సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మున్సిపల్ ఎన్నికల పర్వంలో తుది ఘట్టానికి నేడు తెరపడనుంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పాలక మండళ్లు గురువారం కొలువు దీరనున్నాయి. ఆయా మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార టీఆర్‌ఎస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండగా, మంచిర్యాల, బెల్లంపల్లి పురపాలక సంఘాల అధ్యక్ష పదవులను కూడా కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. భైంసా మున్సిపల్ చైర్మన్ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠకు గురువారం తెరపడనుంది.
భైంసా బల్దియాలో ఎంపీ ఓటు హక్కు
చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న మున్సిపాలిటీల వివరాలను జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఎంతో ఉత్కంఠ రేపుతున్న భైంసా మున్సిపాలిటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇక్కడ అత్యధికంగా 12 కౌన్సిలర్ స్థానాలను ఎంఐఎం గెలుచుకున్నప్పటికీ, అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఈ మున్సిపాలిటీపైనా దృష్టి పెట్టింది.
ఎంఐఎం మినహా అన్ని పార్టీల కౌన్సిలర్ల మద్దతుతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం ఆదిలాబాద్ ఎంపీ ఓటును ఈ మున్సిపాలిటీలో వినియోగించుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఎంఐఎం తో ఉన్న స్నేహ సంబంధాల మేరకు ఈ చైర్మన్ పీఠాన్ని ఎంఐఎంకు దక్కేలా సహకరించే అవకాశాలు కూడా లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లా మంత్రి రామన్న ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్ణయించారు. పెద్దపల్లి ఎంపీ సుమన్ కరీంనగర్ జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓటు వేయాలని భావిస్తున్నా రు. నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ మున్సిపాలిటీలో, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప కాగజ్‌నగర్ బల్దియాలో, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మంచిర్యాల మున్సిపాలిటీలో, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఓటు హక్కును వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు వీరంతా విల్లింగ్ లెటర్లను ఎన్నికల అధికారులకు ఇచ్చారు.
కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం తర్వాతే చైర్మన్ ఎన్నికలు..
గురువారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుం ది. ఎన్నికైన కౌన్సిలర్లు ముందుగా ప్రమాణస్వీకారం చేస్తారు. తర్వాత చైర్మన్ ఎన్నిక ఉంటుంది. చైర్మన్ అభ్యర్థిని ఒక సభ్యుడు ప్రతిపాదిస్తే.. మరో సభ్యు డు బలపరచాలి. మొత్తం సభ్యుల్లో 50 శాతం సభ్యులుంటేనే కోరం ఉన్నట్లుగా భావించి సమావేశాన్ని ప్రారంభిస్తారు. లేనిపక్షంలో గంట వరకు వేచి ఉండి, చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా వేస్తారని మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి, మెప్మా ప్రాజెక్టు డెరైక్టర్ రాజేశ్వర్ ‘సాక్షి’ప్రతినిధితో పేర్కొన్నారు.
నేడే ‘పురాధీశుల’ ఎన్నిక
Published Thu, Jul 3 2014 12:52 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement