బోసి నవ్వుల కోసం | Top Four Cities Looking Towards IVF Treatment In India | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 4 2018 7:03 AM | Last Updated on Sat, Aug 4 2018 7:03 AM

Top Four Cities Looking Towards IVF Treatment In India - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచపు తొలి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ లెస్లీ బ్రౌన్‌ పుట్టి (జులై 25,1978) 40 ఏళ్లు నిండింది. ఓవైపు నగరంలో ఐవీఎఫ్‌(ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌)విధానంలో జననాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోవైపు నగరవాసుల్లో పెరుగుతున్న సంతాన హీనతకు కారణాల్లో మారుతున్న జీవనశైలి ప్రధానమైనదని వైద్యులు చెబుతున్నారు. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, అనారోగ్యకరమైన అలవాట్లు, రేడియేషన్‌ ప్రభావం, హార్మోన్లలో హెచ్చుతగ్గులు... వీటన్నింటి మూలంగా ఏర్పడుతున్న సంతానలోపం అధిగమించడానికి అత్యాధునిక వైద్య విధానాలు మాత్రమే మార్గం.
 
మెట్రోల్లోనే ఎక్కువ...

దేశంలో ఏటా లక్ష వరకు ఐవీఎఫ్‌ చికిత్సలు నమోదవుతున్నాయి. వీటిలో అత్యధికంగా మెట్రో నగరాల్లోనే జరుగుతున్నాయి. దేశంలో జరిగే మొత్తం చికిత్సల్లో హైదరాబాద్‌ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లోనే 55 శాతానికి పైగా ఐవీఎఫ్‌ చికిత్సలు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ముంబై ఈ విషయంలో మరింత ముందంజలో ఉన్నాయి.
 
నాలుగో స్థానంలో సిటీ...
ఒక సర్వే ప్రకారం దక్షిణాదిలో 37 శాతం ఐవీఎఫ్‌ చికిత్సలు నమోదవుతుంటే... 90 మంది వైద్యులు,  60 ఐవీఎఫ్‌ సెంటర్లతో ఏడాదికి 11వేలకు పైగా చికిత్సలు చేస్తూ ఢిల్లీ ఈ విషయంలో ప్రథమ స్థానంలో ఉంది. అలాగే 100 మంది డాక్టర్లు, 70 సెంటర్లతో ఏడాదికి 10వేల చికిత్సలు నమోదు చేస్తూ ముంబై రెండో స్థానంలో ఉంది. ఇక 30 మంది డాక్టర్లు, 25 సెంటర్లతో ఏడాదికి 7వేల ఐవీఎఫ్‌లు చేస్తూ చెన్నై మూడో స్థానంలో నిలిచింది. మన నగరం 26 మంది వైద్యులు, 18 సెంటర్లతో ఏడాదికి 6వేల చికిత్సలతో నాలుగో స్థానం దక్కించుకుంది. బెంగళూర్‌ 30 మంది డాక్టర్లు, 20 సెంటర్లతో ఏడాదికి 4,200 కేసులు నమోదు చేస్తూ ఐదో స్థానంలో, 8వేల చికిత్సలతో అహ్మదాబాద్‌ ఆరో స్థానంలో,  7వేలకు పైగా చికిత్సలతో కోల్‌కతా ఏడో స్థానంలో,  4వేల చికిత్సలతో పుణె ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.  

వ్యయం తక్కువే అయినా...
అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర ఐవీఎఫ్‌ చికిత్సకు అవుతున్న వ్యయం (రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షలు) తక్కువే అయినప్పటికీ అవసరార్థుల్లో 80 శాతం మందికి ఇది అందుబాటులో లేదు. ఒక్క ఎంప్లాయీ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ తప్ప మరే బీమా సంస్థ కూడా దీనికి అవసరమైన వ్యయాన్ని కవర్‌ చేసే సదుపాయం కల్పించడం లేదు. అలాగే మిగతా నగరాలతో పోలిస్తే తగినంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఐవీఎఫ్‌ చికిత్స అందించే నిపుణుల కొరత కూడా నగరంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దేశంగా... ఈ ఐవీఎఫ్‌ విధానంపై యువతలో అవగాహన మరింత పెరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.  

ఐవీఎఫ్‌ ఉత్తమం
గతంతో పోలిస్తే దంపతులు ఐవీఎఫ్‌ విధానం వైపు మొగ్గు చూపుతుండడంతో దీనికి ఆదరణ బాగా పెరిగింది. అయినప్పటికీ మన దగ్గర కృత్రిమ గర్భధారణపై అపోహలు, సంశయాలు మాత్రం ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. వీటిలో సామాజికపరమైనవే ఎక్కువ. అత్యాధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నా, 22–33 మిలియన్ల భారతీయ దంపతులు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారని ఒక నివేదిక తేల్చడం దీనికో ఉదాహరణ.
– డాక్టర్‌ స్వాతి మోతె, గైనకాలజిస్ట్, ఐవీఎఫ్‌ స్పెషలిస్ట్‌ (ఇందిరా ఐవీఎఫ్‌)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement