ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో మళ్లీ గ్యాంగ్‌వార్ చోటుచేసుకుంది. రెండేళ్ల కిందట కత్తులతో దాడికి పాల్పడిన గ్యాంగ్ మళ్లీ ఘర్షణకు దిగింది. ఈ సంఘటన ఆదిలాబాద్‌లో మరోసారి గ్యాంగ్‌వార్‌ను తేటతెల్లం చేస్తుంది. సామాన్య ప్రజానికానికి ఆందోళన కలిగిస్తుంది. ఓ వ్యక్తిపై మంగళవారం దాడికి పాల్పడిన సంఘటనలో టీఆర్‌ఎస్ కౌన్సిలర్ సహా 12మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
ఆదిలాబాద్ వన్‌టౌన్ సీఐ సురేష్ కథనం ప్రకారం.. ఈ నెల 2న రాత్రి 8.40గంటల ప్రాంతంలో ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన సిల్వర్ శ్రీనివాస్ ఇంటికి టీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఉష్కం రఘుపతితో సహా పలువురు వెళ్లారు. అక్కడి నుంచి ఆయనను పట్టణ శివారు ప్రాంతంలో తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారు. బాధితుడు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 307 సెక్షన్ కింద బుధవారం కేసు నమోదు చేశారు. టీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఉష్కం రఘుపతి, వసీమ్, శివ, బబ్లు, మహేందర్, కిరణ్, ఎరవేన శివ, జి.గంగన్న, సాయి, మరో ముగ్గురుపై కేసు నమోదైంది. వీరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పాత కక్షలతోనే..
సిల్వర్ శ్రీనివాస్, రఘుపతి ఒకప్పుడు స్నేహితులు. గత కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు రావడమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. సినీ ఫక్కీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి నుంచి తీసుకెళ్లి గాయత్రి గార్డెన్ వైపు తీసుకెళ్లి దాడికి దిగినట్లు బాధితుడు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మావలలోని ఓ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి నిర్భందించినట్లు పేర్కొన్నాడు. వారి నుంచి తప్పించుకొని పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నట్లు సంఘటన జరిగిన తీరును పోలీసులకు వివరించినట్లు పేర్కొంటున్నారు.
శ్రీనివాస్‌పై దాడికి పాల్పడటం వెనుక సరైన కారణం తెలియరావడం లేదు. పాత కక్షలతోనే దాడికి దిగి ఉండవచ్చనే చర్చ సాగుతోంది. కాగా రఘుపతితోపాటు వసీమ్, పలువురు రెండేళ్ల కిందట ఓ వ్యక్తిపై భూ వివాదం విషయంలో కత్తులతో దాడి చేసిన ఘటనలో అప్పట్లో పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. వీరు కొన్ని రోజుల పాటు పరారీలో ఉండగా, తర్వాత బెయిల్ తీసుకొని పోలీసుల ముందు హాజరయ్యారు. ఆ ఘటన మరవక ముందే మరోసారి గ్యాంగ్‌వార్ పట్టణంలో సంచలనం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment