పలమనేరు మండలం కన్నమాకులపల్లె్ల వద్ద తోటలోనే వదిలేసిన టమాటా
హమ్మయ్య ఈ రోజు పర్వాలేదు కాస్త రేటు వచ్చింది.. అయ్యో మళ్లీ ధర పడిపోయిందే.. ఇంకాస్త పుంజుకుంటుందేమో చూద్దాం.. అబ్బా ఈసారి మరీ తగ్గిపోయిందే.. ఇలా ఉంది టమాట రైతుల దుస్థితి. మార్కెట్‌లో టమాట ధరలు నిలకడగా లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. నిత్యం పడిలేస్తున్న రేట్లతో పెట్టుబడి సైతం గిట్టుబాటు కాక అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటను నష్టాలకు అమ్ముకోలేక దిగాలుపడుతున్నారు. మధ్యలో దళారులు, వ్యాపారులు మాత్రం ఇదే అవకాశంగా అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు.
సాక్షి, పలమనేరు: టమాట సాగుకు పలమనేరు హార్టికల్చర్ డివిజన్ పెట్టింది పేరు. ఈ ప్రాంతంలోని రైతులు అధికశాతం టమాట సాగుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో టమాట ధరలు నిత్యం పడిలేస్తుండటంతో అన్నదాతలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసేందుకు రావడంలేదు. ఫలితంగా ధరలు తగ్గుముఖం పట్టాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. మే నాటికి తమిళనాడులో సీజన్ ముగుస్తుంది కాబట్టి అక్కడి వ్యాపారులు రావచ్చని, అప్పుడే ధరలు పెరిగే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన మార్కెట్లకు భారీగా సరుకు
జిల్లాలో పండిన టమాటతోపాటు కర్ణాటక, అనంతపురం నుంచి లోకల్ సరుకు ఎక్కువగా వస్తోంది. ఈ క్రమంలో మదనపల్లె, పలమనేరు, పుంగనూరు తదితర మార్కెట్లకు రోజుకు 200 లారీలకు పైగా టమాట చేరుతోంది. సరుకు ఎక్కువకావడంతో ధర తగ్గిపోతోంది. ఈ సీజన్‌లో పొరుగు జిల్లాలతోపాటు తెలంగాణ, తమిళనాడు నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారు. ఆయా ప్రాంతాల్లోనే ప్రస్తుతం టమాట సాగు పెరగడంతో వారు ఇటువైపు కన్నెత్తి చూడడంలేదు.
ఎకరాకు రూ.1.20లక్షల ఖర్చు
పలమనేరు డివిజన్‌లో టమాట సీజన్ ఏప్రిల్ నుంచి జూలై దాకా ఉంటుంది. దున్నకం, మొక్కల కొనుగోలుకు రూ.8 వేలవుతుంది. టమాట కట్టెలకు రూ.24వేలు, ఎరువులకు రూ.27వేలు, క్రిమి సంహారక మందులకు రూ.10వేలు, కూలీలకు రూ.15వేలతో కలిసి ఎకరా సాగుకు మొత్తం రూ.84వేలు ఖర్చవుతుంది. ఇక కాయల కోత కూలి, మార్కెట్ రవాణా తదితరాలకు మరో రూ.36వేలతో కలుపుకుంటే మొత్తం ఖర్చు రూ.1.20 లక్షలకు చేరుతోంది.
సాగు పెరిగింది
పొరుగు రాష్ట్రాల్లో టమాట సాగు పెరిగింది. వాతావరణం అనుకూలించడంతో ఈ సీజన్‌లో ఇక్కడ కూడా టమాట దిగుబడి బాగా వచ్చింది. ప్రస్తుతం పంటకు డిమాండ్ పడిపోయింది. బయటి వ్యాపారులు రాకపోవడంతో నష్టపోవాల్సి వస్తోంది.
– రవీంద్రరెడ్డి, రైతు, పలమనేరు
బయటి వ్యాపారులు వస్తేనే..
మార్కెట్లకు నాణ్యమైన సరుకు వస్తోంది. అయితే బయటి రాష్ట్రాలనుంచి వ్యాపారులు రావడం లేదు. దీంతో మన సరుకు మన అవసరాలకు పోగా మిగులుతోంది. దీంతో ధరలు తగ్గిపోయాయి. తమిళనాడులో సీజన్ ముగిస్తే ఇక్కడ రేటు పెరిగే అవకాశముంది.
– టీఎస్ బుజ్జి, మండీ నిర్వాహకుడు, పలమనేరు
Comments
Please login to add a commentAdd a comment