vice-chairperson
-
రాజ్యసభ వైస్ చైర్పర్సన్లలో సగం మంది మహిళలు
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ వైస్ చైర్పర్సన్ల ప్యానెల్లో సగం మంది మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఇది జూలై 17 నుంచి అమల్లోకి వచ్చిందని ఆయన గురువారం ప్రకటించారు. కొత్తగా ఉపాధ్యక్షులైన రాజ్యసభ సభ్యుల్లో పీటీ ఉష, ఎస్.ఫంగ్నొన్ కొన్యాక్, ఫౌజియా ఖాన్, సులాటా దియో, వి.విజయసాయిరెడ్డి, ఘన్‌శ్యామ్ తివారీ, ఎల్.హనుమంతయ్య, సుఖేందు శేఖర్ రే ఉన్నారు. నాగాలాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మొట్టమొదటి మహిళ కొన్యాక్ సహా ప్యానెల్లోకి తీసుకున్న మహిళా సభ్యులందరూ మొదటిసారిగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన వారే. ఎగువసభ చరిత్రలో వైస్ చైర్పర్సన్ల ప్యానెల్లోకి సగం మందికి ప్రాతినిధ్యం కల్పించడం ఇదే ప్రథమం అని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. -
సీటుకు ఎసరు
శాసనమండలి చైర్మన్‌గిరిపై కాంగ్రెస్ కన్ను జేడీఎస్ మద్దతుతో దక్కించుకునేందుకు యత్నం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన మండలిలో సంఖ్యా బలం పెరగడంతో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను చేజిక్కించుకోవడానికి అధికార కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. జేడీఎస్ కూడా ఆ పార్టీకి మద్దతు పలకడానికి అంగీరించినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా ప్రస్తుత చైర్మన్ డీహెచ్. శంకరమూర్తితో పాటు వైస్ చైర్పర్సన్ విమలా గౌడను పదవీచ్యుతులను చేయడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీజేపీకి చెందిన వీరిద్దరూ సభలో కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల అభిప్రాయ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వడం లేదనే సాకుతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించనున్నారు. శాసన మండలిలో మొత్తం సంఖ్యా బలం 75 కాగా 31 మంది సభ్యులతో బీజేపీ ఇప్పటికీ అతి పెద్ద పార్టీగా ఉంది. ఐదుగురు సభ్యులు నామినేట్ కావడం, అసెంబ్లీ నుంచి మండలికి జరగాల్సిన ఎన్నికల్లో నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, ఈశాన్య ఉపాధ్యాయుల నియోజక వర్గం నుంచి ఓ అభ్యర్థి గెలుపొందడంతో కాంగ్రెస్ బలం 28కి పెరిగింది. జేడీఎస్‌కు 12 మంది సభ్యులున్నారు. ముగ్గురు స్వతంత్ర సభ్యులు బైరతి సురేశ్, ఎండీ. లక్ష్మీనారాయణ, రఘు ఆచార్లు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి అంగీకరించారు. దీంతో బీజేపీయేతర పార్టీల మొత్తం బలం 43కు పెరుగుతుంది. అసెంబ్లీ నుంచి కౌన్సిల్‌కు జరగాల్సిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన మరో ఇండిపెండెంట్ డీయూ. మల్లిఖార్జున్ తటస్థంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఆయన బీజేపీ-జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగి ఎన్నికయ్యారు. ఆయనకు ఇప్పటికీ బీజేపీ ప్రాథమిక సభ్యత్వం ఉంది. కనుక ఓటింగ్‌కు గైర్హాజరవడం ద్వారా కాంగ్రెస్‌కు సహకరించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
మున్సిపల్ చైర్పర్సన్ అధికారాలు, విధులు..
మంచిర్యాల అర్బన్ : నాలుగు నెలల నిరీక్షణకు గురువారంతో తెరపడింది. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఈ తరుణంలో చైర్పర్సన్ విధులు ఏమిటో తెలుకుందాం.. పాలకవర్గం కొలువుదీరిన అనంతరం ప్రతినెలా కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి. సెక్షన్-47 ప్రకారం చైర్పర్సన్ అధికారాలు వినియోగించుకోవచ్చు. కౌన్సిల్, ప్రభుత్వం, అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు అన్ని చైర్పర్సన్ పేరుతో జరుగుతాయి. సెక్షన్ 48-ప్రకారం చైర్పర్సన్ 2, 3వ గ్రేడ్ పురపాలక సంఘాలలో చైర్పర్సన్ రూ.1000 మించి ఖర్చు చేయరాదు. ప్రత్యేక గ్రేడ్ మున్సిపాలిటీలలో రూ.5 వేలు మించరాదు. డబ్బులు ఖర్చు చేస్తే వాటి వివరాలు కౌన్సిల్ ముందుంచాలి. చైర్పర్సన్ వరుసగా పది రోజులకంటే ఎక్కువ రోజులు అధికార క్షేత్రం నుంచి గైర్హాజర్ అయినచో వైస్ చైర్మన్‌కు అధికారాలు సంక్రమిస్తాయి. అయితే రాష్ట్రం పరిధిలోనే ఉంటే అధికారాలు ైవె స్చైర్మన్కు లభించవు. వైస్‌చైర్మన్ కూడా వరుసగా 10 రోజులకు మించి స్థానికంగా లేకపోయిన, అశక్తుడైనా మరొకరికి ఆ పదవిని కట్టబెడతారు. చైర్పర్సన్ కౌన్సిల్ సమావేశంకు ఏదేని కారణం చేత సమావేశానికి హాజరుకాకపోతే వైస్ చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలి. చైర్మన్ గైర్హాజర్ అయితే కోరం సభ్యుల్లో ఒకరిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకుని సమావేశం నిర్వహించవచ్చు. -
నేడే జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక శనివారం జరగనుంది. ఈ ఎన్నికకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ చివరి వరకు కొనసాగుతోంది. శనివారం ఉదయం పది గంటలలోపే ఈ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానున్నప్పటికీ.. శుక్రవారం రాత్రి వరకు ఈ అభ్యర్థి పేరును టీఆర్ఎస్ అధినాయకత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే చైర్పర్సన్ అభ్యర్థిగా నిర్మల్ జెడ్పీటీసీ వి.శోభారాణిని ఎంపిక చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అభ్యర్థి విషయంలో జిల్లా నాయకత్వం కూడా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రాదేశిక ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడంతో టీఆర్ఎస్కు జిల్లా పరిషత్ పీఠాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండానే దక్కించుకునే అవకాశం లభించింది. చైర్పర్సన్ పదవి కోసం మంచిర్యాల జెడ్పీటీసీ ఆశలత, నిర్మల్ జెడ్పీటీసీ శోభారాణి, నార్నూర్ జెడ్పీటీసీ రూపవతి పుస్కర్ పేర్లు మొదటి నుంచి తెరపైకి వచ్చాయి. ఈ మేరకు నేతలు పలుమార్లు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు జిల్లాలోని ఆ పార్టీ ముఖ్య నేతల మద్దతును కూడగట్టేందుకు పోటీ పడ్డారు. అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకే చైర్ పర్సన్, వైస్‌చైర్ పర్సన్ల ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ ముఖ్యనేతలు మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. కాగా జెడ్పీ చైర్ పర్సన్ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఆ పార్టీ జెడ్పీటీసీలతో జిల్లా ముఖ్య నాయకత్వం శుక్రవారం రాత్రి బాసరలోని ఓ ప్రైవేటు హోటల్లో సమావేశమైంది. ఇద్దరు కోఆప్షన్ సభ్యుల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ నేతలు చర్చించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ సమావేశం జరిగింది. జెడ్పీ ఎన్నిక కోసం ప్రత్యేక కమిటీ జెడ్పీ ఎన్నికను పర్యవేక్షించేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక కమిటీ నియమించినట్లు సమాచారం. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో జిల్లా మంత్రి జోగు రామన్న, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, తూర్పు, పశ్చిమ జిల్లాల అధ్యక్షులు పురాణం సతీష్, లోకభూమారెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ కమిటీ శుక్రవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమైంది. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి జెడ్పీటీసీలందరితో చర్చించి ఈ మేరకు అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. కాగా రెండు రోజులుగా ఇక్కడ టీఆర్ఎస్ జెడ్పీటీసీలతో క్యాంపు కొనసాగుతోంది. శనివారం ఉదయం టీఆర్ఎస్ జెడ్పీటీసీలు బాసర నుంచి బయలుదేరి నేరుగా జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయానికి చేరుకుంటారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతోపాటు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే విప్ జారీ చేసిన టీఆర్ఎస్ ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ 38 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. బీఎస్పీ నుంచి గెలుపొందిన మరో జెడ్పీటీసీ కూడా టీఆర్ఎస్లో చేరారు. అలాగే నలుగురు కాంగ్రెస్ జెడ్పీటీసీలు కూడా తమ పార్టీకి మద్దతిస్తున్నట్లు టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం పేర్కొంటోంది. చైర్పర్సన్ పీఠం దక్కాలంటే 27 మంది జెడ్పీటీసీల మెజారిటీ ఉంటే చాలు. కానీ టీఆర్ఎస్కు సొంతంగా 38 జెడ్పీటీసీలున్నారు. మరో ఐదుగురు ఇతర పార్టీల జెడ్పీటీసీల మద్దతు ఉన్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ పార్టీ జెడ్పీటీసీలకు ఆ పార్టీ నాయకత్వం విప్ జారీ చేసింది. ఈ మేరకు జిల్లా పరిషత్ ఎన్నికకు ప్రిసైండింగ్ అధికారి, కలెక్టర్‌కు లేఖ సమర్పించింది. ఎంపీపీ ఎన్నిక మాదిరిగానే.. జిల్లా అధికార యంత్రాంగం జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జెడ్పీ చైర్ పర్సన్, వైస్‌చైర్ పర్సన్ ఎన్నిక విధానం దాదాపుగా ఎంపీపీ ఎన్నిక మాదిరిగానే ఉంటుందని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మండల పరిషత్‌లో ఒక్కరు కో-ఆప్షన్ సభ్యులుగా ఉంటే, జెడ్పీలో మాత్రం ఇద్దరు ఉంటారు. ముందుగా కో-ఆప్షన్ సభ్యుల కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటల వరకు కో-ఆప్షన్ సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10 నుంచి 12 గంటల వరకు ఈ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ పరిశీలన అనంతరం బరిలో ఉన్న కో-ఆప్షన్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది. మొదట జెడ్పీటీసీలు అందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నిక ఫలితం ప్రకటించిన తర్వాత తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్, వైస్‌చైర్ పర్సన్లను ఎన్నుకుంటున్నారు. చైర్ పర్సన్ అభ్యర్థి ఓ జెడ్పీటీసీ ప్రతిపాదిస్తే.. మరో సభ్యుడు బలపరచాలి. ఇది కూడా చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. 50 శాతం మంది జెడ్పీటీసీలు ఉంటే కోరం ఉన్నట్లుగా భావించి సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ ఆయా నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక ఆహ్వానితులుగా మాత్రమే ఉంటారు. వీరికి ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు. -
ఇచ్ఛాపురంలో వైఎస్సార్ సీపీ పాగా
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్‌పర్సన్‌గా కె.శకుంతల ఎన్నికయ్యారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో టెక్కలి ఆర్డీవో శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ముందుకు సభ్యులందరితోనూ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైఎస్సార్ సీపీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ పిలక రాజ్యలక్ష్మి పేరును చైర్‌పర్సన్‌గా చదివివినిపించారు. ఆమెకు మద్దతుగా ఆ పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. అనంతరం టీడీపీ అభ్యర్థి బుగత కుమారి పేరు ను ప్రస్తావించగా 11 ఓట్లు వచ్చాయి. (8 మంది టీడీపీ కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్యెల్యే అశోక్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఓటేశారు). దీంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి పేరును ఖరారు చేశారు. వైస్‌చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ సీపీకి చెందిన కాళ్ల శకుంతులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిద్దరికీ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అభినందనల వెల్లువ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లుగా ఎన్నికైన రాజ్యలక్ష్మి, శకుంతలను ఎన్నికల అధికారి శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ బి.అశోక్, సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ ఇన్చార్జి రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, నర్తు రామారావు, శ్యాంప్రసాద్, నరేంద్రలు పుష్పగుచ్చాలతో అభినందించారు. చైర్పర్సన్ రాజ్యలక్ష్మి వైఎస్సార్ సీపీ మునిసిపల్ కన్వీనర్, మాజీ మునిసిపల్ చైర్మన్ పిలక పోలారావు కోడలు కాగా, వైస్‌చైర్‌పర్సన్ కాళ్ల శకుంతల పార్టీ నాయకుడు కాళ్ల దేవరాజ్ భార్య. రాజ్యలక్ష్మి (ఎమ్మెస్సీ) ఉన్నత విద్యావంతురాలు కావడంతో మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరంగా మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి, అక్కడ దివంగత ముఖ్యమంత్రి ైవె .ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. -
కొలువుదీరిన కొత్త ‘పుర’ పాలకవర్గాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మున్సిపల్ పరోక్ష పరీక్షలో కారు జోరు కొనసాగింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగగా, ఐదు మున్సిపాలిటీలపై అధికార టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల చైర్మన్ పదవులను దక్కించుకుంది. తీవ్ర ఉత్కంఠ నడుమ భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. మంచిర్యాల, బెల్లంపల్లిల్లో కాంగ్రెస్ అధిక కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్నా చైర్మన్ పీఠాలను దక్కించుకోలేకపోయింది. ఒక్క మంచిర్యాలలో వైస్ చైర్మన్ పదవికే పరిమితమైంది. మొత్తానికి బల్దియా పోరులో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయింది. ఆదిలాబాద్ బల్దియాలో 14 కౌన్సిలర్ స్థానాలను దక్కించుకున్న టీఆర్ఎస్ నలుగురు ఎంఐఎం, మరో నలుగురు స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. వైస్‌చైర్మన్ ఎంఐఎంకు దక్కింది. చైర్మన్‌గా రంగినేని మనీష, వైస్‌చైర్మన్‌గా ఎంఐఎంకు చెందిన ఎండీ ఫారుఖ్ అహ్మద్ ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రి జోగు రామన్న ఎక్స్ అఫీషియో సభ్యునిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మల్‌లో పురపాలక సంఘం చైర్మన్ సాంకేతికంగా బీఎస్పీ వశమైనా.. అధికార టీఆర్ఎస్ ఖాతాలోనే పడింది. బీఎస్పీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచిన అప్పాల గణేష్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో సహా గణేష్ కూడా టీఆర్ఎస్లో చేరారు. వైస్‌చైర్మన్‌గా ఎంఐఎంకు చెందిన అజీం బీన్ యాహియా ఎన్నికయ్యారు. బెల్లంపల్లిలో బల్దియాపైనా టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. చైర్మన్‌గా పి.సునీతారాణి, వైస్‌చైర్మన్‌గా నునేటి సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు అత్యధికంగా 14 స్థానాలు లభించినా, పది కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను వశం చేసుకోగలిగింది. ఇక్కడ సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ కౌన్సిలర్లతోపాటు మరో నలుగురు స్వతంత్రులు కూడా టీఆర్ఎస్కు మద్దతు పలికారు. ఆయా పార్టీలు విప్ జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్ పదవిని టీఆర్ఎస్కు చెందిన మామిడిశెట్టి వసుంధర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు దక్కింది. ఆ పార్టీ కౌన్సిలర్ నల్ల శంకర్ కూడా ఏకగ్రీవంగా వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు అత్యధిక కౌన్సిలర్ స్థానాలు దక్కినా, ఆ పార్టీ సభ్యుల మద్దతుతో టీఆర్ఎస్ అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ విప్ జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ వశమైంది. చైర్మన్‌గా సి.పి.విద్యావతి, వైస్‌చైర్మన్‌గా సద్దాం హుస్సేన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఈ పదవుల కోసం టీఆర్ఎస్లోనే పోటాపోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అనుచరు లు, ఇటీవల టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరులు పోటీ పడ్డా రు. ఈ విషయంలో మంత్రులు హరీష్‌రావు, జోగు రామన్న ఇరువర్గాల మధ్య స యోధ్య కుదిర్చారు. ఎట్టకేలకు సమ్మయ్య అనుచరులకే పదవులు దక్కాయి. భైంసాలో అత్యధికంగా 12 కౌన్సిలర్ స్థానాలను గెలుపొందిన ఎంఐఎం ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ సహాయంతో చైర్మన్, వైస్‌చైర్మన్ పీఠాలను దక్కించుకుంది. చైర్మన్‌గా సబియా బేగం, వైస్ చైర్మన్‌గా ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు జాబీర్ అహ్మద్ ఎన్నికయ్యారు. -
నేడే ‘పురాధీశుల’ ఎన్నిక
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మున్సిపల్ ఎన్నికల పర్వంలో తుది ఘట్టానికి నేడు తెరపడనుంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పాలక మండళ్లు గురువారం కొలువు దీరనున్నాయి. ఆయా మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండగా, మంచిర్యాల, బెల్లంపల్లి పురపాలక సంఘాల అధ్యక్ష పదవులను కూడా కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. భైంసా మున్సిపల్ చైర్మన్ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠకు గురువారం తెరపడనుంది. భైంసా బల్దియాలో ఎంపీ ఓటు హక్కు చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలో ఎక్స్అఫిషియో సభ్యులుగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న మున్సిపాలిటీల వివరాలను జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఎంతో ఉత్కంఠ రేపుతున్న భైంసా మున్సిపాలిటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇక్కడ అత్యధికంగా 12 కౌన్సిలర్ స్థానాలను ఎంఐఎం గెలుచుకున్నప్పటికీ, అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపాలిటీపైనా దృష్టి పెట్టింది. ఎంఐఎం మినహా అన్ని పార్టీల కౌన్సిలర్ల మద్దతుతో అధికార టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం ఆదిలాబాద్ ఎంపీ ఓటును ఈ మున్సిపాలిటీలో వినియోగించుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఎంఐఎం తో ఉన్న స్నేహ సంబంధాల మేరకు ఈ చైర్మన్ పీఠాన్ని ఎంఐఎంకు దక్కేలా సహకరించే అవకాశాలు కూడా లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా మంత్రి రామన్న ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించారు. పెద్దపల్లి ఎంపీ సుమన్ కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఓటు వేయాలని భావిస్తున్నా రు. నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ మున్సిపాలిటీలో, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప కాగజ్‌నగర్ బల్దియాలో, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మంచిర్యాల మున్సిపాలిటీలో, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు వీరంతా విల్లింగ్ లెటర్లను ఎన్నికల అధికారులకు ఇచ్చారు. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం తర్వాతే చైర్మన్ ఎన్నికలు.. గురువారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుం ది. ఎన్నికైన కౌన్సిలర్లు ముందుగా ప్రమాణస్వీకారం చేస్తారు. తర్వాత చైర్మన్ ఎన్నిక ఉంటుంది. చైర్మన్ అభ్యర్థిని ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే.. మరో సభ్యు డు బలపరచాలి. మొత్తం సభ్యుల్లో 50 శాతం సభ్యులుంటేనే కోరం ఉన్నట్లుగా భావించి సమావేశాన్ని ప్రారంభిస్తారు. లేనిపక్షంలో గంట వరకు వేచి ఉండి, చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేస్తారని మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇన్చార్జి, మెప్మా ప్రాజెక్టు డెరైక్టర్ రాజేశ్వర్ ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు. -
4న జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక
కలెక్టరేట్ : జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జూలై 4న, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికలు జూలై 3న జరుగుతాయని కలెక్టర్ జగన్ మోహన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్ ఎన్నికలు పంచాయతీ రాజ్ యాక్టు ప్రకారం, మున్సిపల్ ఎన్నికలు మున్సిపల్ యాక్టు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలన్నారు. ముందుగా చైర్మన్ ఎన్నిక నిర్వహించిన అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో కోరం తప్పనిసరిగా 50 శాతం ఉండాలని, కోరం లేని యెడల ఎన్నికను మరో రోజుకు వాయిదా వేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వీడియో చిత్రీకరణ తీయాలని సూచించారు. సంయుక్త కలెక్టర్ బి. లక్ష్మీకాంతం ప్రిసైడింగ్ అధికారులకు పలు సూచనలు అందించారు. ఉదయం 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని, అనంతరం పరిశీలన జరపాలని పేర్కొన్నారు. పరిశీలన అనంతరం వ్యాలిట్ నామినేషన్లు తెలియజేయాలన్నారు. ఒంటి గంటకు నామినేషన్ల ఉప సంహరణ ఉంటుందన్నారు. గైడ్‌లైన్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్, జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, డీఆర్వో ప్రసాదరావు, ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, చక్రధర్ రావు, రామచంద్రయ్య, మున్సిపల్, ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు.