రేపటి ఉదయం కోసం.. | tomorrow is Telangana formation day | Sakshi
Sakshi News home page

రేపటి ఉదయం కోసం..

Published Sun, Jun 1 2014 1:36 AM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM

రేపటి ఉదయం కోసం.. - Sakshi

రేపటి ఉదయం కోసం..

నేటి అర్ధరాత్రి నుంచే తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు
 
 నాలుగు కోట్ల గుండెలు ఈ రాత్రి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందాని నిరీక్షిస్తున్నాయి. జయజయహే తెలంగాణ... జననీజయకేతన గీతాన్ని ఆలపిస్తూ రేపటి సూర్యుడి రాకకు స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నాయి. అర్ధరాత్రి నుంచే సంబురాలకు సిద్ధమైన తెలంగాణ సమాజం.. ఊరూవాడా ధూంధాం జరుపుకొంటూ తమ ఆకాంక్ష ఎంత ప్రగాఢమైందో, కోరిక సిద్ధించిన తమ సంబుర మెంత అపురూపమైందో ప్రపంచానికి ఈ వేడుకల రూపంలో చాటడానికి సమాయత్తమైంది.
 
 సాక్షి, హైదరాబాద్: భౌగోళికంగా తెలంగాణ విడిపోతోంది. తెలంగాణ పాలనకు అనువుగా అధికారిక భవనాలను పంచేశారు. సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ సహా రాష్ట్రస్థాయి కార్యాలయాలన్నీ విడిపోయాయి. ఫైళ్లు పంచేసుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ సహా అధికారులు, ఉద్యోగుల విభజన ప్రకటనను జారీ చేశారు. కీలక ప్రభుత్వ సంస్థలు, ఆస్తులు, అప్పులు ఎవరికేమిటో, ఎవరికెంతో తేల్చేశారు. సీమాంధ్ర అధికారులు, ఉద్యోగులు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో శనివారమే విందు వేడుకలతో ఆత్మీయ వీడ్కోలు తీసుకున్నారు. కొత్త సీఎం పాలన సారథ్య బృందమూ ఖరారైంది. సోమవారమే కొత్త ప్రభుత్వం కొలువు తీరటానికి రంగం సిద్ధమైంది. రాజధానితోపాటు అన్ని జిల్లాల్లోనూ కొత్త రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగానే జరపటానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాజకీయ పార్టీలు, టీ ఉద్యమ సంఘాలు సహా అన్ని వర్గాలూ ఘనంగా ఆవిర్భావ వేడుకలకు పిలుపునిచ్చాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లోనూ అధికారిక వేడుకల నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. టిక్.. టిక్.. టిక్.. గెట్ రెడీ.. ఆకాశాన్నంటే  ఆనందోత్సవానికి అంతా సిద్ధం! ఒక్కముక్కలో చెప్పాలంటే... ఇది తెలంగాణ బొడ్రాయి వేడుక!!
 
 నేటి అర్ధరాత్రి నుంచే సంబురాలు షురూ
 
 సోమవారం నాటి తెలంగాణ ఆవిర్భావ (అపాయింటెడ్ డే) దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రమంతటా సంబురాలు అంబరాన్ని అంటనున్నాయి. అర్ధరాత్రి 12 గంటలకు రాజధానితోపాటు అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో భారీ ఎత్తున ఉత్సవాలు జరపాలని ఇప్పటికే టీఆర్‌ఎస్ నిర్ణయించింది. తెలంగాణ జేఏసీతో పాటు వివిధ వర్గాల ఐక్య కార్యాచరణ సంఘాలన్నీ 60 ఏళ్ల కల నెరవేరిన సందర్భంగా ఎక్కడికక్కడ తెలంగాణ ధూంధాం, పటాకుల పండుగ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. గన్‌పార్క్ వద్ద ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ‘ఆట-మాట-పాట’ పేరుతో ఉత్సవాలు జరుపుతోంది. రాత్రి 12 గంటలకు పటాకులతో తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం చెపుతూ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ టీఎన్‌జీవోలు కూడా ఆదివారం నుంచి గన్‌పార్క్ వద్ద జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని అధ్యక్షుడు దేవిప్రసాద్ తెలిపారు. ఇక హైదరాబాద్‌లో గుర్తించిన 120 సెంటర్లలో అర్ధరాత్రి పటాకుల (బాణాసంచా) పండుగ నిర్వహించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న టీఆర్‌ఎస్... హైదరాబాద్ నగరాన్ని గులాబీమయం చేసింది. టీఆర్‌ఎస్ శ్రేణులు, ఇతర తెలంగాణవాదులకు తోడుగా జీహెచ్‌ఎంసీ కూడా ఉత్సవాలను భుజానికెత్తుకుంది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టింది. ఐలాండ్‌లు, పార్కులతో పాటు అసెంబ్లీ, సచివాలయం, గన్‌పార్కు, పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, ఇతర చారిత్రాత్మక కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తోంది. ఇక ఆవిర్భావ దినోత్సవం రోజు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని 67 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్యారడైజ్ బిర్యానీ, చాట్‌బండారు పాయింట్లను ఏర్పాటు చేసింది.  రోడ్లు, ఐలాండ్‌లు ఇప్పటికే టీఆర్‌ఎస్ జెం డాలు, కటౌట్‌లతో నిండిపోయాయి. 50 నుంచి 60 అడుగుల ఎత్తున్న కేసీఆర్ కటౌట్‌లు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలి చాయి. వెయ్యికి పైగా హోర్డింగ్‌లను 100 సెంటర్లలో టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసింది.
 
 వారం రోజుల ఉత్సవాలు: రాజధానితో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వారం రోజుల పాటు అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందగా, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అనధికారికంగా బతుకమ్మ ఉత్సవాలతో పాటు వివిధ సాంస్కృతిక రూపాల్లో సంబురాలు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను తెలియజేసే ప్రదర్శనలు, ఒగ్గుకథ, బుర్రకథ వంటి జానపద కళలను ప్రదర్శించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు శుక్ర, శనివారాల్లో ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులతోతో సమావేశమై ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు. ఉత్సవాల నిర్వహణ బాధ్యతలను ఆయా శాఖల అధికారులకు అప్పగించారు. వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరపాలని కలెక్టర్లు అధికార యంత్రాంగానికి ఆదేశించారు. జిల్లాల్లోని ప్రభుత్వ భవనాలను, చారిత్రక కట్టడాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఉదయం 8.45 గంటలకు జిల్లాల్లోని పరేడ్ గ్రౌండ్స్ లేదా కలెక్టర్ కార్యాలయాల వద్ద కలెక ్టర్లు జాతీయ పతాకాన్ని ఎగరేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. వారం రోజుల పాటు వివిధ రూపాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆవిర్భావ దినోత్సవం రోజే మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలంగాణ అమరవీరుల తల్లిదండ్రులకు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, నల్గొండ కలెక్టర్ చిరంజీవులు జిల్లాలోని ప్రముఖులను సత్కరించే కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని కవులు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధులు, సాహస బాలురు, ఇతర ప్రముఖులను సన్మానించాలంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదేశాలు జారీచేశారు. ఖమ్మం జిల్లాలో సైతం ఇదేరీతిన ప్రభుత్వ పరంగా ప్రముఖులకు సన్మానం జరగనుంది. కొత్త రాష్ట్రంలో ఖమ్మం జిల్లా పురోగమిస్తుందని ఆ జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆశాభావంతో ఉన్నారు. వారం రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు నిజామాబాద్ కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు.
 
 ముస్తాబైన రాజ్‌భవన్
 
 తెలంగాణ ఆవిర్భావ  దినోత్సవం రోజే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కేసీఆర్, ఆయన మంత్రి వర్గ సహచరులు, అతిథుల కోసం రాజ్‌భవన్ సిద్ధమైంది. రాజ్‌భవన్ లాన్‌లో ప్రమాణ స్వీకార వేదికను, అతిథులు కూర్చునేందుకు సీట్లను ఏర్పాటు చేశారు. తెల్లటి షామియానా కింద ఈ వేడుక సాగనుంది. అనంతరం సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిర్వహించే సభకు పరేడ్‌గ్రౌండ్స్ కూడా సిద్ధమైంది. లక్షలాదిగా తరలివచ్చే ప్రజానీకం కోసం ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. టీఆర్‌ఎస్ పార్టీ పరంగా కమిటీలు ఏర్పాటు చేసి నాయకులకు బాధ్యతలు అప్పగించింది. లక్షలాదిగా తరలివచ్చే ప్రజానీకాన్ని ఉద్దేశించి కేసీఆర్ తన ప్రాధమ్యాలను ఈ సభలో తెలియజేయనున్నారు.
 
 రాత్రంతా సంబురాలే
 
 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం సాయంత్రం దాకా సంబురాలను నిర్వహించాలని తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది. రాత్రి 8 నుంచి 12 దాకా ‘ఆటా పాటా మాట’లతో ధూంధాంలను నిర్వహించాలని జేఏసీ సమన్వయకర్త పిట్టల రవీందర్ కోరారు. రాత్రి 12 తర్వాత జేఏసీ జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి జాతీయ జెండాలను, తెలంగాణ జెండాలను ఆవిష్కరించాలన్నారు. ఆ తర్వాత ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలని, అమరవీరుల స్థూపాలు, చిత్రపటాల దగ్గర కొవ్వొత్తులతో నివాళులు అర్పించాలని సూచించారు.
 
 తెలంగాణ ధూంధాం ఆధ్వర్యంలో..
 
 తెలంగాణ ధూంధాం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో రాత్రి 11.59 దాకా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టుగా కన్వీనర్ రసమయి బాలకిషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత సినీ, ఇతర కళాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
 
 అన్ని పార్టీలదీ ఉత్సవ బాటే
 
 తెలంగాణ కోసం మలిదశ ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తిచేసి 60 ఏళ్ల కలను సాకారం చేసిన టీఆర్‌ఎస్‌తో పాటు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కూడా ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. టీడీపీ తెలంగాణ శాఖ నాయకులు కూడా ఉత్సవాల్లో భాగం కావాలని నిర్ణయించారు. బీజేపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, ప్రజా, కార్మిక సంఘాలతో పాటు ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన సీపీఎం కూడా ఉత్సవాల్లో పాల్గొనాలని నిర్ణయించడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement