ఇచ్ఛాపురంలో వైఎస్సార్ సీపీ పాగా
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్‌పర్సన్‌గా కె.శకుంతల ఎన్నికయ్యారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో టెక్కలి ఆర్డీవో శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ముందుకు సభ్యులందరితోనూ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైఎస్సార్ సీపీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ పిలక రాజ్యలక్ష్మి పేరును చైర్‌పర్సన్‌గా చదివివినిపించారు. ఆమెకు మద్దతుగా ఆ పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. అనంతరం టీడీపీ అభ్యర్థి బుగత కుమారి పేరు ను ప్రస్తావించగా 11 ఓట్లు వచ్చాయి. (8 మంది టీడీపీ కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్యెల్యే అశోక్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఓటేశారు). దీంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి పేరును ఖరారు చేశారు. వైస్‌చైర్‌పర్సన్‌గా వైఎస్సార్ సీపీకి చెందిన కాళ్ల శకుంతులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిద్దరికీ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
అభినందనల వెల్లువ
చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లుగా ఎన్నికైన రాజ్యలక్ష్మి, శకుంతలను ఎన్నికల అధికారి శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ బి.అశోక్, సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ ఇన్‌చార్జి రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, నర్తు రామారావు, శ్యాంప్రసాద్, నరేంద్రలు పుష్పగుచ్చాలతో అభినందించారు. చైర్‌పర్సన్ రాజ్యలక్ష్మి వైఎస్సార్ సీపీ మునిసిపల్ కన్వీనర్, మాజీ మునిసిపల్ చైర్మన్ పిలక పోలారావు కోడలు కాగా, వైస్‌చైర్‌పర్సన్ కాళ్ల శకుంతల పార్టీ నాయకుడు కాళ్ల దేవరాజ్ భార్య. రాజ్యలక్ష్మి (ఎమ్మెస్సీ) ఉన్నత విద్యావంతురాలు కావడంతో మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడుస్తుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరంగా మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి, అక్కడ దివంగత ముఖ్యమంత్రి ైవె .ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు.