నేడే జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక | today Zilla Parishad President election | Sakshi
Sakshi News home page

నేడే జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక

Published Sat, Jul 5 2014 1:20 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

today Zilla Parishad President election

సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక శనివారం జరగనుంది. ఈ ఎన్నికకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జెడ్పీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ చివరి వరకు కొనసాగుతోంది. శనివారం ఉదయం పది గంటలలోపే ఈ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానున్నప్పటికీ.. శుక్రవారం రాత్రి వరకు ఈ అభ్యర్థి పేరును టీఆర్‌ఎస్ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే చైర్‌పర్సన్ అభ్యర్థిగా నిర్మల్ జెడ్పీటీసీ వి.శోభారాణిని ఎంపిక చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ అభ్యర్థి విషయంలో జిల్లా నాయకత్వం కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రాదేశిక ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడంతో టీఆర్‌ఎస్‌కు జిల్లా పరిషత్ పీఠాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండానే దక్కించుకునే అవకాశం లభించింది. చైర్‌పర్సన్ పదవి కోసం మంచిర్యాల జెడ్పీటీసీ ఆశలత, నిర్మల్ జెడ్పీటీసీ శోభారాణి, నార్నూర్ జెడ్పీటీసీ రూపవతి పుస్కర్ పేర్లు మొదటి నుంచి తెరపైకి వచ్చాయి. ఈ మేరకు నేతలు పలుమార్లు టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

 మరోవైపు జిల్లాలోని ఆ పార్టీ ముఖ్య నేతల మద్దతును కూడగట్టేందుకు పోటీ పడ్డారు. అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకే చైర్ పర్సన్, వైస్‌చైర్ పర్సన్‌ల ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ ముఖ్యనేతలు మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. కాగా జెడ్పీ చైర్ పర్సన్ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఆ పార్టీ జెడ్పీటీసీలతో జిల్లా ముఖ్య నాయకత్వం శుక్రవారం రాత్రి బాసరలోని ఓ ప్రైవేటు హోటల్‌లో సమావేశమైంది. ఇద్దరు కోఆప్షన్ సభ్యుల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ నేతలు చర్చించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ సమావేశం జరిగింది.

 జెడ్పీ ఎన్నిక కోసం ప్రత్యేక కమిటీ
 జెడ్పీ ఎన్నికను పర్యవేక్షించేందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక కమిటీ నియమించినట్లు సమాచారం. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో జిల్లా మంత్రి జోగు రామన్న, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షులు పురాణం సతీష్, లోకభూమారెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ కమిటీ శుక్రవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమైంది.

 అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి జెడ్పీటీసీలందరితో చర్చించి ఈ మేరకు అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. కాగా రెండు రోజులుగా ఇక్కడ టీఆర్‌ఎస్ జెడ్పీటీసీలతో క్యాంపు కొనసాగుతోంది. శనివారం ఉదయం టీఆర్‌ఎస్ జెడ్పీటీసీలు బాసర నుంచి బయలుదేరి నేరుగా జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయానికి చేరుకుంటారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతోపాటు జాగ్రత్తలు తీసుకుంటోంది.

 ఇప్పటికే విప్ జారీ చేసిన టీఆర్‌ఎస్
 ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ 38 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. బీఎస్పీ నుంచి గెలుపొందిన మరో జెడ్పీటీసీ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే నలుగురు కాంగ్రెస్ జెడ్పీటీసీలు కూడా తమ పార్టీకి మద్దతిస్తున్నట్లు టీఆర్‌ఎస్ జిల్లా నాయకత్వం పేర్కొంటోంది. చైర్‌పర్సన్ పీఠం దక్కాలంటే 27 మంది జెడ్పీటీసీల మెజారిటీ ఉంటే చాలు. కానీ టీఆర్‌ఎస్‌కు సొంతంగా 38 జెడ్పీటీసీలున్నారు. మరో ఐదుగురు ఇతర పార్టీల జెడ్పీటీసీల మద్దతు ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ పార్టీ జెడ్పీటీసీలకు ఆ పార్టీ నాయకత్వం విప్ జారీ చేసింది. ఈ మేరకు జిల్లా పరిషత్ ఎన్నికకు ప్రిసైండింగ్ అధికారి, కలెక్టర్‌కు లేఖ సమర్పించింది.

 ఎంపీపీ ఎన్నిక మాదిరిగానే..
 జిల్లా అధికార యంత్రాంగం జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జెడ్పీ చైర్ పర్సన్, వైస్‌చైర్ పర్సన్ ఎన్నిక విధానం దాదాపుగా ఎంపీపీ ఎన్నిక మాదిరిగానే ఉంటుందని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మండల పరిషత్‌లో ఒక్కరు కో-ఆప్షన్ సభ్యులుగా ఉంటే, జెడ్పీలో మాత్రం ఇద్దరు ఉంటారు. ముందుగా కో-ఆప్షన్ సభ్యుల కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు.

శుక్రవారం ఉదయం 10 గంటల వరకు కో-ఆప్షన్ సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10 నుంచి 12 గంటల వరకు ఈ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ పరిశీలన అనంతరం బరిలో ఉన్న కో-ఆప్షన్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది. మొదట జెడ్పీటీసీలు అందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నిక ఫలితం ప్రకటించిన తర్వాత తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది.

 ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌చైర్ పర్సన్‌లను ఎన్నుకుంటున్నారు. చైర్ పర్సన్ అభ్యర్థి ఓ జెడ్పీటీసీ ప్రతిపాదిస్తే.. మరో సభ్యుడు బలపరచాలి. ఇది కూడా చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. 50 శాతం మంది జెడ్పీటీసీలు ఉంటే కోరం ఉన్నట్లుగా భావించి సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ ఆయా నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా మాత్రమే ఉంటారు. వీరికి ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement