గెలుపు గుర్రాల కోసం కసరత్తు
అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన ప్రధాన పార్టీలు
ప్రత్యేక కమిటీలతో కసరత్తు
నేటి నుంచి మున్సిపాలిటీ నామినేషన్ల స్వీకరణ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
బల్దియా పోరులో నామినేషన్ల పర్వానికి సోమవారం నుంచి తెరలేవనుండటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. ఆయా పార్టీల ముఖ్యనేతలు టిక్కెట్ల కేటాయింపులకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్న స్థానిక నాయకులు పార్టీ టిక్కెట్ల కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల ఎంపిక కోసం అన్ని పార్టీలు వివిధ కమిటీలను నియమించాయి. ఈ కమిటీలు అభ్యర్థుల
ఎన్నిక విషయంలో కసరత్తు చేస్తున్నప్పటికీ, ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతల ఆశీస్సులున్న వారికే టిక్కెట్లు దక్కే అవకాశాలున్నాయి. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
{పత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఊపు మీదున్న టీఆర్‌ఎస్ పార్టీలో మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యేగాని, ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జీతోపాటు మరి కొందరు నియోజకవర్గస్థాయి నాయకులున్నారు. టిక్కెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలిస్తుందని, ఈ కమిటీలతోపాటు, ఎన్నికలు జరుగుతున్న ఆరు బల్దియాల్లో పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ఎం పికపై తుది నిర్ణయం ఉంటుందని ఆ పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు భూ మారెడ్డి పేర్కొన్నారు. ఒకటీరెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు.
తారాస్థాయిలో గ్రూపు విభేదాలున్న కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములాగే మారింది. మిగతా పార్టీలతో పోల్చితే ఇక్కడ టిక్కెట్ల గోల అధికంగా ఉంది. కౌన్సిలర్ స్థానాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో అన్ని పార్టీల మాదిరిగా కాకుండా, కాంగ్రెస్‌లో ఆయా మున్సిపాలిటీల స్థాయిలో ఒక కమిటీ, జిల్లా స్థాయిలో మరో కమిటీని నియమించారు. మున్సిపాలిటీ స్థాయి కమిటీలో ఏకాభిప్రాయం రాని అభ్యర్థుల విషయంలో జిల్లా స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని డీసీసీ అధ్యక్షుడు సి.రాంచెంద్రారెడ్డి పేర్కొన్నారు. నామినేషన్ల దాఖలు చివరి తేదీ 14 వరకు అభ్యర్థుల ప్రకటన కొనసాగే అవకాశాలుంటాయన్నారు.
బీజేపీ అన్ని మున్సిపాలిటీల్లో సమన్వయ కమిటీలను నియమించింది. నియోజకవర్గ ఇన్‌చార్జి కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీల్లో పట్టణాధ్యక్షునితో పాటు, మరో ఇద్దరు సీనియర్ నాయకులు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. పరిశీలకులుగా పక్క నియోజకవర్గానికి చెందిన ముఖ్యనాయకులను ఈ కమిటీల పర్యవేక్షకులుగా నియమించారు. బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు నాయకులు పోటీ పడుతున్నారని, మరో రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య తెలిపారు.
బల్దియా ఎన్నికల్లో టీడీపీకి చేదు అనుభవం ఎదురవుతోంది. ఈ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నాయకులు పెద్దగా ముందుకు రావడం లేదు. ఆరు మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు కూడా రాని వార్డులు పదుల సంఖ్యలో ఉన్నాయంటే పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ముఖ్య నేతలందరూ వలస వెళ్లడంతో పట్టణాల్లో ఉన్న పార్టీ కేడర్ కూడా చాలా మట్టుకు కనుమరుగైంది. దరఖాస్తులు రాని వార్డుల్లో అభ్యర్థులను వెతికి బరిలో దింపుతామని ఆ పార్టీ పశ్చిమ జిల్లా అధ్యక్షులు లోలం శ్యాంసుందర్ పేర్కొన్నారు.
జిల్లాలో ఆరు మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులన బరిలో దించేందుకు వైఎస్సార్ సీపీ జిల్లా నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు వినాయక్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి నియోజకవర్గ సమన్వయకర్త అనీల్‌కుమార్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించి, బరిలో దిగనున్న అభ్యర్థుల విషయమై నాయకులతో చర్చించారు.
ఎంఐఎం అభ్యర్థులను జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో బరిలోకి దింపాలని ఎంఐఎం భావిస్తోంది. ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చిన నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు అభ్యర్థులను ప్రకటించారు. రెండు, మూడు దరఖాస్తులు వచ్చిన వార్డుల విషయంలో అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ ఎంపిక చేస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జాబీర్‌హైమద్ తెలిపారు.