నల్లాలకు మీటర్లు | Water Grid Scheme Works Slow In Adilabad | Sakshi
Sakshi News home page

నల్లాలకు మీటర్లు

Published Sun, May 19 2019 8:09 AM | Last Updated on Sun, May 19 2019 8:09 AM

Water Grid Scheme Works Slow In Adilabad - Sakshi

ఓ ఇంట్లో నల్లాకు బిగించిన మీటర్‌

ఆదిలాబాద్‌రూరల్‌: వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా సరఫరా అయ్యే నీటి వినియోగానికి సంబంధించిన లెక్క ఇక పక్కాగా తేలనుంది. వాటర్‌గ్రిడ్‌ పథకం కింద ఇళ్లలో ఉచితంగా ఏర్పాటు చేసిన నల్లాలకు మీటర్లను అమర్చే ప్రక్రియ ఆదిలాబాద్‌ పట్టణంలో ప్రారంభమైంది. విడతల వారీగా ప్రతీ ఇంటిలోని నల్లాకు మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇంటింటికీ శుద్ధ జలాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా ఉచితంగా నల్లా కనెక్షన్‌ ఇచ్చింది.

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో ఇప్పటి వరకు 17 వేల నల్లాలు బిగించారు. వాటర్‌గ్రిడ్‌ ద్వారా నీటిని కూడా సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటర్‌ గ్రిడ్‌ నల్లాలన్నింటికీ నీటి లెక్కింపు మీటర్లు అమర్చనున్నారు. తొలుత పట్టణంలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఆయా వార్డుల్లో జరిగే నీటి సరఫరాకు అనుగుణంగా మీటర్లు బిగించనున్నారు. తొలుత పట్టణ శివారు కాలనీ అయిన రణాదీవేనగర్‌తోపాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రంగినేని మనీశ ప్రతినిధ్యం వహిస్తున్న ద్వారాకానగర్‌ వార్డులో మీటర్లను అమర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయా కాలనీల్లో ఇప్పటి వరకు 1300 మీటర్లు అమర్చారు. రోజుకు నాలుగు వార్డుల చొప్పున మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రారంభమైన నీటి సరఫరా..
వాగులు, చెలిమెలు, బావుల్లోని నీటిని తాగుతూ వ్యాధులబారిన పడుతున్న ప్రజలకు శుద్ధ జలాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటర్‌ గ్రిడ్‌ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి రోజుకు 90 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్ల చొప్పున రక్షిత మంచినీటి అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం పట్టణంతో పాటు పలు గ్రామాల్లో వాటర్‌ గ్రిడ్‌ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఎంత నీరు సరఫరా అవుతుందో లెక్కించేందుకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల వాటర్‌ సోర్సెస్‌ నుంచి రోజుకు ఎన్ని లీటర్ల నీరు సరఫరా జరుగుతోంది. ఒక్కో కుటుంబం రోజుకు ఎన్ని లీటర్ల నీటిని వినియోగిస్తోందనే విషయాలపై స్పష్టత రానుంది. మొత్తం ఎన్ని లీటర్ల డిమాండ్‌ ఉంది. ఎంత మేర సరఫరా జరుగుతోంది. ఎంత నీరు వృథాగా పోతుందనే విషయాలు ఈ మీటర్ల ద్వారా పక్కాగా తేలనున్నాయి. ప్రస్తుతానికి నీటి వినియోగాన్ని తెలుసుకునేందుకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నా భవిష్యత్‌లో మీటర్లు సూచించే రీడింగ్‌ ఆధారంగానే బిల్లులు వసూలు చేయనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీటర్ల బిగింపు ప్రస్తుతానికి మున్సిపాలిటీకే పరిమితమైనా దశల వారీగా గ్రామీణ ప్రాంతాల్లోనూ వాటర్‌గ్రిడ్‌ ద్వారా నల్లాలు బిగించి ప్రతీ ఇంటికి మీటర్లు పెట్టనున్నారు.
 
నత్తనడకన కొనసాగుతున్న పనులు..
ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో వాటర్‌గ్రిడ్‌ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. గత మాసంలోనే పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పినా మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికి ఆయా ప్రాంతాల్లో నిర్మిస్తున్న ట్యాంకులు నిర్మాణ దశలోనే కొనసాగుతున్నాయి. పలు కాలనీల్లో ఇంకా నల్లా కనెక్షన్లు ఇళ్లకు చేరుకోలేదు. జూన్‌లోగా పనులు పూర్తి కాకపోతే మళ్లీ వర్షాకాలంలో పట్టణ ప్రజలకు కలుషిత నీరే దిక్కు కానుంది. ఇప్పటికైనా పనుల్లో వేగం పెంచి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
  

విడతల వారీగా బిగిస్తున్నాం
మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటి వరకు 1300 వరకు వాటర్‌గ్రిడ్‌ నల్లాలకు మీటర్లు బిగించాం. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో మీటర్ల బిగింపులో కొంత జాప్యం జరుగుతోంది. దశల వారీగా పట్టణంలో అన్ని వాటర్‌ గ్రిడ్‌ నల్లాలకు మీటర్లు బిగించనున్నాం.– హరిబువన్, పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్, ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement