పత్తికొండ అర్బన్, న్యూస్‌లైన్:
టమాట ధర ఒక్కసారిగా పతనమైంది. సీజన్ ప్రారంభంలో జత గంపలు రూ.1500వరకు అమ్ముడుపోయాయి. ఇర వై రోజుల నుంచి ధరలు తగ్గాయి. సోమవారం 30 కిలోల జత గంపలు రూ.35 నుంచి రూ.40 మధ్యనే ధర పలికాయి. ఈ ప్రకారం కిలో నలవై నుంచి 50పైసలు మాత్రమే. ఈ సారి బోర్లు ఉన్న రైతులంతా ఎక్కువగా టమాట సాగు చేపట్టారు. ఒకేసారిగా దిగుబడులు రావడంతో మార్కెట్ రేటు పతనానికి కారణమైంది. ఇక్కడి సరుకు ఖమ్మం, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేది. అయితే నెల రోజుల కిందట నుంచి ఆప్రాంతాల్లోనూ టమాట మార్కెట్‌కు రావడంతో ఒక్కసారిగా ధరలు కుప్పకూలిపోయాయి. సీజన్ ప్రారంభంలో ఒక ఎకరా టమాట సాగుచేసిన రైతు లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం ఎకరా సాగుచేసిన టమాట రైతుకు రూ. 20వేల నుంచి రూ.25వేల వరకు అప్పులు మిగులుతున్నాయి. కనీసం రవాణా చార్జీలు కూడా రావడంలేదని రైతులు పేర్కొంటున్నారు. పత్తికొండలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మండల పరిధిలోని చక్రాళ్ల, చందోలి, రాతన, హోసూరు, పుచ్చకాయలమాడ, పందికోన, దూదేకొండ, చిన్నహుల్తి, పెద్దహుల్తి తదితర గ్రామాల నుంచి టమాటాలను ఎద్దులబండ్లు, ఆటోల ద్వారా తీసుకొస్తారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు కూడా దిగుబడులను ఎగుమతి చేస్తారు. అయితే ప్రస్తుతం కష్టపడి సాగుచేసిన పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలేక రైతులు పంటపొలాల్లోనే వదిలేస్తుండగా మార్కెట్‌కు తీసుకొచ్చిన వారు నిరాశతో పారబోస్తున్నారు.
కలగా మిగిలిన జ్యూస్ ఫ్యాక్టరీ:
జిల్లాలో టమాట జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు కలగానే మిగిలింది. ఎన్నిక ల సమయంలో జ్యూస్‌ఫ్యాక్టరీని ఏర్పాటుచేస్తామని హామీలు ఇచ్చిన నేతలు గెలిచిన తర్వాత దాన్ని అమలు చేయడం మాత్రం మరిచారు. పత్తికొండతో పాటు ఆస్పరి, దేవనకొండ, మద్దికెర, తుగ్గలి మండలాల్లోనూ ప్రధానంగా టమాటనే నమ్ముకున్న రైతులు అధిక శాతం ఉన్నారు. జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తే టమాటకు కనీసం గిట్టుబాటు ధర లభించడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక మంది యువకులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. మూడేళ్ల కిందట ఇక్కడ పండే టమాట నాటురకం కావడంతో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కుదరదన్న నేతలు చేప్పడంతో రైతులు హైబ్రీడ్ రకం సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పత్తికొండ నుంచి రోజూ 20 లారీల సరుకు, మద్దికెర నుంచి 5 లారీలు, తుగ్గలి ప్రాంతం నుంచి 5లారీలు సరుకు మనరాష్ట్రంలోని కరీంనగర్, హైదరాబాదు, మంచిర్యాల, ఖమ్మం, వరంగల్, మహారాష్ర్ట, కర్ణాటక, తమిళనాడు లోని ముఖ్యపట్టణాలకు తరలిస్తారు. ఇప్పటికైనా జ్యూస్‌ఫ్యాక్టరీ ఏర్పాటుపై నాయకులు దృష్టిసారించాలని టమాట రైతులు కోరుతున్నారు.
టమాట రైతు కుదేలు
Published Tue, Jan 7 2014 4:55 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement