మితిమీరిన జంతుప్రేమ | NDA govt extraordinary animal love | Sakshi
Sakshi News home page

మితిమీరిన జంతుప్రేమ

Published Tue, May 30 2017 12:29 AM | Last Updated on Sat, Oct 20 2018 5:26 PM

మితిమీరిన జంతుప్రేమ - Sakshi

మితిమీరిన జంతుప్రేమ

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతుండగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పశువుల క్రయవిక్రయాలపై హఠాత్తుగా జారీ చేసిన నోటిఫికేషన్‌ అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. మొత్తంగా పశు వధ నిషేధం అమల్లోకి తీసుకొచ్చారన్న విమర్శలు రాకుండా, క్రయవిక్రయాలకు విఘాతం కలిగించారన్న నిందపడకుండా ఈ నోటిఫికేషన్‌ కర్తలు చాలా జాగ్రత్తలు పాటించారు గానీ... దీన్ని జారీ చేసే ముందు కనీసం రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలని, వాటి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని ఎందుకనిపించలేదో ఆశ్చర్యకరం.

కనీసం పశువుల సంతలతో ముడిపడి ఉండే గ్రామీణ సంస్కృతి గురించి, ఆ సంతలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది గురించి ఈ నోటిఫికేషన్‌ కర్తలు కాస్తయినా ఆలోచించారా అన్న అనుమానం కలుగుతుంది. దేశంలో పశువుల సంతలు వేలాది సంవత్సరా లుగా జరుగుతున్నాయి. సమాజంలోని కొన్ని కులాలు కేవలం ఆ క్రయ విక్రయా లపై ఆధారపడే జీవనం సాగిస్తున్నాయి. తమ నోటిఫికేషన్‌ వల్ల ఇదంతా గంద రగోళంలో పడుతుందని, లక్షలాదిమంది జీవనాధారం దెబ్బతింటుందని పర్యావ రణ మంత్రిత్వ శాఖ గ్రహించకపోవడం విచారకరం.

పాడిపంటలు దేశ సౌభాగ్యానికి రెండు కళ్లు. పాలకుల విధానాల పుణ్యమా అని ఈ రెండూ గత కొన్నేళ్లుగా దెబ్బతింటూ వస్తున్నాయి. రైతులు నానాటికీ అప్పుల్లో కూరుకుపోతున్నారు. కరువుకాటకాల వల్ల అటు పశుగ్రాసానికి కూడా తీవ్ర కొరత ఏర్పడటంతో రైతులు తమ దగ్గరున్న మూగజీవాలను ఎలా పోషిం చాలో అర్ధంకాక కబేళాలకు తరలిస్తున్నారు. సాగును, పశుగణాన్ని బతికించడానికి అవసరమైన కార్యాచరణపై దృష్టి పెట్టాల్సిన ఈ తరుణంలో ఉన్నట్టుండి పర్యావ రణ శాఖ ఈ నోటిఫికేషన్‌ ఎలా జారీచేసిందో... పశు సంవర్ధక శాఖ చూసుకోవా ల్సిన ఈ వ్యవహారంలోకి ఎందుకు చొరబడిందో అనూహ్యం.

ఈ నోటిఫికేషన్‌ 1960నాటి జంతు హింసా నివారణ చట్టంకింద జారీ చేశారు. దీన్ననుసరించి ఆవులు, దూడలు, గేదెలు, ఎద్దులు, ఒంటెలు అమ్మేవారు ఇకపై వ్యవసాయ అవసరాల కోసమే వాటిని అమ్ముతున్నామని, కబేళాల కోసం కాదని లిఖితపూర్వక ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. తమకు సంబంధించిన సమస్త వివరాలూ ఫొటోలతోసహా ఇవ్వాలి. జిరాక్స్‌ కాపీలు జత చేయాలి. అటు కొను క్కునేవారు సైతం తాము కొంటున్నది వ్యవసాయ అవసరాలకు మాత్రమేనని ధ్రువీకరించాలి. హామీ పత్రాలివ్వాలి. వీరిద్దరూ వ్యవసాయం కోసమే ఈ లావాదేవీ జరిపారు తప్ప కబేళా కోసం కాదని సంత నిర్వాహణ కమిటీలు కూడా ధ్రువీ కరించాల్సి ఉంటుంది.

ఈ ధ్రువీకరణ కాపీలు అయిదు తయారుచేసి రెవెన్యూ అధికారికి, పశు వైద్యాధికారికి, పశువుల మార్కెట్‌ కమిటీకి సమర్పించాలి. క్రయ విక్రయదారులిద్దరూ చెరో కాపీ ఉంచుకోవాలి. ఇంతేకాదు... పశువుల మార్కెట్‌ కమిటీలు మూడు నెలల్లోపు జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఉండే పశు మార్కెట్‌ పర్యవేక్షణ కమిటీలో రిజిస్టర్‌ చేయించుకోవాలి. ఈ నిబంధనలు ఉన్న కొద్దీ పెరుగుతూ పోవన్న నమ్మకమేమీ లేదు. రైతులు పశువుల్ని తీరి కూర్చుని అమ్ముకోరు. సాకినన్నాళ్లూ వాటిని తమ కుటుంబసభ్యుల్లో ఒకరిగా చూసుకోవడం వారి సంస్కృతి. వ్యవసాయానికి అవసరమైన డబ్బు కోసమో, ఇంట్లో అత్య వసరంగా వచ్చిపడిన ఇబ్బంది తీర్చుకోవడానికో రైతులు పశువుల్ని అమ్ముకోవాల్సి వస్తుంది.

కరువు విలయతాండవం చేస్తూ పశుదాణా లభ్యం కానప్పుడు, ప్రభు త్వాలు సైతం అందుగురించి పట్టించుకోనప్పుడు విధిలేని స్థితిలో అమ్ముకుంటారు. పశువులు తీవ్ర అనారోగ్యానికి లోనైనప్పుడో, నిరుపయోగంగా మారినప్పుడో పోషించలేక తప్పనిసరై విక్రయిస్తారు. ఒక బర్రెకు దాణా కోసం రోజుకు రూ. 125 నుంచి రూ. 150 వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాలు కనీస ధర రూ. 40 వరకూ ఉంటుంది. పాల ఉత్పత్తి సరిగా లేకపోతే ఎన్నాళ్లని ఆ బర్రెను రైతు పోషిం చగలుగుతాడు? బాగా పాలిచ్చే వాటిని పెంచడం, అలా లేనివాటిని తొలగించు కోవడమనే ప్రక్రియ వల్లనే పాడి పరిశ్రమ బతకగలుగుతోంది. ఈ కొత్త నిబంధ నలు దాన్నంతటినీ తలకిందులు చేస్తాయి. పశువుల వర్తకులైనా, కొనుగోలుదారుౖ లెనా అధికశాతం నిరుపేదలు. నిరక్షరాస్యులు. ఇప్పుడు వచ్చిపడిన నిబంధనల కారణంగా ఇలాంటివారంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలి. అక్కడ సహజంగా చోటుచేసుకునే జాప్యం వల్ల అతి త్వరలోనే లంచావతారాలు పుట్టుకొచ్చి ఆ రైతుల్ని, వ్యాపారుల్ని పీల్చి పిప్పి చేస్తాయని వేరే చెప్పనవసరం లేదు.

అసలు పశువుల అమ్మకం మొత్తాన్ని నియంత్రించాలన్న ఆలోచన ఎందుకు వచ్చినట్టు? పాడి, వ్యవసాయ అవసరాలతోపాటు కబేళాలకు తరలించడానికి కూడా ఈ మార్కెట్లలో పశువుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్న అనుమానా లున్నాయట. జంతు హింసను నివారించడానికే దీన్ని జారీచేశారట. ఈ నోటి ఫికేషన్‌ పరోక్షంగా పశు మాంసం భుజించడాన్ని నిషేధిస్తోంది. శాకాహారానికి పరి మితం కావాలని శాసిస్తోంది. కబేళాలన్నిటికీ తాళం వేయాలని చూస్తోంది. అయితే వాటన్నిటినీ నేరుగా చెప్పలేక యాతన పడుతోంది. మన దేశం నుంచి 2016–17లో రూ. 26,000 కోట్ల విలువైన పశు మాంసం ఎగుమతులు జరిగాయి.

తోలు పరి శ్రమ ఉత్పత్తుల విలువ రూ. 35,000 కోట్లు. వీటిపై ఆధారపడి లక్షలాదిమంది జీవిస్తున్నారు. జంతు మాంసం, దాని అనుబంధ ఉత్పత్తులకు అవసరమయ్యే పశువుల్లో 90 శాతం పశువుల సంతల నుంచే సరఫరా అవుతాయి. వాటిపై ఆధారపడేవారిలో ముస్లింలు అధికం. ఇప్పటికే దేశంలో పలుచోట్ల గో సంరక్షణ పేరిట కొన్ని బృందాలు ఏర్పడి పశువుల్ని తరలించే ట్రక్కుల్ని ఆపి డ్రైవర్లపైనా, ఇతరులపైనా దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిని మరింత పెంచడం, లక్షలాదిమంది జీవితాలను అయోమయంలోకి నెట్టడం తప్ప ఈ నోటిఫికేషన్‌ సాధించేదేమీ ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement