tomato price down
-
భారీగా పతనమైన టమాటా రేటు
సాక్షి, అన్నమయ్య: కొండెక్కి రేట్లతో సామాన్యుడ్ని నెలలపాటు ముప్పుతిప్పలు పెట్టిన టమాటా ధర.. అమాంతం పడిపోయింది. ఒకానొక టైంలో కేజీ 300 దాకా చేరుకుని చుక్కలు చూపించింది. అయితే ఊహించినట్లుగా.. ధరలు పడిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఒక్కసారిగా ధరలు నేలకు పడిపోయాయి. నిత్యావసర సరకుల్లో ఒకటైన టమాటా ధరలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర రూ. 50 లోపుకి చేరుకుంది. చాలా చోట్ల కేజీకి రూ. 15, రూ. 20 ఇలా దొరుకుతోంది కూడా. హైదరాబాద్‌లోనూ కేజీ రూ. 20 దాకా పలుకుతోంది. అయితే.. టమాట మార్కెట్ యార్డ్ మదనపల్లెలో(అన్నమయ్య జిల్లా ఏపీ) కేజీ టమాట రూ.9కి పలుకుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు. సరఫరాలో అంతరాయం కలగడం, టమాటాను ఎక్కువగా సాగుచేసే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో ఆ మధ్య అన్ని ప్రధాన నగరాల్లో టమాటాలు సెంచరీని దాటేసిన సంగతి తెలిసిందే. -
హమ్మయ్య ఈ రోజు పర్వాలేదు అనుకునేలోపే.. అయ్యో మళ్లీ
హమ్మయ్య ఈ రోజు పర్వాలేదు కాస్త రేటు వచ్చింది.. అయ్యో మళ్లీ ధర పడిపోయిందే.. ఇంకాస్త పుంజుకుంటుందేమో చూద్దాం.. అబ్బా ఈసారి మరీ తగ్గిపోయిందే.. ఇలా ఉంది టమాట రైతుల దుస్థితి. మార్కెట్లో టమాట ధరలు నిలకడగా లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. నిత్యం పడిలేస్తున్న రేట్లతో పెట్టుబడి సైతం గిట్టుబాటు కాక అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటను నష్టాలకు అమ్ముకోలేక దిగాలుపడుతున్నారు. మధ్యలో దళారులు, వ్యాపారులు మాత్రం ఇదే అవకాశంగా అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షి, పలమనేరు: టమాట సాగుకు పలమనేరు హార్టికల్చర్ డివిజన్ పెట్టింది పేరు. ఈ ప్రాంతంలోని రైతులు అధికశాతం టమాట సాగుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో టమాట ధరలు నిత్యం పడిలేస్తుండటంతో అన్నదాతలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసేందుకు రావడంలేదు. ఫలితంగా ధరలు తగ్గుముఖం పట్టాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. మే నాటికి తమిళనాడులో సీజన్ ముగుస్తుంది కాబట్టి అక్కడి వ్యాపారులు రావచ్చని, అప్పుడే ధరలు పెరిగే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మార్కెట్లకు భారీగా సరుకు జిల్లాలో పండిన టమాటతోపాటు కర్ణాటక, అనంతపురం నుంచి లోకల్ సరుకు ఎక్కువగా వస్తోంది. ఈ క్రమంలో మదనపల్లె, పలమనేరు, పుంగనూరు తదితర మార్కెట్లకు రోజుకు 200 లారీలకు పైగా టమాట చేరుతోంది. సరుకు ఎక్కువకావడంతో ధర తగ్గిపోతోంది. ఈ సీజన్లో పొరుగు జిల్లాలతోపాటు తెలంగాణ, తమిళనాడు నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారు. ఆయా ప్రాంతాల్లోనే ప్రస్తుతం టమాట సాగు పెరగడంతో వారు ఇటువైపు కన్నెత్తి చూడడంలేదు. ఎకరాకు రూ.1.20లక్షల ఖర్చు పలమనేరు డివిజన్లో టమాట సీజన్ ఏప్రిల్ నుంచి జూలై దాకా ఉంటుంది. దున్నకం, మొక్కల కొనుగోలుకు రూ.8 వేలవుతుంది. టమాట కట్టెలకు రూ.24వేలు, ఎరువులకు రూ.27వేలు, క్రిమి సంహారక మందులకు రూ.10వేలు, కూలీలకు రూ.15వేలతో కలిసి ఎకరా సాగుకు మొత్తం రూ.84వేలు ఖర్చవుతుంది. ఇక కాయల కోత కూలి, మార్కెట్ రవాణా తదితరాలకు మరో రూ.36వేలతో కలుపుకుంటే మొత్తం ఖర్చు రూ.1.20 లక్షలకు చేరుతోంది. సాగు పెరిగింది పొరుగు రాష్ట్రాల్లో టమాట సాగు పెరిగింది. వాతావరణం అనుకూలించడంతో ఈ సీజన్లో ఇక్కడ కూడా టమాట దిగుబడి బాగా వచ్చింది. ప్రస్తుతం పంటకు డిమాండ్ పడిపోయింది. బయటి వ్యాపారులు రాకపోవడంతో నష్టపోవాల్సి వస్తోంది. – రవీంద్రరెడ్డి, రైతు, పలమనేరు బయటి వ్యాపారులు వస్తేనే.. మార్కెట్లకు నాణ్యమైన సరుకు వస్తోంది. అయితే బయటి రాష్ట్రాలనుంచి వ్యాపారులు రావడం లేదు. దీంతో మన సరుకు మన అవసరాలకు పోగా మిగులుతోంది. దీంతో ధరలు తగ్గిపోయాయి. తమిళనాడులో సీజన్ ముగిస్తే ఇక్కడ రేటు పెరిగే అవకాశముంది. – టీఎస్ బుజ్జి, మండీ నిర్వాహకుడు, పలమనేరు -
ట‘మోత’ తగ్గేలా.. సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి మార్కెటింగ్ శాఖ
సాక్షి, అమరావతి: ఠారెత్తిస్తున్న టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ నేరుగా రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయాలు చేపట్టింది. అనంతపురం, చిత్తూరు మార్కెట్ యార్డుల్లో రైతుల నుంచి కిలో రూ.50–55 చొప్పున కొనుగోలు చేసి వైఎస్సార్ కడప, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రైతు బజార్ల ద్వారా రవాణా చార్జీలతో కలిపి రూ.60 చొప్పున విక్రయిస్తోంది. ఒక్కో వినియోగదారుడికి కిలో చొప్పున అందిస్తున్నారు. అవసరమైతే మిగిలిన జిల్లాల్లోనూ విక్రయాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రోజుకు ఏడు నుంచి 10 టన్నుల చొప్పున కొనుగోలు చేస్తుండగా రానున్న రోజుల్లో కనీసం వంద టన్నులు రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 61,571 హెక్టార్లలో టమాటా సాగవుతుండగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే 56,633 హెక్టార్లలో పండిస్తున్నారు. ఏటా మొత్తం 22.16 లక్షల టన్నుల దిగుబడుల్లో 20.36 లక్షల టన్నులు మూడు జిల్లాల నుంచే వస్తున్నాయి. సకాలంలో స్పందించడంతో... గత నెల రోజులుగా భారీ వర్షాలు, వరదలతో టమాటా పంటకు అపార నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం రాయలసీమ జిల్లాల్లోనే 2 వేల హెక్టార్లలో 65 వేల టన్నుల వరకు దెబ్బ తిన్నట్టు అంచనా. దీంతో తీవ్ర కొరత ఏర్పడి టమాటా ధరలు నింగినంటాయి. ఈ పరిస్థితిని గుర్తించి అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి టమాటా కొనుగోలు చేసి వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. సకాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మరో వారం రోజుల్లో టమాటా ధర కిలో రూ.30–40కి దిగి వస్తుందని అంచనా వేస్తున్నారు. మదనపల్లెలో గ్రేడ్ –1 కిలో రూ.52 మదనపల్లె: ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతితో మదనపల్లె వ్యవసాయ కమిటీ మార్కెట్లో ధరలు తగ్గాయి. రెండు రోజుల క్రితం గ్రేడ్ –1 రకం కిలో రూ.130 పలకగా గురువారం రూ.52కి దిగి వచ్చాయి. చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి పది లారీల టమాటాలు వచ్చాయి. రెండో రకం టమాటా కిలో రూ.10–30 మధ్య ధరలు నమోదయ్యాయి. ములకలచెరువులో కిలో రూ.33 మాత్రమే ములకలచెరువు (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ యార్డులోనూ టమాటా ధరలు భారీగా తగ్గాయి. మొన్నటిదాకా ఇక్కడ 30 కిలోల టమాటా బాక్సు రూ.3 వేల వరకు పలకగా గురువారం రూ.800 నుంచి రూ.1,000 వరకు విక్రయించారు. బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు టమాటాలను తరలించడంతో ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ధరలు నియంత్రించేందుకే.. ‘సీజన్ ఆరంభంలో ధరలేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వేలం పాటల్లో పాల్గొని వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేసింది. ధరల నియంత్రణకు రైతుల నుంచి నేరుగా టమాటా కొనుగోలు చేపట్టి విక్రయిస్తున్నాం’ – పి.మధుసూదనరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ, మార్కెటింగ్ శాఖ వారం రోజుల్లో అదుపులోకి.. ‘వర్షాలు, వరదల వల్ల పంటలు దెబ్బతినడం, కార్తీకమాసం కారణంగా డిమాండ్ వల్ల టమాటా ధర పెరిగింది. ప్రభుత్వ చర్యలతో రానున్న వారం రోజుల్లో ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయి’ -బి. శ్రీనివాసరావు, రైతుబజార్ల సీఈవో -
పదికి మూడు కిలోలు టమాటా
వికారాబాద్ అర్బన్: టమాటా రైతులు దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. మార్కెట్లో ధర అమాంతం తగ్గడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేకపోవడంతో రోడ్లపై పారబోయాల్సిన పరిస్థితి వస్తుంది. జిల్లా చుట్టుపక్కల రైతులు పండించిన టమాట అధికంగా హైదరాబాద్‌లోని పలు మార్కెట్లకు తరలిస్తుంటారు. ఇటీవల హైదరాబాద్ మార్కెట్‌కు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున టమాట వస్తుండటంతో స్థానికంగా దొరికే టమాట ధర పూర్తిగా తగ్గిపోయింది. డిసెంబర్, జనవరిలో కొంత ధర పలికినా ఫిబ్రవరి నుంచి పూర్తిగా ధరలు తగ్గిపోయాయి. రెండు నెలల క్రితం కిలో టమాట రూ.20 పలకగా ఇప్పుడు రూ.పదికి మూడు కిలోలు విక్రయిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో టమాట రైతు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో టమాట సాగు ఇలా జిల్లావ్యాప్తంగా 362 హెక్టార్లలో రైతులు టమాట పంటను సాగు చేశారు. వికారాబాద్, పూడూరు, నవాబుపేట, మోమిన్‌పేట వంటి మండలాల్లో అధికంగా ఈ పంట పండిస్తున్నారు. ఈ మండలాల నుంచి రోజు వేల సంఖ్యలో టమాట బాక్స్‌లు హైదరాబాద్ మార్కెట్‌కు వెళ్తాయి. అయితే ఇటీవల హైదరాబాద్ మార్కెట్లో తగినంత ధరలు రాకపోవడంతో చాలామంది స్థానికంగా వికారాబాద్, తాండూరు మార్కెట్‌కు టమాట తీసుకొస్తున్నారు. అక్కడ కొనుగోలుదారులు ఎక్కువగా లేకపోవడంతో టమాటకు డిమాండ్పడిపోయింది. దీంతో ఒక్కో టమాట బాక్స్ (25 కిలోలు) రూ.30 నుంచి రూ.50కి ధర పలుకుతోంది. మోపెడవుతున్న ఖర్చు టమాట పంటకు ఐదు నెలల కాల పరిమితి. నాటిన మూడు నెలల నుంచి దిగుబడివస్తుంది. ఎకరం విస్తీర్ణంలో సాగు చేయాలంటే దున్నకాలకు రూ.4 వేలు, విత్తనాల ఖరీదు రూ.2,500, ఎరువులకు రూ.3 వేలు, పురుగుల మందులు రూ.5 వేల వరకు ఖర్చు వస్తుంది. ఇక కూలీలు, టమాటను మార్కెట్‌కు తరలించేందుకు రవాణా ఖర్చులు అదనం. ఇవన్ని ఒక ఎత్తయితే టమాటను మార్కెట్‌కు చేర్చిన తరువాత ఏజెంట్ కమీషన్ పది శాతం చెల్లించాలి. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో టమాట బాక్స్ (25 కిలోలు) రూ.50 నుంచి రూ.70 పలుకుతోంది. దీంతో ఏజెంట్ ప్రతి బాక్స్‌కు రూ.5 నుంచి 7 చొప్పున తీసుకుంటున్నాడు. నష్టాల్లో రైతులు ప్రతిఏటా ఉన్నట్లుగానే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మంచి ధర పలుకుతుందనిరైతులు టమాట పంటకు మొగ్గు చూపారు. అత్యధికమంది రైతులు ఒకేసారి పంటను సాగుచేయడంతో ఒకేసారి పంట చేతికివచ్చింది. దీంతో మార్కెట్‌కు రోజు వందల కొద్ది బాక్సుల టమాట వస్తుంది. ఈ కారణంగా ధర పూర్తిగా పడిపోయింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడి కూడా రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. మూడు నెలల క్రితం కిలో రూ. 50 నుండి రూ.80 వరకు పలికిన టమాట ఆ తరువాత నెమ్మదిగా తగ్గుతోంది. కొన్ని రోజులుగా కిలో టమాట రూ.3 కే ఇస్తున్నారు. టమాట సాగుకు ఎకరానికి సుమారు రూ.25 వేల వరకు ఖర్చు వస్తుండడంతో ప్రస్తుత ధరల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నష్టాలే మిగిలాయి టమాటకు మంచి ధర వస్తుందని, కొంత ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడవచ్చుని అనుకున్నాం. అనుకున్నట్లుగానే టమాట దిగుబడి వచ్చింది. కాని గత రెండు నెలలుగా ధరలు లేక తీవ్రంగా నష్టం వస్తుంది. మార్కెట్‌కు తీసుకెళ్లిన కిరాయ్లు, కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో పొలంలోనే పంటను వదిలేశాం. మార్కెట్‌కు తీసుకపోతే ఒక బాక్స్ రూ. 50కే అమ్ముడు పోతుంది. ఈ ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఈ పంట స్థానంలో వేరే పంట వేసిఉంటే మంచి లాభాలు వచ్చేవి. – చంద్రయ్య, రైతు, మమదాన్పల్లి -
టమాట రైతు కుదేలు
పత్తికొండ అర్బన్, న్యూస్‌లైన్: టమాట ధర ఒక్కసారిగా పతనమైంది. సీజన్ ప్రారంభంలో జత గంపలు రూ.1500వరకు అమ్ముడుపోయాయి. ఇర వై రోజుల నుంచి ధరలు తగ్గాయి. సోమవారం 30 కిలోల జత గంపలు రూ.35 నుంచి రూ.40 మధ్యనే ధర పలికాయి. ఈ ప్రకారం కిలో నలవై నుంచి 50పైసలు మాత్రమే. ఈ సారి బోర్లు ఉన్న రైతులంతా ఎక్కువగా టమాట సాగు చేపట్టారు. ఒకేసారిగా దిగుబడులు రావడంతో మార్కెట్ రేటు పతనానికి కారణమైంది. ఇక్కడి సరుకు ఖమ్మం, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేది. అయితే నెల రోజుల కిందట నుంచి ఆప్రాంతాల్లోనూ టమాట మార్కెట్‌కు రావడంతో ఒక్కసారిగా ధరలు కుప్పకూలిపోయాయి. సీజన్ ప్రారంభంలో ఒక ఎకరా టమాట సాగుచేసిన రైతు లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం ఎకరా సాగుచేసిన టమాట రైతుకు రూ. 20వేల నుంచి రూ.25వేల వరకు అప్పులు మిగులుతున్నాయి. కనీసం రవాణా చార్జీలు కూడా రావడంలేదని రైతులు పేర్కొంటున్నారు. పత్తికొండలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మండల పరిధిలోని చక్రాళ్ల, చందోలి, రాతన, హోసూరు, పుచ్చకాయలమాడ, పందికోన, దూదేకొండ, చిన్నహుల్తి, పెద్దహుల్తి తదితర గ్రామాల నుంచి టమాటాలను ఎద్దులబండ్లు, ఆటోల ద్వారా తీసుకొస్తారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు కూడా దిగుబడులను ఎగుమతి చేస్తారు. అయితే ప్రస్తుతం కష్టపడి సాగుచేసిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలేక రైతులు పంటపొలాల్లోనే వదిలేస్తుండగా మార్కెట్‌కు తీసుకొచ్చిన వారు నిరాశతో పారబోస్తున్నారు. కలగా మిగిలిన జ్యూస్ ఫ్యాక్టరీ: జిల్లాలో టమాట జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు కలగానే మిగిలింది. ఎన్నిక ల సమయంలో జ్యూస్‌ఫ్యాక్టరీని ఏర్పాటుచేస్తామని హామీలు ఇచ్చిన నేతలు గెలిచిన తర్వాత దాన్ని అమలు చేయడం మాత్రం మరిచారు. పత్తికొండతో పాటు ఆస్పరి, దేవనకొండ, మద్దికెర, తుగ్గలి మండలాల్లోనూ ప్రధానంగా టమాటనే నమ్ముకున్న రైతులు అధిక శాతం ఉన్నారు. జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తే టమాటకు కనీసం గిట్టుబాటు ధర లభించడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక మంది యువకులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. మూడేళ్ల కిందట ఇక్కడ పండే టమాట నాటురకం కావడంతో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కుదరదన్న నేతలు చేప్పడంతో రైతులు హైబ్రీడ్ రకం సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పత్తికొండ నుంచి రోజూ 20 లారీల సరుకు, మద్దికెర నుంచి 5 లారీలు, తుగ్గలి ప్రాంతం నుంచి 5లారీలు సరుకు మనరాష్ట్రంలోని కరీంనగర్, హైదరాబాదు, మంచిర్యాల, ఖమ్మం, వరంగల్, మహారాష్ర్ట, కర్ణాటక, తమిళనాడు లోని ముఖ్యపట్టణాలకు తరలిస్తారు. ఇప్పటికైనా జ్యూస్‌ఫ్యాక్టరీ ఏర్పాటుపై నాయకులు దృష్టిసారించాలని టమాట రైతులు కోరుతున్నారు.