాధారణ ప్రతిభ, ఇంకొందరి అవిరళ సేవ, మరికొందరి విశేష కృషి.. తగురీతిలో గుర్తింపు పొందడమే కాకుండా సమకాలికులకు, తర్వాతి స్ఫూర్తి కావాలనేదే సాక్షి తలంపు.
ఇదే యోచనతో, సమాజంలోని వేర్వేరు రంగాల్లో విశేషంగా శ్రమిస్తున్నవారిని గుర్తించి, అభిమానించి, అభినందించి, అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని సాక్షి మీడియా సంస్థ గడిచిన మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. వరుసగా ఇది నాలుగో సంవత్సరం. విద్య, వైద్య, వాణిజ్య, వ్యవసాయ, సామాజిక సేవ తదితర రంగాలతోపాటు వివిధ విభాగాల్లో ఈ అవార్డులున్నాయి. సినిమా రంగానికి చెందిన పాపులర్ అవార్డులతోపాటు జ్యూరీ ప్రత్యేక అవార్డులను కూడా ఈ సందర్భంగా అందజేయనున్నారు.
సమాజ ఉన్నతికి తోడ్పడే కృషి ఏదైనా, అది.. వినూత్నంగా చేయడం, ప్రభావవంతంగా ఉండటం, సుస్థిరమై నిలవడం అన్న మూడు అంశాల ప్రాతిపదికన ఈ విజేతల్ని ఎంపిక చేశారు. అసాధారణ సేవ, కృషి, ప్రతిభ కలిగిన వ్యక్తులు, సంస్థల గురించి పలువురి ద్వారా అందిన ఎంట్రీలను పరిశీలించి, ప్రత్యేకంగా ఏర్పాటైన న్యాయనిర్ణేతలు అంతిమంగా విజేతల్ని ఖరారు చేశారు. రెయిన్‌బో ఆస్పత్రి మెటర్నల్, ఫీటల్ మెడిసిన్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రణతీరెడ్డి జ్యూరీకి అధ్యక్షత వహించారు. శనివారం జరిగే ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమ విశేషాలను స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న సాక్షి టీవీ ప్రసారం చేయనుంది.
ప్రతిభకు పట్టం.. సేవకు సలాం!
Published Sat, Aug 11 2018 1:28 AM | Last Updated on Sat, Aug 11 2018 8:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment