Test Tube Baby
-
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రార్థన
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ (ఐవీఎఫ్) అయిన 23 ఏళ్ల ప్రార్థన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. శనివారం అజంతా హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె తన చిన్నారితో పాల్గొన్నారు. ఐవీఎఫ్ పద్ధతిలో 1998లో ప్రార్థన అజంతా ఆస్పత్రిలోనే టెస్ట్ ట్యూబ్ బేబీగా జన్మించింది. ఈ కార్యక్రమంలో ప్రార్థన మాట్లాడుతూ.. ఐవీఎఫ్ సంబంధించి ఆస్పత్రి నిర్వహించే కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ప్రతిసారి చాలా సంతోషంగా ఉంటుందని తెలిపారు. డాక్టర్ గీతా కన్నాతో ప్రార్థన సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని ప్రార్థన పేర్కొన్నారు. స్కూల్లో చదువుతున్న సమయంలో తాను ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ అని తన తల్లిదండ్రులు చెప్పినట్లు తెలిపారు. తన తల్లిదండ్రులు సాధారణ పిల్లల మాదిరిగా తనను ఎలాంటి అంతరాలు చూపకుండా పెంచారని చెప్పారు. తన తల్లిదండ్రులు చాలా ఉత్నతమైన ఆలోచనలు కలవారని పేర్కొన్నారు. వారు ఎప్పడూ డాక్టర్ గీతా కన్నాతో టచ్‌లో ఉంటారని చెప్పారు. ప్రార్థన ఐవీఎఫ్ ద్వారా మాల్తీ అనే మహిళకు జన్మించింది. తాను టెస్ట్ ట్యూబ్ బేబీగా సురక్షితంగా జన్మించడంలో ఎలాంటి సమస్య రాకుండా కృషి చేసిన డాక్టర్ గీతా కన్నా బృందానికి ప్రార్థన కృతజ్ఞతలు తెలిపారు. -
సరోగసీ...
సంతానం కోసం పరితపించే జంట ఇక అన్ని విధాలా ప్రయత్నించాక చివరి ఆశగా ప్రయత్నించే ప్రక్రియ ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ అన్న విషయం తెలిసిందే. కానీ టెస్ట్‌ట్యూబ్ పద్ధతి ద్వారా 100 శాతం ఫలితాలు ఉండకపోవచ్చు. అయితే ఈ ప్రక్రియను దాదాపుగా 3 – 6 సార్లు ప్రయత్నించాక కూడా కొందరిలో ఫలితం ఉండకపోవచ్చు. పిండం నాణ్యంగా లేకపోవడం, గర్భాశయంలో లేదా ఎండోమెట్రియమ్ పొరలో బయటకు తెలియని లోపాలు, సూక్ష్మమైన సమస్యలు ఉన్నా గర్భం రాకపోవచ్చు. అలాంటప్పుడు, రెండుమూడు సార్లు ఐవీఎఫ్ పద్ధతిలోనూ గర్భం రానప్పుడు అవసరాన్ని బట్టి దాత నుంచి స్వీకరించిన అండాలను లేదా శుక్రకణాలను లేదా పిండాన్ని, దంపతుల అంగీకారం మీద, వాడుకొని ప్రయత్నించవచ్చు. కొందరు దంపతులకు ఇలా దాత నుంచి తీసుకోవడం ఇష్టం ఉండకపోవచ్చు. దాంతో గర్భాన్ని సొంత తల్లి మోసే అవకాశం లేనప్పుడు, ఆమె బదులుగా మరో తల్లిలో ఆ పిండాన్ని పెరగనిచ్చి, కననిచ్చి, బిడ్డ పుట్టాక సొంత తల్లికి అప్పగించే ప్రక్రియనే ‘సరోగíసీ’ అంటారు. అయితే ఇక్కడ ఈ ప్రక్రియలో సరోగేట్ తల్లి కేవలం బిడ్డను మోయడం మాత్రమే చేస్తుంది. మిగతా అండం, శుక్రకణం, అవి కలవడం వల్ల ఏర్పడిన పిండం... ఇవన్నీ సొంత తల్లిదండ్రులకు చెందినవే కావడం వల్ల ఈ ప్రక్రియ వైపునకు చాలామంది బిడ్డలు లేనివారు మొగ్గుచూపారు. ఇదీ చరిత్ర... మన భారతదేశంలో మొట్టమొదటి సరోగేట్ బిడ్డ 1994లో పుట్టింది. ఇక 2002లో మొదటిసారి సరోగసీకి చట్టబద్ధత ఏర్పడింది. దాంతో టెస్ట్‌ట్యూబ్ ప్రక్రియ ద్వారా కూడా బిడ్డలు కలగని ఎందరో దంపతులు ఈ ప్రక్రియను ఆశ్రయించారు. ఫలితంగా 2002 నుంచి 2015 వరకు భారత్ సరోగసీకి కేంద్రమైంది. మన దగ్గర ఈ ప్రక్రియకు రూ. 10 లక్షల నుంచి 15 లక్షలు ఖర్చు పెట్టగలిగితే చాలు... బిడ్డను తీసుకుపోవచ్చు. కానీ అదే విదేశాలలోనైతే ఇదే ప్రక్రియకు 75,000 డాలర్ల నుంచి 85,000 డాలర్లు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. (అంటే మన కరెన్సీలో దాదాపు 53 లక్షల రూపాయల నుంచి 56 లక్షల రూపాయల వరకు). దాంతో విదేశాలతో పోలిస్తే ఇక్కడ సరొగసీ చవక కావడంతో అక్కడి నుంచి మన దేశానికి విదేశీయులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ‘వాణిజ్యపరమైన సరోగసీ పద్ధతి’ పెద్ద ఎత్తున సాగింది. ఐక్యరాజ్యసమితి 2012లో వేసిన ఒక అంచనా ప్రకారం, భారతదేశంలో సరోగసీ ద్వారా ఏడాదికి 400 మిలియన్ డాలర్ల (2,845 కోట్ల రూపాయల) వాణిజ్యం జరిగినట్లు అంచనా వేసింది. దాదాపు 3,000 సంతానోత్పత్తి కేంద్రాలలో 25,000 మంది పిల్లలు జన్మించినట్లు కూడా అంచనా. దీంతో పాటు మరికొన్ని సమస్యలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2015లో విదేశీ దంపతులకు భారత్‌లో సరోగసీని నిషేధించింది. అంతేకాదు... 2018 డిసెంబర్లో మరికొన్ని మార్పులతో ‘సరోగసీ (రెగ్యులేషన్) బిల్ 2016 పేరిట ఒక కొత్త చట్టాన్ని లోక్‌సభలో ఆమోదించింది. దాని ప్రకారం ఈ కింది నిబంధనలతో కొత్త చట్టంలో ఈ కింది సవరణలు ఉన్నాయి. సరోగసీకి ఎవరు అర్హులు భారతీయ పౌరులు మాత్రమే. మహిళ వయసు 23– 50 ఏళ్లు ఉండాలి. పురుషుడి వయసు 26 – 55 ఏళ్లు ఉండాలి. వివాహం జరిగి కనీసం ఐదేళ్లు నిండాలి. దంపతులిద్దరికీ దత్తత ద్వారాగానీ, సరోగసీ ద్వారాగానీ, సొంత పిల్లలుగానీ ఉండకూడదు. సరోగసీ తల్లిగా గర్భాన్ని ఇవ్వడానికి ఎవరు అర్హులు? దగ్గరి బంధువు వివాహితులు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు వారికి పిల్లలు కలిగి ఉండాలి. ఎన్నారై లేదా విదేశీయులు అయి ఉండకూడదు. జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఈ ప్రక్రియను అనుసరించడానికి అర్హులు. స్వచ్ఛందంగా మాత్రమే ఇది జరగాలి. పారితోషికం తీసుకోకూడదు. అనుమతి లేనిదెవరికి? ∙విదేశీయులకు ∙ఎన్నారైలకు ∙స్వలింగసంపర్కులకు ∙ఒంటరి తల్లిదండ్రులు ∙విడాకులు పొందిన వితంతువు అవివాహిత ∙ఇప్పటికే పిల్లలున్న జంటలు అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందా? జమ్మూ, కశ్మీర్‌కు తప్ప అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుంది. ఉల్లంఘనకు పాల్పడితే... జరిమానాగా పది లక్షల రూపాయల నగదుతో పాటు పదేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష. చివరగా... ఇదీ స్థూలంగా కొత్తచట్టంలోని నిబంధనలు. అయితే దీనిపై చాలా చర్చ జరుగుతోంది. అమ్మదనాన్ని అందరూ కోరుకుంటారు. కావాలని ఎవరూ సరోగసీ చేయించుకోరు. అయితే కొందరు గర్భం మోయడానికి భయపడేవారు, అంతకాలం గర్భం మోయడానికి సమయం కేటాయించలేనివాళ్లూ సరోగసీ వైపునకు వెళ్తే వెళ్లవచ్చు. కానీ అలాంటివారి సంఖ్య చాలా తక్కువ. అలాంటి సమయంలో ఈ కొత్త చట్టంలోని కొన్ని నిబంధనలు నిజంగా అవసరమైన వారికి కూడా మేలు చేయవంటూ వైద్యవర్గాల్లో ఒక చర్చ మొదలైంది. ఉదాహరణకు పారితోషికం తీసుకొని సరోగసీకి సిద్ధం కావడంపై నిషేధం ఉంది. అలాంటప్పుడు అది రహస్యంగా జరిగే అవకాశాలు లేకపోలేదు. అలాగే కేవలం బంధువులు మాత్రమే అర్హులంటే... ఈ ప్రక్రియకు ఇష్టపడని బంధువర్గాన్ని బలవంతంగా ఒప్పించే అవకాశాలూ ఉంటాయి కదా. ఇక భారతదేశంలోని ఏ రాష్ట్రానికీ లేని సౌలభ్యం జమ్మూకశ్మీర్‌కు ఉంది. అలాంటప్పుడు ఇక్కడి జంటలు అక్కడికి వెళ్లడానికి, అక్కడా అలాంటి అక్రమాలకు అవకాశం ఉండదా అనే ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఇలాంటి ప్రశ్నలు, లొసుగులు ఉన్నందున వైద్యవర్గాల్లోనూ, ఈ ప్రక్రియ ద్వారానే సంతానం కలిగే అవకాశమున్నవారిలోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది. మాతృత్వం మహిళలందరూ అనుభవించాలనుకునే అమూల్య భావన. సరోగసీ అనే వసతి ఉందనే ఉద్దేశంతో దాన్నే అందరూ కోరుకోరూ, ఎవరూ అలా వాడుకోరు. అందువల్ల నిబంధనలన్నవి ఎల్లవేళలా అవసరమైన వారికి అందుబాటులో ఉండేలా ఉండాలే తప్ప... ప్రతికూలమూ, ప్రతిబంధకమూ కాకూడదన్నదే వైద్యవర్గాల భావన. డాక్టర్ నర్మద కటకం ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, మెడికల్ డైరెక్టర్, జెనెసిస్ ఫెర్టిలిటీ – లాపరోస్కోపిక్ సెంటర్, కొత్తపేట, హైదరాబాద్ -
అద్దాల గర్భం
సంతానం కోసం తొలుత సహజంగా ప్రయత్నిస్తారు. కుదరకపోతే ఇంట్రాయుటెరైన్ ఇన్సెమినేషన్(ఐయూఐ)ని ఆశ్రయిస్తారు. అదీ జరగకపోతే చివరి ప్రయత్నంగా ఐవీఎఫ్ చేస్తారు. అదే... టెస్ట్‌ట్యూబ్ బేబీ! ఆ బేబీ కోసం ఓ పరీక్ష నాళికలో అద్దాల్లోంచి చూస్తూ ఫలదీకరణం చేస్తారు. టెస్ట్‌ట్యూబ్ అద్దంలోంచి కనిపించే ఆ పిండం అద్దమంత సున్నితమైంది. అద్దంలా భద్రంగా చూసుకోవలసినది. అద్దంలో చందమామను చూపుతూ రామభద్రుడికి బువ్వ తినిపించారని ప్రతీతి. అద్దంలోని చందమామలాంటి బిడ్డను తీసి దంపతులకు ఇవ్వడమంత సంక్లిష్టయత్నం ‘ఐవీఎఫ్’! ఆ ప్రక్రియపై అవగాహన కోసమే ఈ కథనం. గతవారం సంతానం లేని మహిళలకు చేయించాల్సిన అనేక చికిత్సలతో పాటు సంతానసాఫల్య చికిత్సలో భాగంగా చేసే కొన్ని ప్రక్రియల గురించి తెలుసుకున్నాం. అయితే వాటన్నింటికీ తలమానికం లాంటిదీ, చివరి ఆశగా ప్రయత్నించేదీ అయిన ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ విధానం గురించి ఈ వారం తెలుసుకుందాం. సాధారణంగా మహిళలో ఒక అండం, పురుషుడి శుక్రకణంతో కలిసి, ఫలదీకరణం జరిగితే, అప్పుడది పిండంగా మారి గర్భాశయంలోకి చేరి (ఇంప్లాంటేషన్ జరిగి), అప్పుడు శిశువుగా మారి, గర్భంలో పెరుగుతుంటుంది. ఈ ప్రక్రియలో ఎక్కడైనా లోపాలుండి, గర్భం కోసం మందుల ద్వారా ప్రయత్నించినా, భర్త వీర్యాన్ని చిన్న కంటెయినర్లో సేకరించి, స్పెర్మ్ వాషింగ్ మీడియాలో దాన్ని శుభ్రపరచి, ఆరోగ్యకరమైన వీర్యకణాలను వేరుపరచి, అండం విడుదలయ్యే రోజుల్లో గర్భాశయంలోపలికి పంపే ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) అనే ప్రక్రియ కూడా విఫలమయ్యాక... చివరి ఆశగా ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) అని పిలిచే ప్రక్రియను ప్రయత్నిస్తారు. దీన్నే జనసామాన్య (పాపులర్) పరిభాషలో ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ ప్రక్రియ అంటారు. ఐవీఎఫ్ ప్రక్రియలో ఏం చేస్తారు? 1 అండాశయాలను ఉత్తేజపరచడం (ఒవేరియన్ స్టిమ్యులేషన్): ఇందులో భాగంగా అండాశయాల నుంచి ఎక్కువ అండాలు (10 – 20... ఆపైన) తయారుకావడం కోసం హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఈ సమయంలో మహిళలకు క్రమంగా వెజైనల్ స్కానింగ్ ద్వారా అండాలను పర్యవేక్షిస్తూ, హార్మోన్ పరీక్షలు చేస్తూ, అండాల సంఖ్య, సైజు నిర్ణీతస్థాయికి వచ్చేవరకు వేచి చూడాల్సి ఉంటుంది. 2 అండాలను తీయడం (ఎగ్/ఊసైట్ రిట్రైవల్) : అండాలు తగిన సైజుకు పెరిగాక, వాటిని స్కానింగ్ ద్వారా చూస్తూ మహిళకు నొప్పి తెలియకుండా మందులు ఇచ్చి, యోని భాగం నుంచి సన్నటి, పొడవాటి సూది ద్వారా ఇరువైపుల ఉన్న అండాశయాల నుంచి అండాలను బయటకు తీస్తారు. 3 ఫలదీకరణ : బయటకు తీసిన అండాలను మైక్రోస్కోప్‌లో పరీక్షిస్తూ, మంచి అండాలను వేరుపరచి, వాటిని శుభ్రపరచి వేరుపరచిన శుక్రకణాలతో న్యూట్రిషన్ మీడియా కలిగిన చిన్న డిష్‌లో కలపడం జరుగుతుంది. కొన్ని గంటల తర్వాత శుక్రకణం, అండంతో కలిసి ఫలదీకరణ జరుగుతుంది. ఇది అనేక కణాలుగా విభజితమవుతూ, పిండంగా మారుతుంది. ఇంతకుమునుపు మనం బయటకు తీసిన అండాలన్నీ ఫలదీకరణ చెందకపోవచ్చు. వాటిలో కొన్ని మాత్రమే పిండంగా ఏర్పడతాయి. ఐసీఎస్ఐ (ఇక్సీ) : అండాలను, శుక్రకణాలతో కలిపినా, కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వల్ల శుక్రకణాలు వాటంతట అవే అండంలోకి ప్రవేశించకపోవచ్చు. అలాంటప్పుడు శుక్రకణాన్ని సన్నటి సూది ద్వారా అండంలోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు. దీన్నే ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఇక్సీ) అంటారు. 4 పిండ విభజన (ఎంబ్రియో కల్చర్) : ఫలదీకరణ జరిగిన అండాలను, న్యూట్రిషన్ మీడియా కలిగిన డిష్‌లో పెట్టి, ఇంక్యుబేటర్‌లో 3 – 5 రోజుల పాటు ఉంచుతారు. వీటిలో కణాలు విభజన చెందుతూ తయారైన పిండాన్ని 3 నుంచి 5 రోజులలోపు బయటకు తీసి, వాటి నాణ్యతను మైక్రోస్కోప్‌లో చూస్తారు. 5 పిండాన్ని గర్భాశయంలోకి పంపడం (ఎంబ్రియో ట్రాన్స్ఫర్): అలా ఇంక్యుబేటర్‌లో కాస్తంత పెరిగిన పిండాలలోని మంచి పిండాలను వేరుపరచి, వాటిలో 2, 3 పిండాలను సన్నటి కాన్యులా ద్వారా యోనిభాగం నుంచి నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. మిగిలిన పిండాలను ఫ్రీజ్ చెస్తారు. 6 ఇంప్లాంటేషన్ : ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా గర్భాశయంలోకి పంపించిన పిండాలను, గర్భాశయంలోని పొరలోకి అంటుకుపోయి, పెరగడం మొదలవుతాయి. కానీ ఇది అందరిలోనూ జరగకపోవచ్చు. ఈ ప్రక్రియ సజావుగా జరడానికి, గర్భాశయపొర సరిగా ఉండాలి. దానికి రక్తప్రసరణ, హార్మోన్లతో పాటు ఇంకా తెలియని అనేక రసాయన అంశాలు సక్రమంగా ఉండాలి. అప్పుడు మాత్రమే గర్భాశయం పిండాన్ని స్వీకరిస్తుంది. అలా స్వీకరిస్తేనే గర్భం నిలుస్తుంది. అయితే ఇలా అందరిలోనూ పిండం ఎందుకు అతుక్కోదో ఇంకా చాలావరకు కారణాలు తెలియరాలేదు. ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందువల్లే, చివరి ఆశ అయిన ‘టెస్ట్‌ట్యూబ్’ పద్ధతిలోనూ గర్భం దాల్చే అవకాశాలు 40 – 50 శాతం వరకు మాత్రమే ఉంటాయి. ల్యూటియల్ ఫేజ్ సపోర్ట్ ∙పిండం గర్భాశయపొరలోకి అంటుకుపోయేలా చేసే ‘ఇంప్లాంటేషన్’ విజయవంతం అయ్యేందుకు (సక్సెస్ రేటు పెంచడానికి) అనేక రకాల మందులను, మాత్రల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో, జెల్స్ రూపంలో ఇవ్వాలి. ఏదో ఒకటి పనిచేయకపోతుందా అనే ఆశతో ఇవన్నీ చేస్తారు. ∙అలాగే కొందరిలో పిండం పై పొరకీ చిన్న చిల్లు పెట్టడం (అసిస్టెడ్ హ్యాచింగ్) వంటి రకరకాల ప్రక్రియలతో ప్రయత్నం చేస్తారు. ∙ఇలా అన్ని విధాలా ప్రయత్నించినా కూడా టెస్ట్‌ట్యూబ్ పద్ధతి ద్వారా 100 శాతం విజయం సాధించగలమని ఎవరికీ హామీ ఇవ్వరు. ఎందుకంటే ఎవరిలో, ఎందుకు గర్భాశయం పిండాన్ని తీసుకోదో స్పష్టంగా తెలియదు కాబట్టి. ∙‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ పద్ధతి ఒకరిలో ఒకసారి ఫలించకపోతే, కొన్ని నెలలు ఆగి, మళ్లీ ప్రయత్నించవచ్చు. ఇలా 3 – 6 సార్ల వరకు ప్రయత్నించవచ్చు. ఒకోసారి సఫలం కాకపోతే, మళ్లీ ఒకసారి దంపతులకు చేయించిన పరీక్షలన్నీ తిరిగి చూసుకుంటూ, కారణాలను సమీక్షించుకుంటూ, ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అంటూ విశ్లేషించుకుంటూ, వేరే అవసరమైన పరీక్షలు ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా చేయించి, చికిత్సల్లో కొద్దిపాటి మార్పులు చేస్తూ, మళ్లీ టెస్ట్ట్యూబ్బేబీ పద్ధతిని ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరిలో పిండం నాణ్యత సరిగా లేకపోయినా, గర్భాశయంలో లేదా ఎండోమెట్రియమ్ పొరలో కొన్ని బయటకు తెలియని, కనిపించని సూక్ష్మమైన సమస్యలు ఉన్నా గర్భం రాకపోవచ్చు. అలాంటప్పుడు, రెండుమూడు సార్లు ఐవీఎఫ్ పద్ధతిలోనూ గర్భం రానప్పుడు అవసరాన్ని బట్టి దాత నుంచి స్వీకరించిన అండాలనూ లేదా శుక్రకణాలను లేదా పిండాన్ని, దంపతుల అంగీకారం మీద, వాడుకొని ప్రయత్నించవచ్చు. అప్పటికీ కుదరకపోతే అప్పుడు సరోగసీ పద్ధతిని ప్రయత్నించవచ్చు. ఎంబ్రియో ఫ్రీజింగ్ : ఐవీఎఫ్ ప్రక్రియలో భాగంగా ఫలదీకరించక ఏర్పడిన పిండాల సంఖ్యను బట్టి, ఒకసారి ఒకటి లేదా రెండు పిండాలను గర్భాశయంలోకి పంపి, మిగతా పిండాలను విట్రిఫికేషన్ అనే పద్ధతి ద్వారా ఫ్రీజ్ చేసి భద్రపరుస్తారు. ఇలా భద్రపరచడాన్ని క్రయోప్రిజర్వేషన్ అంటారు. ఐవీఎఫ్ ప్రక్రియ మొదటిసారి సఫలం కానప్పుడు, అలా భద్రపరచిన పిండాలను తీసుకొని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. లేదా ఇంకొకసారి గర్భం దాల్చాలని కోరుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. లేదా ఎవరికైనా అవసరమైన దంపతులకు దానం చేయవచ్చు. పరిశోధనలకు ఇవ్వవచ్చు. లేదా వాటిని నిర్జీవపరచమని కోరవచ్చు. ∙ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ (ఎఫ్ఈటీ) : కొంతమందిలో ఐవీఎఫ్ చేశాక పిండాలు ఏర్పడిన 3వ రోజు నుంచి 5వ రోజు లోపల, వాటిని గర్భాశయంలోకి పంపుతారు. ఆ నెలలో గర్భం నిలబడకపోతే, ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోను ఆ మరుసటి నెలలో పంపుతారు. దీనికంటే ముందు గర్భాశయపొర (ఎండోమెట్రియమ్) పొర బాగా ఏర్పడటానికి మందులు ఇచ్చి, స్కానింగ్‌లో ప్రక్రియనంతా పర్యవేక్షిస్తూ, గర్భాశయంలోకి పంçపుతారు. కొంతమందిలో ఐవీఎఫ్ చేసిన నెలలో, హార్మోన్స్ సరిగా లేకపోయినా, గర్భాశయపొర సరిగా ఏర్పడకపోయినా, పిండాలను ఫ్రీజ్ చేసి, ఆ తర్వాతి నెలలో గర్భాశయంలోపలికి పంపడం అంటే.... ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడమాంటారు. ఐవీఎఫ్ వల్ల దుష్ఫలితాలు ∙ఇందులో వాడే మందుల వల్ల కొందరిలో, ఒక్కోసారి వారి శరీర తత్వాన్నిబట్టి తలనొప్పి, వికారం, చిరాకు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ∙అండాలను బయటకు తీసేటప్పుడు కొందరిలో బ్లీడింగ్ కనిపించవచ్చు. కొందరిలో పేగులకు, మూత్రాశయానికి, రక్తనాళాలకూ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అవి కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉండవచ్చు. ∙మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ : ఐవీఎఫ్‌లో కొందరిలో ఒక్కోసారి కవల పిల్లలు, ముగ్గురు పిల్లలు (ట్రిప్లెట్స్) కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల నెలలు నిండకుండానే కాన్పులు అవ్వడం, పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉండటం వంటివి కనిపిస్తాయి. ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ : కొందరిలో ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి మరీ ఎక్కువ అండాలు తయారై, వాటి విడుదలకు వాడే హెచ్‌సీజీ ఇంజెక్షన్ వల్ల అండాశయాలు బాగా వాయడం, కడుపులోకి నీరు రావడం, కడుపులో నొప్పి, వాంతులు కావడం జరగవచ్చు. మరికొందరిలో కడుపు ఉబ్బడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరి తీవ్రమైన ఆయాసం, రక్తం గూడుకట్టడం, నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకం అయ్యే అవకాశాలూ ఉంటాయి. ∙ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ : కొందరిలో ఐవీఎఫ్ ప్రక్రియలో భాగంగా గర్భాశయంలోకి పంపించిన పిండం కొద్దిగా వెనక్కు వెళ్లి, ట్యూబ్‌లో అంటుకుని, అక్కడ గర్భం మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. ∙గర్భస్రావాలు (అబార్షన్సు) : మామూలుగా గర్భం దాల్చినవాళ్లలోలాగే ఇలా ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినవాళ్లలో కూడా ఏ సమయంలోనైనా గర్భస్రావం కావచ్చు. వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, పిండం నాణ్యత బాగా లేకపోవడం వంటి సందర్భాల్లో అబార్షన్లు అయ్యే అవకాశాలు కొద్దిగా ఎక్కువ. ∙అవయవలోపాలు : సాధారణంగా పుట్టే అందరు పిల్లల్లోనూ ఎలాగైతే 2 – 3 శాతం వరకు అవయవలోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయో, అలాగే ఈ పిల్లల్లోనూ అవయవలోపాలు వచ్చే అవకాశాలు అంతే ఉంటాయి. కాకపోతే తల్లివయసు ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లల్లో అవయవ లోపాలు వచ్చే అవకాశాలు మరింతగా పెరుగుతాయి. (అయితే కేవలం ఐవీఎఫ్ ప్రక్రియ వల్ల ఈ లోపాలు వచ్చాయని భావించేందుకు అవకాశం లేదు). ∙ఒవేరియన్ క్యాన్సర్ : దీర్ఘకాలంపాటు అండాలు తయారు కావడానికి వాడే మందుల వల్ల, 100 మందిలో ఒకరికి అరుదుగా ఎప్పటికో అండాశయాల క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ అని ఒక అంచనా. ∙మానసిక ఒత్తిడి : ఐవీఎఫ్ ప్రక్రియ కాస్త ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ కాబట్టి ఇందుకోసం డబ్బు ఖర్చు పెట్టాలి. ఎక్కువ సమయమూ వెచ్చించాలి. ఇంత చేశాక కూడా ఇది గ్యారంటీ లేని చికిత్స కాబట్టి ఈ అన్ని కారణాలతో కాబోయే దంపతుల్లో... ముఖ్యంగా తల్లికావాలని కోరుకుంటున్న మహిళకు ఆందోళన, టెన్షన్, కుంగుబాటు వంటివి కలిగే అవకాశాలుంటాయి. ఐవీఎఫ్ విజయావకాశాలు (సక్సెస్ రేటు) ఇది మహిళ వయసు మీద ఆధారపడి ఉంటుంది. 40 ఏళ్లు దాటాక వయసు పెరిగే కొద్దీ సక్సెస్ రేటు తక్కువగా ఉంటుంది. అండాల నాణ్యత, పిండం నాణ్యత తక్కువగా ఉంటే సక్సెస్ రేటు ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. అలాగే గర్భాశయంలో సమస్యలు, అడినోమయోసిస్, ఎండోమెట్రియాసిస్ వంటి సమస్యల తీవ్రత పెరుగుతున్న కొద్దీ విజయావకాశాలూ అదే రీతిలో తగ్గుతుంటాయి. ఇక జీవనశైలి (లైఫ్‌స్టైల్)పై కూడా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు పొగతాగేవారు, ఆల్కహాల్ తీసుకునే అలవాటున్నవారు, అధిక బరువు ఉన్నవారిలో అండాల సంఖ్య, నాణ్యత తక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా సక్సెస్‌రేటు తగ్గుతుంది. ఐవీఎఫ్ ఎవరికి ∙సాధారణ చికిత్స, ఐయూఐ చికిత్సలతో గర్భం రాకుండా, వేరే ఇతర సమస్యలేవీ లేకుండా (అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ) ఉండి, ఇంకా వేచిచూసే ఓపిక లేనివాళ్లకి. ∙వయసు 38 – 40 ఏళ్లు దాటిన వారికి; ఇంకా 35 ఏళ్లు దాటి, వారి అండాల సంఖ్య, నాణ్యత బాగా తగ్గిపోయి, సాధారణ చికిత్సతో గర్భం రాకపోతే. ∙రెండు ట్యూబ్‌లూ మూసుకుపోయిన వాళ్లకి, ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత, మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు; పురుషుల్లో వాసెక్టమీ చేయించుకున్న తర్వాత మళ్లీ ఏదైనా కారణాల వల్ల పిల్లలను కోరుకుని అందుకోసం ‘రీకెనలైజేషన్’ ఆపరేషన్ చేయించుకున్నా అది సక్సెస్ కానప్పుడు. ∙సాధారణ చికిత్సతో అండాలు సరిగా తయారు కానప్పుడు. ∙ఎండోమెట్రియాసిస్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు. ∙వీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత బాగా తక్కువగా ఉన్నప్పుడు. ∙జన్యుపరమైన సమస్యలు ఉన్నప్పుడు : భార్య లేదా భర్తలో ఏవైనా జన్యుపరమైన సమస్య ఉండి, అది పిల్లలకూ వచ్చే అవకాశం ఉన్నప్పుడు, ఐవీఎఫ్ ప్రక్రియను పాటించి, తయారైన పిండాలనుంచి ఒక దాన్ని తీసి, ప్రీ–ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నసిస్ (పీజీడీ) ద్వారా పరీక్ష చేసి, జన్యు సమస్య లేని పిండాలను వేరుపరచి, తల్లి గర్భాశయంలోకి పంపిస్తారు. ∙దాత అండాలను వాడాల్సి వచ్చినప్పుడు ∙క్యాన్సర్ చికిత్స : శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ నిర్ధారణ అయి, రేడియేషన్, కీమోథెరపీ చికిత్సకు వెళ్లేముందు, అండాలను బయటకు తీసి, వాటిని ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదా అండాలను ఫలదీకరణ చేసుకొని, పిండాలను ఫ్రీజ్ చేసి, చికిత్స పూర్తయ్యాక వాటిని ‘ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్’ పద్ధతిలో గర్భాశయంలోకి పంపవచ్చు. ∙సామాజిక కారణాలు (సోషల్ రీజన్స్) : కొందరు కెరియర్ కోసం లేదా వ్యక్తిగత కారణాల వల్ల గర్భధారణను వాయిదా వేస్తారు. వాళ్లలో కొందరు ముందుగానే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా తయారైన పిండాలను భద్రపరచుకుని, ఆ తర్వాత వీలైనప్పుడు ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా గర్భశయంలోకి ప్రవేశపెట్టుకుని, గర్భం ధరిస్తారు. ఇక మరికొందరు పెళ్లిని వాయిదా వేసుకుని, అండాలను ఫ్రీజ్ చేసుకుంటారు. ఫ్రీజ్ చేసిన అండాలు, పిండాలను ఆ తర్వాత ఉపయోగించుకుంటారు. అయితే బయట కాబోయే తల్లి వయసు పెరిగినప్పటికీ అండం, లేదా పిండానికి మాత్రం అది సేకరించిన నాటి వయసే ఉంటుంది. డా‘‘ వేనాటి శోభ, సీనియర్ గైనకాలజిస్ట్ బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్ -
‘కౌరవ’ వ్యాఖ్యలతో సంబంధం లేదు
న్యూఢిల్లీ: కౌరవులందరూ టెస్ట్‌ట్యూబ్ బేబీలని ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ జి.నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు శాస్త్రీయంగా ఆమోదయోగ్యం కావని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె విజయ్ రాఘవన్ తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో అంశాలను, వక్తలను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్(ఐఎస్‌సీఏ) వక్తల ప్రసంగాలను వడపోత చేయలేదన్నారు. ఓసారి వక్తను ఎంపిక చేసుకున్నాక, వాళ్లు మాట్లాడే అంశంపై ఎలాంటి తనిఖీలు, వడపోతలు జరగవని తేల్చిచెప్పారు. ‘శాస్త్రవేత్తలు ఏదైనా పిచ్చిమాటలు మాట్లాడినప్పుడు ఆ వర్గం నుంచి నిరసనలు ఎదుర్కొంటారు. ఓ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి వీసీగా ఉండీ నాగేశ్వరరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’ అని రాఘవన్ వ్యాఖ్యానించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్న నాగేశ్వరరావు కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలనీ, డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం కంటే దశావతారం మరింత అర్థవంతంగా ఉందనీ, రావణుడికి 24 విమానాలు, విమానాశ్రయాలు ఉన్నాయని సెలవిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతమున్న గైడెడ్ మిస్సైల్ టెక్నాలజీని శ్రీరాముడు, విష్ణువు వాడారన్నారు. -
బోసి నవ్వుల కోసం
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచపు తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లెస్లీ బ్రౌన్ పుట్టి (జులై 25,1978) 40 ఏళ్లు నిండింది. ఓవైపు నగరంలో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)విధానంలో జననాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోవైపు నగరవాసుల్లో పెరుగుతున్న సంతాన హీనతకు కారణాల్లో మారుతున్న జీవనశైలి ప్రధానమైనదని వైద్యులు చెబుతున్నారు. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, అనారోగ్యకరమైన అలవాట్లు, రేడియేషన్ ప్రభావం, హార్మోన్లలో హెచ్చుతగ్గులు... వీటన్నింటి మూలంగా ఏర్పడుతున్న సంతానలోపం అధిగమించడానికి అత్యాధునిక వైద్య విధానాలు మాత్రమే మార్గం. మెట్రోల్లోనే ఎక్కువ... దేశంలో ఏటా లక్ష వరకు ఐవీఎఫ్ చికిత్సలు నమోదవుతున్నాయి. వీటిలో అత్యధికంగా మెట్రో నగరాల్లోనే జరుగుతున్నాయి. దేశంలో జరిగే మొత్తం చికిత్సల్లో హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లోనే 55 శాతానికి పైగా ఐవీఎఫ్ చికిత్సలు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ముంబై ఈ విషయంలో మరింత ముందంజలో ఉన్నాయి. నాలుగో స్థానంలో సిటీ... ఒక సర్వే ప్రకారం దక్షిణాదిలో 37 శాతం ఐవీఎఫ్ చికిత్సలు నమోదవుతుంటే... 90 మంది వైద్యులు, 60 ఐవీఎఫ్ సెంటర్లతో ఏడాదికి 11వేలకు పైగా చికిత్సలు చేస్తూ ఢిల్లీ ఈ విషయంలో ప్రథమ స్థానంలో ఉంది. అలాగే 100 మంది డాక్టర్లు, 70 సెంటర్లతో ఏడాదికి 10వేల చికిత్సలు నమోదు చేస్తూ ముంబై రెండో స్థానంలో ఉంది. ఇక 30 మంది డాక్టర్లు, 25 సెంటర్లతో ఏడాదికి 7వేల ఐవీఎఫ్‌లు చేస్తూ చెన్నై మూడో స్థానంలో నిలిచింది. మన నగరం 26 మంది వైద్యులు, 18 సెంటర్లతో ఏడాదికి 6వేల చికిత్సలతో నాలుగో స్థానం దక్కించుకుంది. బెంగళూర్ 30 మంది డాక్టర్లు, 20 సెంటర్లతో ఏడాదికి 4,200 కేసులు నమోదు చేస్తూ ఐదో స్థానంలో, 8వేల చికిత్సలతో అహ్మదాబాద్ ఆరో స్థానంలో, 7వేలకు పైగా చికిత్సలతో కోల్‌కతా ఏడో స్థానంలో, 4వేల చికిత్సలతో పుణె ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. వ్యయం తక్కువే అయినా... అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర ఐవీఎఫ్ చికిత్సకు అవుతున్న వ్యయం (రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షలు) తక్కువే అయినప్పటికీ అవసరార్థుల్లో 80 శాతం మందికి ఇది అందుబాటులో లేదు. ఒక్క ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తప్ప మరే బీమా సంస్థ కూడా దీనికి అవసరమైన వ్యయాన్ని కవర్ చేసే సదుపాయం కల్పించడం లేదు. అలాగే మిగతా నగరాలతో పోలిస్తే తగినంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఐవీఎఫ్ చికిత్స అందించే నిపుణుల కొరత కూడా నగరంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దేశంగా... ఈ ఐవీఎఫ్ విధానంపై యువతలో అవగాహన మరింత పెరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఐవీఎఫ్ ఉత్తమం గతంతో పోలిస్తే దంపతులు ఐవీఎఫ్ విధానం వైపు మొగ్గు చూపుతుండడంతో దీనికి ఆదరణ బాగా పెరిగింది. అయినప్పటికీ మన దగ్గర కృత్రిమ గర్భధారణపై అపోహలు, సంశయాలు మాత్రం ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. వీటిలో సామాజికపరమైనవే ఎక్కువ. అత్యాధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నా, 22–33 మిలియన్ల భారతీయ దంపతులు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారని ఒక నివేదిక తేల్చడం దీనికో ఉదాహరణ. – డాక్టర్ స్వాతి మోతె, గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ (ఇందిరా ఐవీఎఫ్) -
సీతాదేవి ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ
లక్నో/అహ్మదాబాద్/న్యూఢిల్లీ: రామాయణంలోని సీతాదేవి కృత్రిమ పద్ధతుల్లో జన్మించిన బిడ్డ (టెస్ట్ ట్యూబ్ బేబీ) అని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, దినేశ్ శర్మ (బీజేపీ) వ్యాఖ్యానించారు. నోటిని అదుపులో పెట్టుకోవాలని దినేశ్‌ను బీజేపీ వర్గాలు హెచ్చరించాయి. గురువారం రాత్రి ఓ సభలో ఆయన మాట్లాడుతూ ‘లంక నుంచి రాముడు పుష్పక విమానంలో తిరిగొచ్చాడని మనకందరికీ తెలుసు. రామాయణ కాలంలోనే విమానాలు ఉన్నాయని దీని ద్వారా నిరూపితమవుతోంది. సీతాదేవి తల్లి గర్భం నుంచి జన్మించలేదు. జనకుడు పొలం దున్నుతుండగా భూమిలో ఓ పాత్ర నుంచి సీతాదేవి ఉద్భవించింది. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం ఆ రోజుల్లో ఉంది’ అని దినేశ్ అన్నారు. నీచ రాజకీయాల కోసం సీతాదేవిని బాధితురాలిగా మార్చొద్దని బీజేపీని కాంగ్రెస్ కోరింది. సీతను ఎత్తుకెళ్లింది రాముడే! సీతను శ్రీరాముడు ఎత్తుకెళ్లాడట..! గుజరాత్ పాఠ్యపుస్తకంలో ఇది ప్రచురితమైంది. ఈ తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన విద్యాశాఖ సిబ్బంది సరిదిద్దుకునే పనిలో పడ్డారు. కాళిదాసు రచించిన ‘రఘువంశం’లోని ఓ ఘట్టం 12వ తరగతిలో పాఠ్యాంశంగా ఉంది. గుజరాతీలో సరిగ్గానే ఉన్నప్పటికీ ఇంగ్లిష్ మీడియం పుస్తకాల్లో మాత్రం.. ‘సీతను రాముడు ఎత్తుకుపోయిన ఆ ఘటనను లక్ష్మణుడు రాముడికి వర్ణించి చెప్పిన తీరు హృదయానికి హత్తుకునేలా ఉంటుంది..’అని ఉంది. ఈ తప్పు ఇంగ్లిష్‌లోకి అనువాద సమయంలో జరిగింది. -
‘టెస్ట్ ట్యూబ్ బేబీకి ఉదాహరణ సీత’
లక్నో : రామయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీల ఎరా మొదలైందంటూ ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీతమ్మవారు మట్టికుండలో జన్మించారని పెద్దలు అంటుంటారని దీన్ని బట్టి టెస్ట్ ట్యూబ్ బేబీల ఎరా రామాయణ కాలం నుంచి ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. మహాభారత కాలం నాటి నుంచే పాత్రికేయం ఉన్నదని గురువారం శర్మ వ్యాఖ్యానించిన విషయం తెలిసందే. హిందీ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమానికి హాజరైన శర్మ నూతన ఆవిష్కరణలను పురాతన భారత్‌తో పోల్చుతూ లైవ్ టెలికాస్ట్ మహాభారత కాలంలో ఉందని పేర్కొన్నారు. ‘గూగుల్ ఇప్పుడు మొదలైంది. మన గూగుల్ ఎప్పుడో మొదలైంది. నారద మహర్షి సమాచార చేరవేతకు ఓ ఉదాహరణ.’ అని శర్మ వ్యాఖ్యానించారు. -
చరిత్రకెక్కిన ఓ అమ్మ కథ
‘‘టెస్ట్‌ట్యూబ్ బే బీలలో ప్రపంచ స్థాయిలో నాది మూడో స్థానం కావడం, ఇప్పుడు ఆడ బిడ్డకు జన్మనిచ్చిన తొలి టెస్ట్‌ట్యూబ్ తల్లిగా రికార్డులకెక్కడం అనిర్వచనీయ అనుభూతి. వైద్యరంగంలో చోటుచేసుకున్న ఒక అద్భుతంలో నేను భాగస్వామినన్న భావన మాటల్లో వర్ణించలేని ఆనందం. టెస్ట్‌ట్యూబ్ బేబీని పొందడం ద్వారా నా తల్లి, పుట్టడం ద్వారా నేను, నాకు పుట్టడం ద్వారా నా కుమార్తె.. ఇలా ముగ్గురం చరిత్రలో స్థానం సంపాదించుకోవడం రికార్డు.’’ - ఇరవైనాలుగేళ్ల క్రితం టెస్ట్‌ట్యూబ్ బేబీగా పుట్టి, ఇప్పుడు తానే బిడ్డకు తల్లైన కమలా రత్నం ‘కొద్దిమంది పెద్దల సమక్షంలో ఆ అమ్మాయి పెళ్లిని గుట్టు చప్పుడు కాకుండా జరిపించాం. అదృష్టవశాత్తూ ఏడాది తిరిగేలోపే ఆమె గర్భం దాల్చింది, ఈ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచాం. ఎందుకంటే ప్రపంచ వైద్య చరిత్రలో ఇదొక అపూర్వఘట్టం. అందుకే అలా కాపాడుకోవలసి వచ్చింది’ అన్నారు చెన్నైలో జీజీ ఆసుపత్రి నడుపుతున్న డాక్టర్ కమలా సెల్వరాజ్. ఈ నెల మొదటి వారం దాకా ఆమె పడ్డ ఈ ఆందోళనలో ఎంతో అర్థం ఉంది. దాని వెనుక తల్లినీ, బిడ్డనూ కాపాడుకోవాలనే ఆర్ద్రత ఉంది. వైద్య చరిత్రలో తాను సాధించిన సువర్ణాధ్యాయాన్ని నిలబెట్టుకోవాలనే తపన ఉంది. ఇంతకీ ఎవరా గర్భం దాల్చిన స్త్రీ? ఆమె తల్లి కావడం వైద్య చరిత్రలో ఎందుకు అపూర్వం? వీటికి జవాబు కోసం పాతికేళ్ళు వెనక్కి వెళ్ళాలి. 1980ల నాటి చివరి రోజులవి... వివాహమైన ప్రతి స్త్రీ లాగానే తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాకు చెందిన పొన్నా కూడా తల్లి కావాలనుకున్నారు. పెళ్లయి రెండు పదుల సంవత్సరాలు దాటుతున్నా పిల్లా పాపల కేరింతలకు ఆమె, ఆమె భర్త రామమూర్తి నోచుకోలేదు. ఎందరెందరో వైద్యులను సంప్రదించినా బిడ్డ కావాలన్న వారి కోర్కె నెరవేరలేదు. తమిళ సినీ దిగ్గజం ‘జెమినీ’ గణేశన్ (మహానటి సావిత్రి భర్త) అంటే రామమూర్తికి చిన్ననాటి నుండి ఇష్టం. ఆ ఇష్టమే ఆయన కోర్కె నెరవేరేందుకు కారణమైంది. ‘‘ఒక రోజు మా నాన్న జెమినీ గణేశన్ వచ్చి, రామమూర్తి, పొన్నా దంపతులను నాకు పరిచయం చేశారు’’ డాక్టర్ కమలా సెల్వరాజ్ అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు. ‘‘అప్పుడే నేను ఆధునిక టెస్ట్‌ట్యూబ్ బేబీ విధానంపై శిక్షణ పొంది వచ్చాను. మా నాన్న కోర్కె, ఆ దంపతుల ఆశను నెరవేర్చాలని ఈ తొలి కేసును సవాలుగా తీసుకొని, సక్సెస్ చేశా. 1990 ఆగష్టు 1న రామమూర్తి, పొన్నా దంపతులకు టెస్ట్‌ట్యూబ్ విధానంలో ఆడబిడ్డ పుట్టింది. ప్రపంచంలోనే ఇది మూడో టెస్ట్‌ట్యూబ్ బేబీగా మెడికల్ కౌన్సిల్ గుర్తించింది’’ అని ఆమె చెప్పుకొచ్చారు. వైద్య మేధ కృషి ఫలంగా ఆమె చేతుల్లో పుట్టిన కమలా రత్నం అణువంత తేడా కూడా లేకుండా సాధారణ యువతుల్లానే ఎదిగింది. యుక్తవయస్సుకు వచ్చిన కమలకు పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు తల్లిదండ్రులు చెప్పారు. ‘‘టెస్ట్‌ట్యూబ్ బేబీకి పెళ్లి అనగానే అందరి దృష్టీ పడి, ఇబ్బందు లొస్తాయి. అందుకే రహస్యంగా పెళ్లి చేయాలని కోరాను. ముఖ్యమైన బంధువులు, మా కుటుంబం సమక్షంలో గత ఏడాది వివాహం జరిగింది. కొద్ది నెలల్లోనే కమలా రత్నం గర్భం దాల్చిందని తెలుసుకుని ఎంతో సంతోషించాను. అయితే మళ్లీ మరో సవాల్. అందుకే, ప్రసవం అయ్యేవరకు ఎవరికీ చెప్పవద్దని షరతు పెట్టాను. టెస్ట్‌ట్యూబ్ బేబీగా ఇరవై నాలుగేళ్ళ క్రితం ఈ లోకంలోకి వచ్చిన కమలా రత్నం అప్పట్లో 2.5 కిలోల బరువుతో పుడితే, ఆమె కడుపున ఈ జూలై 10న పుట్టిన ఆడపిల్ల 2.8 కిలోల బరువుంది’’ అని ఈ డాక్టర్ నవ్వుతూ చెప్పారు. అప్పట్లో ప్రపంచంలోని తొలి తరం టెస్ట్‌ట్యూబ్ బేబీలలో ఒకరిగా రికార్డుల్లోకెక్కిన కమలా రత్నం ఇప్పుడు మాతృ త్వంతో, ఆ ఘనత సాధించిన తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీగా మరో కొత్త చరిత్ర లిఖించారు. ‘‘టెస్ట్‌ట్యూబ్ బేబీలు సాధారణ పిల్లలలా ఎదుగుతారా అని చాలామందికున్న అనుమానం పటాపంచలైంది. అన్నేళ్ళ క్రితం నా చేతుల్లో ఊపిరిపోసుకున్న టెస్ట్‌ట్యూబ్ బేబీ, ఇప్పుడు తల్లి కావడంతో నా ఆనందానికి అవధులు లేవు’’ అని ఆమె మెరుస్తున్న కళ్ళతో అన్నారు. అవును... ఓ బిడ్డకు ప్రాణం పోసి, ఇప్పుడు మళ్ళీ ఆ బిడ్డకు పుట్టిన మరో బిడ్డను జాగ్రత్తగా ఈ లోకంలోకి తెచ్చిన వైద్యురాలికి అంతకన్నా ఆనందం, ఆత్మతృప్తి ఇంకేముంటాయి! - కొట్రా నందగోపాల్, బ్యూరో ఇన్చార్జ్, చెన్నై -
టెస్ట్‌ట్యూబ్ విధానంలో కవలలు జననం
జగన్నాథపురం (కాకినాడ), న్యూస్‌లైన్ : టెస్ట్‌ట్యూబ్ విధా నం ద్వారా గర్భం దాల్చిన ఓ మహిళ గురువారం కాకినాడలోని సృ జనా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి, ఐవీఎఫ్ సెంటర్లో కవలలకు జన్మనిచ్చింది. యానాంకు చెందిన ఎన్.శ్రీదేవి (29) టెస్ట్‌ట్యూబ్ విధానం ద్వారా గర్భం దాల్చింది. ఆమెకు గురువారం డాక్టర్ డి.ఎల్.సత్యవతి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేయగా ఒక ఆడబిడ్డకు, ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. వీరిలో ఒకరు 2.2 కేజీల బరువు ఉండగా మరొకరు 2.1 కేజీ ఉన్నారు. -
శాస్త్రబాలకు శుభాకాంక్షలు
ఈరోజుకొక ప్రత్యేకత ఉంది. కానీ ఆ ప్రత్యేకతను మన దేశానికిచ్చిన అమ్మాయికి... మనం ఏ విధమైన ప్రత్యేకతనూ ఇవ్వలేకపోయాం! ఈ ‘డే’ అనీ, ఆ ‘డే’ అనీ... డే బై డే... ఏదో ఒక ‘డే’ జరుపుకుంటూనే ఉన్నాం. ఆమె గుర్తుకొచ్చేలా మాత్రం ఒక్క ‘డే’నైనా ఘనంగా, గౌరవంగా ప్రకటించుకోలేకపోయాం. ఇవాళ ఆమె బర్త్ డే. పేరు హర్షాచావ్డా. భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ! పండంటి బిడ్డ పుడితే ‘పూజాఫలం’ అంటారు. ఆ మాటను సైన్స్ అంగీకరించదు కాబట్టి... హర్షాచావ్డాను ‘శాస్త్రవిజ్ఞాన విజయఫలం’ అనాలి. అంతటి విజయాన్ని ప్రసాదించిన ఈ ‘శాస్త్రబాల’ఇప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? శాస్త్రం ‘సంతానప్రాప్తిరస్తు..’ అని దీవించింది! దాదాపు నాలుగుదశాబ్దాల కిందట వైద్య జీవశాస్త్రంలో జరిగిన ఈ అద్భుతం... అలుపెరగక జనాభా వృద్ధి చెందుతున్న దేశంలోనూ కొందరు అభాగ్య నిస్సంతు తల్లిదండ్రులకు ఆశాకిరణంగా నిలిచింది. అలా తొలిసారి ఉదయించిన ఆ ఆశాకిరణమే ‘హర్షా చావ్డా’. కృత్రిమ గర్భధారణ. (ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్.. మహిళ అండాన్ని, పురుషుడి శుక్రకణాన్ని సేకరించి, ఫలదీకరణ చేయించి, ఈ పిండాన్ని గర్భంలో ప్రవేశపెట్టే విధానం) ద్వారా భారతదేశంలో జన్మించిన తొలిబిడ్డ ‘హర్షాచావ్డా’. ఈ రోజు ఆమె పుట్టినరోజు. 1986 ఆగస్ట్ ఆరో తేదీన ముంబైలోని కేఈఎమ్ ఆసుపత్రిలో హర్షాచావ్డా జన్మించింది. నేటితో 27 ఏళ్లు నిండిన సందర్భంలో హర్ష గురించి, టెస్ట్‌ట్యూబ్ బేబీల ప్రస్థానం గురించిన వివరాలివి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కింగ్‌ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్(కేఈఎమ్) ఆసుపత్రిలో ప్రతి రోజూ ఎంతో మంది పిల్లలు జన్మిస్తుంటారు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రి డాక్టర్లు వేలాదిమంది గర్భిణులకు ఆసరాగా ఉంటారు. ఇలాంటి ఆసుపత్రికి హర్షాచావ్డా చరిత్రలో నిలబడిపోయే గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ఆసుపత్రి డాక్టర్ ఇందిరా హిందూజా సంరక్షణలో శామ్‌జీ చావ్డా, మణిచావ్డా దంపతులకు హర్ష జన్మించింది. వీరిదొక సాధారణ మధ్యతరగతి కుటుంబం. సంతాన సాఫల్యం కోసం వైద్యులను ఆశ్రయించిన ఆ దంపతుల సమ్మతితో ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ ప్రక్రియను ప్రయోగించారు డాక్టర్ ఇందిర. అది విజయవంతం అయ్యి హర్ష జన్మించింది. పుట్టుక ఒక సంచలనం... భారతీయ వైద్యులు సాధించిన ఘనతగా, సృష్టికి ప్రతి సృష్టి అనదగ్గ ప్రక్రియలో జన్మించిన అద్భుతంగా హర్ష గొప్ప గుర్తింపు దక్కించుకుంది. అప్పటికే వందకోట్ల జనాభాకు దగ్గరపడ్డ దేశంలో పుట్టుకతోనే ప్రత్యేకమైన బేబీగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష గురించిన ప్రతి అంశమూ చాలా ఆసక్తికరమే అయ్యింది. ఇప్పటికీ దేశంలోని తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీగా హర్షకు అంతే ప్రత్యేకత ఉంది. అయితే ఈ ప్రత్యేకత ఆమె వ్యక్తిగత జీవితానికి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. అసహజమైన పద్ధతిలో జన్మించిన హర్ష మనదేశంలోని సహజమైన సమస్యలతో సహవాసం చేస్తోంది. ఆర్థికపరమైన ఇబ్బందులు, నిరుద్యోగం వంటి సమస్యలు హర్ష వంటి ప్రత్యేకమైన బేబీని కూడా వదల్లేదు. ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో తన తల్లి మణితో కలిసి ఉంటోంది హర్ష. ఆమె తండ్రి మరణించాడు. దీంతో పెద్దదిక్కులేని ఈ కుటుంబానికి ఆసరా లేకుండా పోయింది. ముంబై యూనివర్సిటీ నుంచి కామర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన హర్ష కుటుంబ పరిస్థితులతో ఏదో ఒక జాబ్ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నాలుగైదు వేల జీతాన్నిచ్చే ఉద్యోగాలను చేస్తూ వచ్చిన హర్ష రెండేళ్ల క్రితం నిరుద్యోగిగా మారింది. తల్లి అనారోగ్యం కారణంగా డ్యూటీకి వెళ్లలేకపోవడంతో ఉద్యోగం నుంచి తీసేశారని హర్ష చెప్పింది. ‘ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిలో జన్మించాను అనే ప్రత్యేకత తప్ప నా జీవితంలో మరే ప్రత్యేకతా లేకుండా పోయింది..’అంటూ హర్ష నిర్వేదం వ్యక్తం చేసింది. హర్ష తల్లి కూడా ఇలాంటి భావననే వ్యక్తపరిచారు. ‘మేం పేదవాళ్లం. భర్త పోయాక పరిస్థితి మరింత దిగజారింది. దేశంలో పుట్టిన తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీకి తల్లిని అనే గొప్ప తప్ప నాకు మిగిలిందేమీ లేదు...’ అని మణి చావ్డా అన్నారు. ఇది జరిగి రెండేళ్లయింది. అయితే ఇప్పటికీ హర్షకు మంచి ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవు. చిన్న చిన్న ఉద్యోగాలతో, చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తోంది. పుట్టిన రోజు పండగ కాలేదు! ఈ రోజు హర్ష పుట్టినరోజు! ఇది భారతీయ వైద్యశాస్త్రంలో ఒక ప్రత్యేకమైన రోజు. మన డాక్టర్ల నైపుణ్యానికి కొత్త గుర్తింపు తెచ్చిపెట్టిన రోజు. ఒక పండగ రోజు! ఈ విషయాన్నే హర్ష తల్లివద్ద ప్రస్తావిస్తే... ఇప్పుడు తన కూతురి పుట్టినరోజును పండగగా జరుపుకునే స్థాయిలో లేమని అంటారు. ఈ విధంగా భారతదేశంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అయిన హర్ష పుట్టిన రోజు ఎటువంటి ప్రత్యేకత లేకుండానే గడిచిపోతోంది. మనమైనా ఈ శాస్త్రబాలకు శుభాకాంక్షలు చెబుదాం. - జీవన్ టెస్ట్‌ట్యూబ్ బేబీల జనాభా 50 లక్షలు..! ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 700 కోట్లు. వీరిలో ప్రకృతి సహజంగా జన్మించిన వారు ఎంతమంది? అంటే 50 లక్షల మంది టెస్ట్‌ట్యూబ్ బేబీలను మైనస్ చేసుకోవాల్సిందే. మన దేశంలో మాత్రం టెస్ట్‌ట్యూబ్ బేబీల సంఖ్య బాగా తక్కువ. దేశ జనాభాతో పోల్చినప్పుడు వీరి నిష్పత్తి అంతర్జాతీయ స్థాయి కన్నా చాలా తక్కువగా ఉంది. దేశంలో టెస్ట్ట్యూబ్బేబీలు వేల సంఖ్యలో మాత్రమే ఉన్నారని ఒక అంచనా. ఇక్కడి వాతావరణ పరిస్థితులతో టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ విజయవంతం అయ్యే అవకాశాలు తక్కువేనని నిపుణులు అంటారు. ఉద్యోగాన్ని సృష్టించడం సాధ్యం కాలేదా! సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ... మనిషి తన మేధస్సుతో మరో మనిషికి జన్మనివ్వగలడేమో కానీ.. ఆ మనిషికి తగిన కనీస సదుపాయాలను కల్పించే స్థితిలో మాత్రం లేడని హర్షను చూస్తే అనుకోవాల్సి వస్తోంది. విద్యార్హతలున్నప్పటికీ, ఒక వ్యక్తికి ఉద్యోగాన్ని సృష్టించడం మనిషిని సృష్టించినంత సులభం కాదని అర్థమౌతోంది! ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ బాధ్యతను ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? క్రీడాకారుల కోటాలో, ఇంకా వివిధ కోటల్లో ప్రభుత్వం ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. అలాంటిది దేశంలోనే తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ అనే ప్రత్యేకతను కలిగి ఉన్న హర్షను ప్రభుత్వం కానీ, వైద్య శాస్త్ర ప్రముఖులు కానీ పట్టించుకోకపోవడం దురదృష్టకరం. హర్ష, ఇందిర లకే ఈ గుర్తింపు ఎలా దక్కిందంటే.. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో పుట్టిన తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ హర్ష కాదు! ‘దుర్గ’ అలియాస్ కనుప్రియా అగర్వాల్. ప్రపంచంలో తొలిసారి 1978 జూలై 25న లూసీ బ్రౌన్ కళ్లు తెరవగా... అదే ఏడాది అక్టోబర్ మూడున మనదేశంలో ‘దుర్గ’ జన్మించింది. ఇలా దేశంలో తొలి ఐవీఎఫ్ విజయాన్ని అందించింది డాక్టర్ సుభాష్ ముఖోపాధ్యాయ. కలకత్తాకు చెందిన సుభాష్ ఆవిష్కరించిన అద్భుతం ఆయన పాలిట ఒక శాపంగా మారింది. అవమానాలు ఎదురయ్యాయి. సామాజికంగా వేధింపులు ఎదురయ్యాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వమే ‘దుర్గ’ జననాన్ని నైతికంగా ప్రశ్నిస్తుండటంతో మానసిక వేదనకు గురై ఉపాధ్యాయ 1981 జూన్19న ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గ పుట్టిన ఎనిమిదేళ్ల తర్వాత హర్ష జన్మించింది. ఈ ప్రకియకు అధికారిక ధ్రువీకరణ రావడంతో హర్షాచావ్డా, గైనకాలజిస్ట్ ఇందిర హిందూజాలు రికార్డు పుటల్లో స్థానం సంపాదించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి యేటా 1.5 లక్షల మంది టెస్ట్‌ట్యూబ్ బేబీస్ జన్మిస్తున్నారని అంచనా. ఈ విషయంలో మనదేశంలో బాగా వెనుకబడి ఉంది. సాంఘికపరమైన పరిస్థితులు, ఖర్చు, సక్సెస్ రేటు.. ఈ మూడు విషయాలూ మన దేశంలో టెస్ట్ట్యూబ్బేబీస్ సంఖ్యను ప్రభావితం చేస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐవీఎఫ్ పద్ధతిలో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది. 35 యేళ్లలోపు మహిళల్లో కూడా 33.1 శాతం ప్రయోగాలు మాత్రమే విజయవంతం అవుతున్నాయి. టెస్ట్‌ట్యూబ్ బేబీస్ హెల్త్ రిస్క్ గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. కొన్ని అధ్యయనాలేమో ఐవీఎఫ్ పద్ధతిలో జన్మించిన వారి ఆరోగ్యస్థితి, ఆయుఃప్రమాణం సాధారణ మనిషిలాగే ఉంటుందని అభ్రిపాయపడ్డాయి. మరికొన్ని అధ్యయనాలు ప్రీమెచ్యూర్ డెలివరీకి అవకాశం ఉంటుందని, పుట్టిన పిల్లల ఎమోషన్స్, సైకలాజికల్ స్ట్రెస్, ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సి రావడం వంటి సమస్యలు ఉంటాయని అభిప్రాయపడ్డాయి.