పెట్స్‌పై ప్రేమ.. జాగ్రత్త సుమా !
నేడు జూనోసిస్ డే
పోచమ్మమైదాన్/స్టేషన్‌ఘన్‌పూర్ : నగరవాసుల్లో జంతు ప్రేమ రోజురోజుకీ పెరుగుతోంది. కాపలా.. కాలక్షేపం.. హోదా.. ఆత్మీయత.. ఒంటరితనం.. కారణం ఏదైనా నగరవాసి జీవనంలో పెంపుడు జంతువులు భాగమైపోయాయి. వీటి సంరక్షణ విషయాల్లో అవగాహ న లేక తెలియకుండానే ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారు జంతు ప్రేమికులు. ఒక్కోసారి ప్రాణం మీదకు వచ్చే ప్రమాదకరమైన వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. అందుకే నేడు ‘జూనోసిస్ డే’ సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం.
కాదేదీ పెంపకానికి అనర్హం..
కుక్క, పిల్లి, పాము, ఎలుక, పావురం, పిచ్చుక, గుర్రం కుందేలు ఇలా ఏ జీవినైనా పెంచుకునేందుకు మక్కువ చూపుతున్నారు కొందరికి ఇవి స్టేటస్ సింబల్స్‌గా కూడా మారాయంటే నగరవాసి జంతు ప్రేమ ఏ స్థాయికి చేరిందో ఇట్టే అర్థమవుతుంది.
జూనోసిస్ అంటే..
జంతువుల నుంచి మనుషులు.. మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోసిస్ అంటారు. ఈ వ్యాధుల్లో రేబీస్ ప్రధానమైంది. లూయిపాశ్చర్ 1885 జూలై 6న యాంటీ రేబీస్‌ను తొలిసారిగా ఉపయోగించారు. ఈ రోజునే యాంటీ రేబీస్‌డేగా కూడా వ్యవహరిస్తారు. పెంపుడు జంతువులతో 60కిపైగా వ్యాధులు సంక్రమిస్తున్నట్లు గుర్తించారు.