వికారాబాద్ మార్కెట్‌కు వచ్చిన టమాట
వికారాబాద్ అర్బన్: టమాటా రైతులు దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. మార్కెట్‌లో ధర అమాంతం తగ్గడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేకపోవడంతో రోడ్లపై పారబోయాల్సిన పరిస్థితి వస్తుంది. జిల్లా చుట్టుపక్కల రైతులు పండించిన టమాట అధికంగా హైదరాబాద్‌లోని పలు మార్కెట్‌లకు తరలిస్తుంటారు. ఇటీవల హైదరాబాద్ మార్కెట్‌కు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున టమాట వస్తుండటంతో స్థానికంగా దొరికే టమాట ధర పూర్తిగా తగ్గిపోయింది. డిసెంబర్, జనవరిలో కొంత ధర పలికినా ఫిబ్రవరి నుంచి పూర్తిగా ధరలు తగ్గిపోయాయి. రెండు నెలల క్రితం కిలో టమాట రూ.20 పలకగా ఇప్పుడు రూ.పదికి మూడు కిలోలు విక్రయిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో టమాట రైతు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జిల్లాలో టమాట సాగు ఇలా
జిల్లావ్యాప్తంగా 362 హెక్టార్లలో రైతులు టమాట పంటను సాగు చేశారు. వికారాబాద్, పూడూరు, నవాబుపేట, మోమిన్‌పేట వంటి మండలాల్లో అధికంగా ఈ పంట పండిస్తున్నారు. ఈ మండలాల నుంచి రోజు వేల సంఖ్యలో టమాట బాక్స్‌లు హైదరాబాద్ మార్కెట్‌కు వెళ్తాయి. అయితే ఇటీవల హైదరాబాద్ మార్కెట్‌లో తగినంత ధరలు రాకపోవడంతో చాలామంది స్థానికంగా వికారాబాద్, తాండూరు మార్కెట్‌కు టమాట తీసుకొస్తున్నారు. అక్కడ కొనుగోలుదారులు ఎక్కువగా లేకపోవడంతో టమాటకు డిమాండ్‌పడిపోయింది. దీంతో ఒక్కో టమాట బాక్స్ (25 కిలోలు) రూ.30 నుంచి రూ.50కి ధర పలుకుతోంది.
మోపెడవుతున్న ఖర్చు
టమాట పంటకు ఐదు నెలల కాల పరిమితి. నాటిన మూడు నెలల నుంచి దిగుబడివస్తుంది. ఎకరం విస్తీర్ణంలో సాగు చేయాలంటే దున్నకాలకు రూ.4 వేలు, విత్తనాల ఖరీదు రూ.2,500, ఎరువులకు రూ.3 వేలు, పురుగుల మందులు రూ.5 వేల వరకు ఖర్చు వస్తుంది. ఇక కూలీలు, టమాటను మార్కెట్‌కు తరలించేందుకు రవాణా ఖర్చులు అదనం. ఇవన్ని ఒక ఎత్తయితే టమాటను మార్కెట్‌కు చేర్చిన తరువాత ఏజెంట్ కమీషన్ పది శాతం చెల్లించాలి. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో టమాట బాక్స్ (25 కిలోలు) రూ.50 నుంచి రూ.70 పలుకుతోంది. దీంతో ఏజెంట్ ప్రతి బాక్స్‌కు రూ.5 నుంచి 7 చొప్పున తీసుకుంటున్నాడు.
నష్టాల్లో రైతులు
ప్రతిఏటా ఉన్నట్లుగానే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మంచి ధర పలుకుతుందనిరైతులు టమాట పంటకు మొగ్గు చూపారు. అత్యధికమంది రైతులు ఒకేసారి పంటను సాగుచేయడంతో ఒకేసారి పంట చేతికివచ్చింది. దీంతో మార్కెట్‌కు రోజు వందల కొద్ది బాక్సుల టమాట వస్తుంది. ఈ కారణంగా ధర పూర్తిగా పడిపోయింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. మూడు నెలల క్రితం కిలో రూ. 50 నుండి రూ.80 వరకు పలికిన టమాట ఆ తరువాత నెమ్మదిగా తగ్గుతోంది. కొన్ని రోజులుగా కిలో టమాట రూ.3 కే ఇస్తున్నారు. టమాట సాగుకు ఎకరానికి సుమారు రూ.25 వేల వరకు ఖర్చు వస్తుండడంతో ప్రస్తుత ధరల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
నష్టాలే మిగిలాయి
టమాటకు మంచి ధర వస్తుందని, కొంత ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడవచ్చుని అనుకున్నాం. అనుకున్నట్లుగానే టమాట దిగుబడి వచ్చింది. కాని గత రెండు నెలలుగా ధరలు లేక తీవ్రంగా నష్టం వస్తుంది. మార్కెట్‌కు తీసుకెళ్లిన కిరాయ్‌లు, కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో పొలంలోనే పంటను వదిలేశాం. మార్కెట్‌కు తీసుకపోతే ఒక బాక్స్ రూ. 50కే అమ్ముడు పోతుంది. ఈ ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఈ పంట స్థానంలో వేరే పంట వేసిఉంటే మంచి లాభాలు వచ్చేవి. – చంద్రయ్య, రైతు, మమదాన్‌పల్లి
Comments
Please login to add a commentAdd a comment