సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మంచినీటి కొరత తీర్చేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటర్‌గ్రిడ్ పథకాన్ని జిల్లాలోని అన్ని ఆవాసాలకు అనుసంధానం చేయనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మూడు ప్రాంతాల్లో తాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నిరంతర నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించారు. దీనికి ప్రభుత్వం దాదాపు రూ.4వేల కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది.
నేడు మంత్రి కేటీఆర్ పరిశీలన
జిల్లాలో వాటర్‌గ్రిడ్ నిర్మాణ నమూనాలు, వాటి ద్వారా ప్రజలకు తాగునీరు అందే విధానాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం పరిశీలిస్తారు. జిల్లాలోని పాలేరు, వైరా ప్రాంతాల్లో పర్యటిస్తారు. జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు సరిపడా నీరందించే అవకాశం గోదావరి పరీవాహక ప్రాంతానికి ఉన్నట్లు గుర్తించారు. వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి అనువైనదిగా ఈ ప్రాంతాన్ని తీసుకున్నారు. అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద నిరంతరం నీరు అందుబాటులో ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా అక్కడ వాటర్‌గ్రిడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 22 మండలాల్లోని అన్ని ఆవాసాలకు తాగునీరు నిరంతరం సరఫరా చేయాలని నిర్ణయించారు.
రిజర్వాయర్ల పరిసరాల్లో..
పాలేరు రిజర్వాయర్ వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు (వాటర్‌గ్రిడ్) ద్వారా ఏడు మండలాల్లోని 365 ఆవాసాలకు నిరంతరం నీటి సరఫరా చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వైరాలో నిర్మించే వాటర్‌గ్రిడ్ ద్వారా 11 మండలాల్లోని 565 ఆవాసాలకు తాగునీరు అందించనున్నారు. ఇప్పటికే వైరా, పాలేరు, అశ్వాపురం మండలం పాములపల్లి వద్ద నిర్మిస్తున్న గ్రిడ్‌లను రాష్ట్ర ప్రభుత్వ తాగునీటి సలహాదారు హరి ఉమాకాంతారావుతో పాటు పలువురు అధికారులు సందర్శించారు.
సాంకేతిక పరమైన సూచనలు చేశారు. వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనులపై జిల్లా రక్షిత మంచినీటి సరఫరా అధికారులు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు వైరాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు తాగునీటికి పడుతున్న ఇబ్బంది, వాటర్‌గ్రిడ్ వల్ల ప్రజలకు కలిగే అదనపు ప్రయోజనం, ఇంటింటికీ పంపు కనెక్షన్ ఇచ్చే తీరు, పైపులైన్లు నిర్మించే విధానాన్ని అధికారులు మంత్రికి వివరిస్తారు.
మరికొన్ని మార్పులుండవచ్చు..
ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులకు అనువైన స్థలాన్ని అధికారులు సాంకేతికంగా ఖరారు చేశారు. ఒకవేళ మంత్రి కేటీఆర్ ఏమైనా మార్పులు సూచిస్తే దానికి అనుగుణంగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. తొలుత జూలూరుపాడు, ఏన్కూరు మండలాలకు పాములపల్లి వాటర్‌గ్రిడ్ ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని అధికారులు భావించారు.
అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. ఆ ప్రాంతాలు పాములపల్లికి అత్యంత దూరం కావడంతో ఈ రెండు మండలాలను వైరా వాటర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. వైరా వాటర్‌గ్రిడ్ పరిధిలో ఉన్న సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాలను పాములపల్లి వాటర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేస్తూ ప్రణాళిక రూపొందించారు. వాటర్‌గ్రిడ్‌తోపాటు సెకండరీ గ్రిడ్, మూడు మండలాలకు ఒక హెడ్‌వర్క్‌ను నిర్మిస్తారు. దీన్ని ఊరూరా ఉండే హెడ్‌వర్క్‌లతో అనుసంధానిస్తారు.
నాలుగేళ్లలో జిల్లావ్యాప్తంగా నీరు
ఇప్పటి వరకు జిల్లాలో 3,167 గ్రామాల్లో నిరంతరం, 1,282 గ్రామాల్లో పాక్షికంగా నీరు సరఫరా చేస్తున్నారు. వాటర్‌గ్రిడ్ నిర్మాణం పూర్తయితే వచ్చే నాలుగేళ్లలో 3,167 గ్రామాలకు 24 గంటలపాటు నీరు సరఫరా చేసే అవకాశం ఉంది. జిల్లాలోని 580 కిలోమీటర్ల పొడవున్న ప్రధాన పైపులైన్, అక్కడి నుంచి గ్రామాలు, ఆవాస ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు. దీని కోసం 4,431 కిలోమీటర్ల పొడవైన పైపులైన్ నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో పలు జలాశయాలు, చెరువుల్లో నీరు నింపి అక్కడి నుంచి నిరంతరం తాగునీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు జిల్లాలో ఈ పథకం విజయవంతానికి పూర్తిస్థాయి దృష్టి సారించారు.
దాహం తీరినట్టే..!
Published Thu, Jan 29 2015 5:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM
Advertisement
Advertisement