కొలువుదీరిన కొత్త ‘పుర’ పాలకవర్గాలు | Chairman, vice-chairman elections completed | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన కొత్త ‘పుర’ పాలకవర్గాలు

Published Fri, Jul 4 2014 1:27 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM

Chairman, vice-chairman elections completed

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :  మున్సిపల్ పరోక్ష పరీక్షలో కారు జోరు కొనసాగింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగగా, ఐదు మున్సిపాలిటీలపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల చైర్మన్ పదవులను దక్కించుకుంది. తీవ్ర ఉత్కంఠ నడుమ భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. మంచిర్యాల, బెల్లంపల్లిల్లో కాంగ్రెస్ అధిక కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్నా చైర్మన్ పీఠాలను దక్కించుకోలేకపోయింది. ఒక్క మంచిర్యాలలో వైస్ చైర్మన్ పదవికే పరిమితమైంది. మొత్తానికి బల్దియా పోరులో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయింది.

ఆదిలాబాద్ బల్దియాలో 14 కౌన్సిలర్ స్థానాలను దక్కించుకున్న టీఆర్‌ఎస్ నలుగురు ఎంఐఎం, మరో నలుగురు స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. వైస్‌చైర్మన్ ఎంఐఎంకు దక్కింది. చైర్మన్‌గా రంగినేని మనీష, వైస్‌చైర్మన్‌గా ఎంఐఎంకు చెందిన ఎండీ ఫారుఖ్ అహ్మద్ ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రి జోగు రామన్న ఎక్స్ అఫీషియో సభ్యునిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
 నిర్మల్‌లో పురపాలక సంఘం చైర్మన్ సాంకేతికంగా బీఎస్పీ వశమైనా.. అధికార టీఆర్‌ఎస్ ఖాతాలోనే పడింది. బీఎస్పీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచిన అప్పాల గణేష్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో సహా గణేష్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. వైస్‌చైర్మన్‌గా ఎంఐఎంకు చెందిన అజీం బీన్ యాహియా ఎన్నికయ్యారు.
 
బెల్లంపల్లిలో బల్దియాపైనా టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసింది. చైర్మన్‌గా పి.సునీతారాణి, వైస్‌చైర్మన్‌గా నునేటి సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు అత్యధికంగా 14 స్థానాలు లభించినా, పది కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్న టీఆర్‌ఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను వశం చేసుకోగలిగింది. ఇక్కడ సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ కౌన్సిలర్లతోపాటు మరో నలుగురు స్వతంత్రులు కూడా టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారు. ఆయా పార్టీలు విప్ జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది.

మంచిర్యాల మున్సిపాలిటీ చైర్మన్ పదవిని టీఆర్‌ఎస్‌కు చెందిన మామిడిశెట్టి వసుంధర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు దక్కింది. ఆ పార్టీ కౌన్సిలర్ నల్ల శంకర్ కూడా ఏకగ్రీవంగా వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు అత్యధిక కౌన్సిలర్ స్థానాలు దక్కినా, ఆ పార్టీ సభ్యుల మద్దతుతో టీఆర్‌ఎస్ అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ విప్ జారీ చేసినా ఫలితం లేకుండా పోయింది.

 కాగజ్‌నగర్  మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ వశమైంది. చైర్మన్‌గా సి.పి.విద్యావతి, వైస్‌చైర్మన్‌గా సద్దాం హుస్సేన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఈ పదవుల కోసం టీఆర్‌ఎస్‌లోనే పోటాపోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అనుచరు లు, ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరులు పోటీ పడ్డా రు. ఈ విషయంలో మంత్రులు హరీష్‌రావు, జోగు రామన్న ఇరువర్గాల మధ్య స యోధ్య కుదిర్చారు. ఎట్టకేలకు సమ్మయ్య అనుచరులకే పదవులు దక్కాయి.

భైంసాలో అత్యధికంగా 12 కౌన్సిలర్ స్థానాలను గెలుపొందిన ఎంఐఎం ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ సహాయంతో చైర్మన్, వైస్‌చైర్మన్ పీఠాలను దక్కించుకుంది. చైర్మన్‌గా సబియా బేగం, వైస్ చైర్మన్‌గా ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు జాబీర్ అహ్మద్ ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement